నిదురపోరా తమ్ముడా..

Wake Pit Dotcom Made Survey About People Effected With Insomnia - Sakshi

ఆఫీసులో లంచ్‌ లాగించాక.. మధ్యాహ్నం 1– 4 గంటల మధ్య కునుకుపాట్లు పడే ఉద్యోగులెందరో..ఇక ఆ పాట్లు వద్దు..ఏకంగా ఆఫీసులో కునుకేయడానికి ఏర్పాట్లు చేస్తే బెటర్‌ అని అంటున్నారు మెజారిటీ ఉద్యోగులు. నిద్రలేమికి పరిష్కారాలు కనుగొనే స్టార్టప్‌ సంస్థ వేక్‌ఫిట్‌.కామ్‌ ఇటీవల ఆన్‌లైన్‌లో చేపట్టిన దేశ వ్యాప్త సర్వేలో ఇదే తేలింది. ఈ సర్వే నివేదికను ‘పని వేళల్లో కునుకు ఒక హక్కు’ అన్న పేరుతో సదరు సంస్థ విడుదల చేయడం విశేషం.  

బోలెడన్ని లాభాలు.. 
మధ్యాహ్నం పూట కాస్త కునుకు వేస్తే.. మనిషిలో శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయని, వారి ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుందని ఇప్పటికే శాస్త్రీయంగా రుజువు కావడంతో ఈ సర్వేలోని అంశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్‌ ఆఫీసుల్లో పనిచేసేవారికి ఒత్తిడి ఎక్కువ ఉంటుందని.. దీన్ని అధిగమించడానికి కునుకు తీయడానికి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని సర్వే తెలిపింది. ‘దేశంలో నిద్రలేమికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయాయి.

అందుకే బడా కంపెనీలు, ఉద్యోగులతో అత్యధిక పని గంటలు చేయించుకునే సంస్థలు వాళ్లు కునుకు తీయడం కోసం ప్రత్యేకంగా చాంబర్లు పెట్టాలి‘ అని వేక్‌ఫిట్‌ సంస్థ డైరెక్టర్‌ చైతన్య రామలింగగౌడ చెబుతున్నారు. కాగా, గోద్రేజ్, ఎక్సెంచర్, గూగుల్, భారతి ఎయిర్‌టెల్, కోక కోలా వంటి సంస్థలు మాత్రమే పనిచేయడానికి అవసరమైన ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేసినట్టుగా ఈ సర్వే తెలిపింది. ఈ సంస్థలన్నీ కంపెనీ నియమనిబంధనల కంటే ఉద్యోగుల సంక్షేమం కోసం ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా పేర్కొంది.  

సర్వే ఏం చెప్పింది.. 

  • కునుకుతీయడానికి ఆఫీసుల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని చెబుతున్నవారు 86% 
  • పనిఒత్తిడితో రాత్రిపూట సరిగా నిద్రపట్టక, మర్నాడు ఆఫీసులో నిద్రమత్తుతో జోగుతున్నామని చెప్పినవారు 40%
  • వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే నిద్ర వస్తుందని చెప్పినవారు 80%
  • వారమంతా నిద్రతో తూలిపోతూ ఉంటామన్న వారు 5% 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top