మోసగాడి అరెస్టు

Vehicles mortgage..Fraud - Sakshi

పలు కేసుల్లో నిందితుడు

ఆరు నెలలుగా పరారీ

చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్‌ పోలీసులు  

కరీంనగర్‌క్రైం : వాహనాలు తనఖాపెట్టి మోసాలకు పాల్పడి  ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని సీసీఎస్‌ సీఐ కిరణ్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం సోమవారం పట్టుకుంది. కరీంనగర్‌లోని హెడ్‌క్వార్టర్‌లో విలేకరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌ మండలం తీగలగుట్టపల్లికి చెందిన వింజమూరి కళ్యాణ్‌చక్రవర్తి(39) తన తండ్రి తిరుపతయ్య నడిపిస్తున్న తిరుపతి డ్రైవింగ్‌ స్కూల్‌ వ్యవహారాలు చూసుకునేవాడు.

ఈ క్రమంలో ఆర్టీఏ అధికారులు, ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఫైనాన్స్‌ల్లో రుణాలు తీసుకునే పద్ధతులపై అవగాహన పెంచుకున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ కళ్యాణ్‌చక్రవర్తి డబ్బుల కోసం పక్కదారితొక్కాడు. తన మిత్రుడు శ్రీరామోజు వెంకటేశ్వర్లుకు చెందిన కారును తరచూ అవసరాలకు వాడుకునేవాడు. వెంకటేశ్వర్లు కారుతో బ్యాంక్‌ లోన్‌ తీసుకుని  ఠంఛన్‌గా వాయిదాలు చెల్లిస్తున్నాడు.

ఈ చనువుతో వెంకటేశ్వర్లు కారును తనకు విక్రయించినట్లు కళ్యాణ్‌చక్రవర్తి తప్పుడు పత్రాలు సృష్టించి, బ్యాంక్‌ లోన్‌ చెల్లించినట్లు నకిలీ ఎన్‌వోసీ తయారు చేశారు. వీటిని ఆర్టీఏ అధికారులకు సమర్పించి మరో ఫైనాన్స్‌లో లోను తీసుకున్నాడు. ఇలా ఒక్క వెంకటేశ్వర్లుకు చెందిన కారుపై 2016–17లో ఆరు ఫైనాన్స్‌ల్లో సుమారు రూ.20లక్షలు రుణం తీసుకున్నాడు. అంతేకాకుండా తన పేరిట ఉన్న రెండు లారీలపై నకిలీ ఎన్‌వోసీలు తయారు చేసి లోన్లు తీసుకున్నాడు.

తల్లి వింజమూరి భాగ్యలక్ష్మి పేరిట ఉన్న రిట్జ్‌కారుపై లోను తీసుకుని దాన్ని తన మిత్రుడు చందనారెడ్డి పేరిట మార్చి మళ్లీ లోను తీసుకున్నాడు. ఇలా మూడేళ్లలో మారుతి స్విఫ్ట్‌డిజైర్, మారుతిరిట్జ్, రెండులారీలపై నకలీపత్రాలు తయారుచేసి రూ.70లక్షలు వరకు వివిధ ఫైనాన్స్‌ల నుంచి లోన్లు తీసుకున్నాడు.  

వెలుగుచూసింది ఇలా.. 

కళ్యాణ్‌ చక్రవర్తి తన మిత్రుడైన వెంకటేశ్వర్లు పేరిట ఉన్న కారుకు నకిలీపత్రాలు సృష్టించి ఆరు ఫైనాన్స్‌ల్లో లోన్లు తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించకపోవడంతో ఓ ఫైనాన్స్‌ కంపెనీ వారు కారు ఎక్కడ ఉందో కనుక్కొని వెంకటేశ్వర్లు ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. కానీ తాను ఎస్‌బీహెచ్‌లో లోను తీసుకుని.. వాయిదాలు చెల్లిస్తున్నానని చెప్పినా వినకుండా కారు లాక్కెళ్లారు. దీనిపై వెంకటేశ్వర్లు కరీంనగర్‌ వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ తుల శ్రీనివాసరావు విచారణ చేపట్టగా పై అంశాలు వెలుగుచూశాయి. దీంతోపాటు బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఐదు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు విషయం తెలుసుకున్న కళ్యాణ్‌ చక్రవర్తి తన కుటుంబంతో సహ పరారై హైదరాబాద్‌లో దాక్కున్నాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో నిందితుడిని కోసం గాలించేందుకు సీసీఎస్‌ సీఐ కిరణ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

వీరు వారంపాటు హైదరాబాద్‌లో మకాం వేసి కళ్యాణ్‌ చక్రవర్తి కదలికలపై నిఘా పెట్టారు. ఆచూకీ కనిపెట్టిన పోలీసులు సోమవా రం ఉదయం అతడు దాక్కున్న ఇంటిపై దాడి చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేయడంతోపాటు అతనికి సహకరించిన చందనారెడ్డిని సైతం అదు పులోకి తీసుకున్నారు. వారు పలు ఫైనాన్స్‌లను ఎలా మోసం చేశారో తెలుసుకున్నారు. వీరిని  కోర్టులో ప్రవేశపెట్టి, కస్టడీకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని సీపీ తెలిపారు.

కళ్యాణ్‌ చక్రవర్తికి సహకరించిన వింజమూరి భాగ్యలక్ష్మి, షేక్‌ అబ్దుల్లా, నాగుల దేవేందర్, ఎండీ యూసుఫొద్దీన్‌ పరారీలో ఉన్నారని వారిని త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. కళ్యాణ్‌ చక్రవర్తి చేసిన మోసాల్లో చాలా వరకూ ఆర్టీఏ అధికారుల సహకారం ఉందనే ప్రచారం ఉంది. ఆర్టీఏ అధికారుల పాత్రపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.  

అధికారులకు రివార్డులు 

ఆరు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్‌ ఏసీపీ శ్రీనివాస్, సీసీఎస్‌ సీఐ కిరణ్, వన్‌టౌన్‌ సీఐ శ్రీనివాసరావు, సీసీఎస్‌ ఎస్సైలు నాగరాజు, సాగర్‌ను అభినందించారు.       

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top