టీచర్ల ఏకీకృత సర్వీసు రూల్స్‌పై కమిటీ | Sakshi
Sakshi News home page

టీచర్ల ఏకీకృత సర్వీసు రూల్స్‌పై కమిటీ

Published Wed, Sep 10 2014 12:18 AM

Unified service rules for teachers on the committee

మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక
పది రోజుల్లో రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరనున్న ప్రభుత్వం?

 
హైదరాబాద్: ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు రూల్స్ తేవడంపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. దీనిపై ముసాయిదా రూల్స్ రూపొందించేందుకు మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో పాఠశాల విద్యా కమిషనర్ జగదీశ్వర్ కమిటీని ఏర్పాటు చేశారు. పాఠశాల విద్య అదనపు డెరైక్టర్ (కో-ఆర్డినేషన్) గోపాల్‌రెడ్డి, మోడల్ స్కూల్స్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి, పాఠ్య పుస్తకాల ముద్రణాలయం డెరైక్టర్ సుధాకర్, జాయింట్ డెరైక్టర్ (సర్వీసెస్) శ్రీహరిలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులతో జగదీశ్వర్ సమావేశమై చర్చించారు. మూడు రోజుల్లో కొత్త రూల్స్ రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని నిర్ణయించారు. కొత్త రాష్ట్రం ఏర్పడినందున విభజన చట్టంలోని నిబంధనల మేరకు కొత్తగా రూల్స్ రూపొందించుకునే అవకాశం లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ టీచర్లను కూడా స్టేట్ లోకల్ కేడర్‌గా గుర్తించాలనే ప్రధాన సిఫారసుతో ఈ నివేదికను రూపొందించనున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను మాత్రమే లోకల్ కేడర్‌గా గుర్తిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో (371 డి) పొందుపరిచారు. ఇప్పుడు జిల్లా పరిషత్, మండల పరిషత్, గిరిజన సంక్షేమ టీచర్ పోస్టులనూ స్టేట్ లోకల్ కేడర్‌గా గుర్తించడం ద్వారా ఉపాధ్యాయులందరికీ ఒకే రకమైన సర్వీసు రూల్స్ అందుబాటులోకి తేవచ్చని నిర్ణయించారు.

పాఠశాలల్లో మెరుగైన విద్యనందించేందుకు ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ ఈఓ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఏకీకృత సర్వీసు రూల్స్‌తో టీచర్లందరికీ సమాన అవకాశాలు కల్పించి ఆ పోస్టులను భర్తీ చేయాలని సిఫారసు చేయనున్నారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో ప్రభుత్వ ఉపాధ్యాయులకు, విద్యాశాఖ మధ్య ఉన్న కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వేసినదైనందున, ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్వీసు రూల్స్ రూపొందించుకున్న నేపథ్యంలో ఆ కేసు సమస్య కాబోదనే నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ప్రభుత్వ పరిశీలన అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనున్నారు. మరోవైపు వీటి ఆమోదం కోసం ప్రభుత్వ వర్గాలు కూడా పది రోజుల్లో రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
 
Advertisement