వాహన బీమా..భవితకు ధీమా

Vehicle Insurance  - Sakshi

బైక్‌కు ఐదేళ్లు, కారుకు మూడేళ్లు బీమా చేయించాల్సిందే

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈనెల 1న  ప్రారంభమైన పాలసీలు

వాహనదారుల్లో మిశ్రమ స్పందన

ఖిలా వరంగల్‌ : ఏదైనా కొత్త వాహనం కొనాలంటే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఇక ముందు మరింత ఆలోచించాల్సిందే.. బీమా  విధానంలో వచ్చిన కొత్త నిబంధనలు సామాన్యులకు కొంత భారంగా పరిణమించాయి. ఎందుకంటే ప్రతి ద్విచక్ర వాహానానికి ఐదేళ్లు, ఇతర వాహనాలకు మూడేళ్లు  బీమా తప్పనిసరి చేశారు.  ఇది వినియోగదారులకు భారమే అయినా.. భవిష్యత్‌లో వాహనదారులకు ఇది ఎంతగానో మేలు చేస్తుందని వాహన కంపెనీలు చెబుతున్నాయి.

వాస్తవంగా కొత్త వాహనం కొనేముందు దాని ఖరీదు ఎంత.? రిజిస్టేషన్, ట్యాక్స్‌లు, బీమా ప్రీమియం ఎంత అని చాలా మంది  వందరకాల ఆలోచనలు చేస్తుంటారు. ఏరకంగా ఆయినా వాహనంపైన రూ.100, రూ.500 తగ్గతుందేమోనని ఆశతో  అన్ని రకాలుగా పరిశీలిస్తారు. అయితే ప్రస్తుతం ఇన్సూరెన్స్‌ కంపెనీలు సుప్రీం కోర్టు ఆదేశాలతో వాహన కొనుగోలు దారులకు కోలుకోలేని షాక్‌ ఇస్తూ కొత్త విధివిధానాలను అమల్లోకి తెచ్చాయి.

ఒకేసారి బీమా చేయించాల్సిందే..

వాహనదారుల నిర్లక్ష్యంపై సుప్రీం కోర్టు గత నెల మోటారు యాక్ట్‌ ప్రకారం 29వ తేదీన ఇన్సూరెన్స్‌ విధానాల్లో ఆనేక సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై జూలై 20న థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్, కాల పరిమితి పెంచుతూ వాదోపవాదాల అనంతరం నిర్ణయం తీసుకుంది. ఈ నూతన విధానం సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. నూతన ఇన్సూరెన్స్‌ అమలు.. వాహన చోదకులకు భారమైనా కూడా వారి కుటుంబాలకు భరోసా  కల్పిస్తోంది.

 ఇక నుంచి ఎటువంటి ద్విచక్రవాహనం కొన్నా , ఒకేసారి ఐదేళ్ల కాలానికి బీమా సొమ్ము కట్టాల్సిందే. కారు కొనే వారు కూడా మూడేళ్ల  కాలానికి ఒకేసారి బీమా సొమ్ము చెల్లించాల్సి ఉంది.   ఒకేసారి ఎక్కువ మొత్తంలో బీమా సొమ్ము చెల్లించడం తలకు మించిన భారం అని వినియోగదారులు వాపోతున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల నడ్డీ విరుగుతుందని చెబుతున్నారు.                                                                                                    
వాహనాల ధర యధాతథం..

ప్రస్తుతం వాహనాల ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. కానీ వాటిని కొనుగోలు చేసే సమయంలో గతంలో అయితే ఒక ఏడాదికి బీమా చేయిస్తే సరిపోయేది. అయితే ప్రస్తుతం ఆలా కుదరదు. ఇంజన్‌ సామర్థ్యం ఆధారంగా బీమా బాదుడు ఉంటుంది.  ద్విచక్ర వాహనంపై రూ.15వేలు, కారుపై అయితే రూ.20వేల వరకు ఆదనంగా భారం పడనుంది.

థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి..

వాహనచోదకులకు ప్రమాదం జరిగితే వాహనదారుడికి, వాహనానికి, రక్షణ కల్పించడమే థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ ఉద్దేశం. థర్డ్‌ పార్టీ  ఇన్సూరెన్స్‌ కారు, ద్విచక్రవాహనానికి తప్పని సరి చేస్తూ సుప్రీం కోర్టు  ఉత్తర్వుల జారీ చేసింది. ఈవిధానం సెప్టెంబర్‌1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. 

నిర్లక్ష్య వైఖరి కారణంగానే ..            

వాహనదారుల్లో చాలా మంది ఒక ఏడాది బీమా ప్రీమియం కట్టిన తర్వాత మరో ఏడాది బీమా చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇంకొంత మంది వాహనం కొన్న తర్వాత బీమా చేయించడం మానేశారు.  దీంతో రోడ్డు ప్రమాదాల సమయాల్లో  బీమా పరిహారం అందకోలేని పరిస్థితి ఏర్పడింది.  ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నష్ట పరిహారం అందజేసేందుకురోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, బండి చోరీకి గురైనప్పుడు నష్టపోయిన వారికి కచ్చితంగా పరిæహారం అందించాలనే ఉద్దేశంతో సుప్రీం కోర్టు బీమా కంపెనీలకు తాజాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.  అందుకే మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ ప్రకారం ఐదేళ్లు, మూడేళ్లు  బీమాను తప్పని సరి చేసింది. దీని ద్వారా ప్రతి ఒక్క వాహనదారుడు ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ పొందే వెసులుబాటు కల్పించింది.

ఐదేళ్లకు ఒకేసారి అంటే చాలా కష్టం

వాహనం కొనుగోలు చేసే సమయంలో ఐదేళ్లకు బీమా చేయాలంటే చాలా కష్టం. అసలే మధ్య తరగతి కుటుంబాలు.. ఎన్నో అవస్థలు పడి బండి కొంటాం.. ఒక ఏడాది ఇన్సూరెన్స్‌ అంటే ఏదో కింద మీదా పడి చెల్లిస్తాం. అటువంటిది ఐదేళ్లకు ఒకేసారి ఇన్సూరెన్స్‌ కట్టాలంటే ఇబ్బందే. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి తగు నిర్ణయం తీసుకోవాలి. 

– గాదె స్వరూప్‌రెడ్డి, వాహనదారుడు

ఇది చాలా మంచి నిర్ణయం

 ప్రస్తుతం వాహనాలు కొంటున్న వారు  ఒక ఏడాదికే ఇన్సూరెన్స్‌ చేయించుకుంటున్నారు.  అయితే సుప్రీం కోర్టు  ఐదేళ్లు, మూడేళ్లు ఇన్సూరెన్స్‌ తప్పని సరి చేయడంతో వాహనదారులకు  భద్రత ఉంటుంది.  ఇది చాలా మంచి  నిర్ణయం. ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన అవసరం ఉంది .           
 – బొలుగొడ్డు శ్రీనివాస్, వాహనదారుడు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top