
సాక్షి, హైదరాబాద్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ, తవ్వకాలకు సంబంధించి అటామిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ)కు రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు ఇచ్చిన అనుమతులు రద్దయ్యాయి. యురేనియం నిల్వలున్నాయో లేదో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్‌తోపాటు వెలికితీతకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని రాష్ట్ర అటవీ శాఖ స్పష్టం చేసింది. గత ఏఎండీ ప్రతిపాదనలకు పూర్తి భిన్నంగా ప్రస్తుత ప్రాజెక్టు స్వరూపం మారడం తో నల్లమలలో 4 వేల బోర్లు వేసి యురేనియం అన్వేషిస్తామంటూ ఏఎండీ పంపించిన కొత్త ప్రతి పాదనలు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అటవీ శాఖ స్పష్టీకరించింది. యురేని యం అన్వేషణకు 2016 డిసెంబర్‌లో తెలం గాణ స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశం ఇచ్చిన అనుమతులు, ఒప్పందాలు రద్దయినట్టుగా ఏఎండీ, కేంద్ర అటవీశాఖ, కేంద్ర వన్యప్రాణి బోర్డుకు తాజాగా లేఖల ద్వారా స్పష్టం చేసింది.
కలిసొచ్చిన నిబంధనలు..
నల్లమలలో ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం లో యురేనియం అన్వేషణలో అడవికి నష్టం కలి గించేలా ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదనే అటవీ నిబంధనల్లో పొందుపరచడం రాష్ట్ర అటవీ అధికారులకు కలిసొచ్చింది. అందుకు విరుద్ధంగా ఏఎండీ ప్రతిపాదిత చర్యలున్నందున గతంలో ఆమోదించిన ప్రతిపాదనలకు ఎలాంటి విలువలేకుండా పోయిందని అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 2016లో జరిగిన వైల్డ్‌లైఫ్ బోర్డు సమావేశంలో పర్యావరణవేత్తలుగా ఉన్న పలువురు సభ్యులు టైగర్ రిజర్వ్‌లో అన్వేషణకు ఎలాంటి తవ్వకాలు జరపరాదని, అందుబాటులో ఉన్న మార్గాలు, ఇతర నియమ, నిబం ధనలను మినిట్స్‌లో నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో 2016 సమావేశంలోని నమోదు చేసిన మినిట్స్‌కు వ్యతిరేకంగా తాజా ప్రతిపాదనలున్నందున గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నట్టు అటవీశాఖ ప్రకటించింది. శాస్త్ర, సాంకేతికపరమైన అవసరాల కోసం యురేనియం అన్వేషణ అవసరం పడితే అది ఎలా చేస్తారు, దానికి అనుసరించే పద్ధతులు, సాంకేతికతకు సంబంధించి ఏఎండీ కొత్త ప్రతిపాదనలను స్టేట్ వైల్డ్‌లైఫ్ బోర్డుకు పంపిస్తే వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.
ఉభయసభల తీర్మానంతో..
రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసేం దుకు అనుమతివ్వబోమని కౌన్సిల్‌లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. యురేనియం నిక్షేపాల పరిశోధన, తవ్వకాలకు అనుమతులు ఇచ్చేది లేదంటూ ఉభయసభల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడంతో అటవీ అధికారులు తాజాగా శాఖాపరంగా తమ వైఖరి స్పష్టంచేశారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అటవీ శాఖ పూర్తిస్థాయిలో కట్టుబడిఉందని, డ్రిల్లింగ్ చేయకుండా యురేనియం నిక్షేపాల అన్వేషణ చేపడతామంటూ ఏఎండీ సమర్పించిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఇచ్చిన అనుమతులు కూడా రద్దయినట్టుగా లేఖ ద్వారా వెల్లడించింది.