breaking news
Unified service rules for teachers
-
‘టీచర్ రూల్స్’పై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులందరికీ ఒకే విధమైన సర్వీస్ నిబంధనలపై దాఖలైన వ్యాజ్యాలపై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. పిటిషన్‌కు సంబంధించి ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ప్రకటించింది. ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, ఇందుకు అనుగుణంగా గతేడాది జూన్ 23న రాష్ట్రపతి ఆమోదం తెలియజేసిన విషయం తెలిసిందే. దీంతో సర్వీస్ నిబంధనలను ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం హైకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. పంచాయతీరాజ్, ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించడంపై యథాతథస్థితి (స్టేటస్కో) కొనసాగించాలని మధ్యంతర ఆదేశాలిచ్చింది. అయితే స్టేటస్కో ఎత్తేయాలని, కేసులపై విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించగా.. బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది. రాజ్యాంగ వ్యతిరేకం: పిటిషనర్లు రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా వెలువడిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ 1975లోని పేరా 2ను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్య దర్శి వీరాచారి ఇతరులు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని 371(డి) అధికరణకు రాష్ట్రపతి ఉత్తర్వులు వ్యతిరేకమని వారి తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు వాదించారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు (మండల, జిల్లా పరిషత్‌లలో పనిచేసే వారు) స్థానిక సంస్థల పరిధిలోకి వస్తారని, వీరిని ప్రభుత్వ టీచర్లుగా పరిగణించేలా ఆదేశాలు జారీ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. 20 ఏళ్ల నుంచీ ఒకే తరహా ప్రకటన: ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థల్లో పని చేసే టీచర్లు కూడా సివిల్ సర్వెంట్లేనని, వారి విధులు కూడా ప్రభుత్వ టీచర్ల తరహాలోనే ఉంటాయని, రాష్ట్రపతి జారీ చేసిన ఏకీకృత సర్వీస్ రూల్స్‌కు పూర్తి చట్టబద్ధత ఉంటుం దని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గిరి, ఇతర న్యాయవాదులు వాదించా రు. 20 ఏళ్ల నుంచి టీచర్ పోస్టుల భర్తీకి ఒకే తరహా ప్రకటన జారీ చేయడమే కాకుండా ఏకీకృత విధానా న్నే అమలు చేస్తున్నామన్నారు. స్టేటస్కో ఎత్తేయడం తోపాటు ప్రభుత్వ టీచర్ల వ్యాజ్యాలు కొట్టేయాలన్నా రు. కాగా, రాష్ట్రపతి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఆ రాష్ట్రానికి చెందిన టీచ ర్లు దాఖలు చేసిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. -
టీచర్ల ఏకీకృత సర్వీసు రూల్స్‌పై కమిటీ
మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పది రోజుల్లో రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరనున్న ప్రభుత్వం? హైదరాబాద్: ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు రూల్స్ తేవడంపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. దీనిపై ముసాయిదా రూల్స్ రూపొందించేందుకు మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో పాఠశాల విద్యా కమిషనర్ జగదీశ్వర్ కమిటీని ఏర్పాటు చేశారు. పాఠశాల విద్య అదనపు డెరైక్టర్ (కో-ఆర్డినేషన్) గోపాల్‌రెడ్డి, మోడల్ స్కూల్స్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి, పాఠ్య పుస్తకాల ముద్రణాలయం డెరైక్టర్ సుధాకర్, జాయింట్ డెరైక్టర్ (సర్వీసెస్) శ్రీహరిలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులతో జగదీశ్వర్ సమావేశమై చర్చించారు. మూడు రోజుల్లో కొత్త రూల్స్ రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని నిర్ణయించారు. కొత్త రాష్ట్రం ఏర్పడినందున విభజన చట్టంలోని నిబంధనల మేరకు కొత్తగా రూల్స్ రూపొందించుకునే అవకాశం లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ టీచర్లను కూడా స్టేట్ లోకల్ కేడర్‌గా గుర్తించాలనే ప్రధాన సిఫారసుతో ఈ నివేదికను రూపొందించనున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను మాత్రమే లోకల్ కేడర్‌గా గుర్తిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో (371 డి) పొందుపరిచారు. ఇప్పుడు జిల్లా పరిషత్, మండల పరిషత్, గిరిజన సంక్షేమ టీచర్ పోస్టులనూ స్టేట్ లోకల్ కేడర్‌గా గుర్తించడం ద్వారా ఉపాధ్యాయులందరికీ ఒకే రకమైన సర్వీసు రూల్స్ అందుబాటులోకి తేవచ్చని నిర్ణయించారు. పాఠశాలల్లో మెరుగైన విద్యనందించేందుకు ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ ఈఓ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఏకీకృత సర్వీసు రూల్స్‌తో టీచర్లందరికీ సమాన అవకాశాలు కల్పించి ఆ పోస్టులను భర్తీ చేయాలని సిఫారసు చేయనున్నారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో ప్రభుత్వ ఉపాధ్యాయులకు, విద్యాశాఖ మధ్య ఉన్న కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వేసినదైనందున, ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్వీసు రూల్స్ రూపొందించుకున్న నేపథ్యంలో ఆ కేసు సమస్య కాబోదనే నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ప్రభుత్వ పరిశీలన అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనున్నారు. మరోవైపు వీటి ఆమోదం కోసం ప్రభుత్వ వర్గాలు కూడా పది రోజుల్లో రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.