
రెండేళ్లలో 24 x 7 విద్యుత్
అంతరాయమే లేకుండా 24 x 7 విద్యుత్ సరఫరా. రెప్పపాటు కూడా విద్యుత్ కోతలుండవు. పల్లె, పట్నం..
- తెలంగాణలో సైతం ‘పవర్ ఫర్ ఆల్ ’ అమలు!
- సీఎం కేసీఆర్ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూల స్పందన
- రాష్ట్రంలో కేంద్ర విద్యుత్ శాఖ బృందం పర్యటన
- రాష్ట్ర విద్యుత్ అధికారులతో ప్రాథమిక చర్చలు
- 2017-18 నుంచి రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌కు హామీ
- తొలి విడత కింద ఇప్పటికే ఎంపికైన ఏపీ, రాజస్థాన్, ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: అంతరాయమే లేకుండా 24 x 7 విద్యుత్ సరఫరా. రెప్పపాటు కూడా విద్యుత్ కోతలుండవు. పల్లె, పట్నం.. గృహ, వాణిజ్య, వ్యవసాయం, పరిశ్రమలు అనే తేడాల్లేకుండా అందరికీ విద్యుత్. మరో రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఈ మైలురాయిని అందుకోనుంది. నిరంతర (24 x 7 ) విద్యుత్ సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘అందరికీ విద్యుత్ (పవర్ ఫర్ ఆల్)’ కార్యక్రమం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో 2017-18 నుంచి తెలంగాణలో సైతం అమలు కానుంది.
ఈ కార్యక్రమం తొలి విడత కింద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ ఎంపిక కాగా, త్వరలో ఈ జాబితాలో రాష్ట్రం సైతం చేరనుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి స్పష్టమైన హామీ లభించింది. ‘అందరికీ విద్యుత్’ కింద తెలంగాణను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల ఢిల్లీ పర్యటనలో చేసిన విజ్ఞప్తికి కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించింది. కేంద్ర విద్యుత్ శాఖ నుంచి వచ్చిన ఉన్నతాధికారుల బృందం సోమవారం విద్యుత్ సౌధలో రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో సమావేశమై రాష్ట్రంలో ‘అందరికీ విద్యుత్’ అమలుపై ప్రాథమిక చర్చలు జరిపింది.
కేంద్ర విద్యుత్ శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా నేతృత్వం వహించిన ఈ బృందంలో 11 మంది అధికారులున్నారు. రాష్ట్రంలో 24 x 7 విద్యుత్ కోసం చేపట్టాల్సిన చర్యలు, వనరులు, నిధులపై ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు నివేదించారు. రాష్ట్రం 4,320 మెగావాట్ల విద్యుదుత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉండగా.. మరో 6,680 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీటికితోడు మరో 2,500 మెగావాట్లను సమకూర్చుకుంటే నిరంతర విద్యుత్ ఇవ్వొచ్చన్నారు. దీనికి తగ్గట్లు విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.15 వేల కోట్ల నిధులు అవసరమని చెప్పారు.
ఈ మేరకు అదనపు విద్యుత్, నిధులను సమకూర్చాలని ప్రతిపాదించారు. కొత్తగా నిర్మిస్తున్న థర్మల్ ప్రాజెక్టులకు కావాల్సిన బొగ్గు కేటాయింపులతో పాటు పాత ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర బృందం సైతం సానుకూలత వ్యక్తం చేసింది. తెలంగాణను సైతం ‘అందరికీ విద్యుత్’ కార్యక్రమం కింద ఎంపిక చేస్తామని కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా స్పష్టమైన హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా సమగ్ర అధ్యయన నివేదిక (డీపీఆర్) సమర్పిస్తే నిర్ణయం తీసుకుంటామని సూచించారు. అనంతరం కేంద్ర బృందం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలసి ఆయనతో సమావేశమైంది.