‘టీచర్‌ రూల్స్‌’పై తీర్పు వాయిదా

high court Postponed judgment on Unified service for teachers - Sakshi

తర్వాత వెల్లడిస్తామన్న హైకోర్టు

ముగిసిన ఇరుపక్షాల వాదనలు

టీచర్లందరికీ ఒకే సర్వీస్‌ నిబంధనలు: ప్రభుత్వం

పంచాయతీరాజ్‌ టీచర్లు ‘స్థానికం’లోకి: పిటిషనర్లు

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయులందరికీ ఒకే విధమైన సర్వీస్‌ నిబంధనలపై దాఖలైన వ్యాజ్యాలపై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. పిటిషన్‌కు సంబంధించి ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ప్రకటించింది. ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్‌ నిబంధనలు అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, ఇందుకు అనుగుణంగా గతేడాది జూన్‌ 23న రాష్ట్రపతి ఆమోదం తెలియజేసిన విషయం తెలిసిందే. దీంతో సర్వీస్‌ నిబంధనలను ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం హైకోర్టులో సవాల్‌ చేసింది. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. పంచాయతీరాజ్, ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించడంపై యథాతథస్థితి (స్టేటస్‌కో) కొనసాగించాలని మధ్యంతర ఆదేశాలిచ్చింది. అయితే స్టేటస్‌కో ఎత్తేయాలని, కేసులపై విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించగా.. బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది.

రాజ్యాంగ వ్యతిరేకం: పిటిషనర్లు
రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా వెలువడిన ఏపీ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌ 1975లోని పేరా 2ను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్య దర్శి వీరాచారి ఇతరులు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని 371(డి) అధికరణకు రాష్ట్రపతి ఉత్తర్వులు వ్యతిరేకమని వారి తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రామచంద్రరావు వాదించారు. పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులు (మండల, జిల్లా పరిషత్‌లలో పనిచేసే వారు) స్థానిక సంస్థల పరిధిలోకి వస్తారని, వీరిని ప్రభుత్వ టీచర్లుగా పరిగణించేలా ఆదేశాలు జారీ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు.  

20 ఏళ్ల నుంచీ ఒకే తరహా ప్రకటన: ప్రభుత్వం
పంచాయతీరాజ్‌ సంస్థల్లో పని చేసే టీచర్లు కూడా సివిల్‌ సర్వెంట్లేనని, వారి విధులు కూడా ప్రభుత్వ టీచర్ల తరహాలోనే ఉంటాయని, రాష్ట్రపతి జారీ చేసిన ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌కు పూర్తి చట్టబద్ధత ఉంటుం దని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది గిరి, ఇతర న్యాయవాదులు వాదించా రు. 20 ఏళ్ల నుంచి టీచర్‌ పోస్టుల భర్తీకి ఒకే తరహా ప్రకటన జారీ చేయడమే కాకుండా ఏకీకృత విధానా న్నే అమలు చేస్తున్నామన్నారు. స్టేటస్‌కో ఎత్తేయడం తోపాటు ప్రభుత్వ టీచర్ల వ్యాజ్యాలు కొట్టేయాలన్నా రు. కాగా, రాష్ట్రపతి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఆ రాష్ట్రానికి చెందిన టీచ ర్లు దాఖలు చేసిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top