ఆడా.. ఈడా మనోళ్లే!  | Two Telugu People Go To OTher States For Employment | Sakshi
Sakshi News home page

ఆడా.. ఈడా మనోళ్లే! 

Aug 13 2019 6:49 AM | Updated on Aug 13 2019 6:49 AM

Two Telugu People Go To OTher States For Employment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా తెలుగువారి జాడలే కనిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన పలువురు విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం ఆయా రాష్ట్రాల్లో తాత్కాలిక, స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నట్లు కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. వీరంతా దశాబ్దకాలం క్రితమే అక్కడికి వెళ్లి వివిధ రంగాల్లో సెటిల్‌ అయినట్లు వెల్లడించింది. ఏపీ నుంచి కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు.. తెలంగాణ నుంచి కర్ణాటక, మహారాష్ట్రలకు అత్యధికులు వలస వెళ్లినట్లు ఈ అధ్యయనం పేర్కొంది. తెలుగు రాష్ట్రాల నుంచి వలసవెళ్లిన వ్యక్తులు, కుటుంబాలను ఈ అధ్యయనంలో సుమారుగా లెక్కించారు. వీరిలో అత్యధికంగా 8.90 లక్షల మంది కర్ణాటకలో స్థిరనివాసం ఏర్పరచుకున్నట్లు వెల్లడించారు. ఇక రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్రలో సుమారు 4.37 లక్షల మంది స్థిరనివాసం ఏర్పరచుకున్నట్లు పేర్కొన్నారు.

ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు సైతం.. 
తెలుగు రాష్ట్రాల నుంచి పొరుగు రాష్ట్రాలతోపాటు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు వలస వెళ్లినవారు ఉండటం విశేషం. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసమే అత్యధికులు ఆయా రాష్ట్రాలకు పయనమైనట్లు ఈ అధ్యయనం పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో తెలంగాణ ప్రాంతానికి నిజాం కాలం నుంచి భౌగోళికంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా సాన్నిహిత్యం ఎక్కువగా ఉండటంతో పలువురు ఆయా రాష్ట్రాలకు పయనమైనట్లు వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో పరిశ్రమలు, భవన నిర్మాణ కార్మికులు, పవర్‌లూమ్‌లు, చేనేత, మార్కెటింగ్, ఐటీ, వ్యాపారం, వాణిజ్యం, ఆటోమోబైల్, నిర్మాణరంగంతోపాటు ఇతర రంగాల్లో తెలుగువారు ఉపాధి పొందుతున్నట్లు తెలిపింది. కర్ణాటకకు వలసవెళ్లిన తెలుగువారిలో సుమారు 1.60 లక్షల మంది సింగిల్‌గా ఉపాధి కోసం వెళ్లినట్లు పేర్కొంది. మరో 7.3 లక్షల మంది కుటుంబాలతో సహా వలస వెళ్లినట్లు తెలిపింది. ప్రధానంగా తెలుగువారు బీదర్, రాయచూర్, బసవకల్యాణ్‌ తదితర ప్రాంతాల్లో తాత్కాలిక, స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించింది. ఇక తెలుగురాష్ట్రాల నుంచి అత్యల్పంగా కేరళ, పుదుచ్చేరి, బిహార్, జార్ఖండ్‌ ప్రాంతాలతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు పయనమైనట్లు పేర్కొంది. 

రాష్ట్రాలకు వలసవెళ్లిన 
తెలుగువారి సంఖ్య సుమారుగా.. 
రాష్ట్రం    వలస వెళ్లిన వారు 


కర్ణాటక    8.90 లక్షలు 
మహారాష్ట్ర    4.37 లక్షలు 
తమిళనాడు    2.86 లక్షలు 
ఒడిశా    1.20 లక్షలు 
గుజరాత్‌    46,784 
కేరళ    6,269 
జమ్మూ కశ్మీర్‌    2,085 
పుదుచ్చేరి    40 
పంజాబ్‌    7,789 
హరియాణా    8256 
రాజస్థాన్‌    12,193 
మధ్యప్రదేశ్‌    17,375 
గుజరాత్‌    46,784 
గోవా    5,652 
హిమాచల్‌ప్రదేశ్‌    1,933 
ఉత్తరాఖండ్‌    117 
ఢిల్లీ    23,436 
ఉత్తరప్రదేశ్‌    16,060 
బిహార్‌    06 
అసోం    3,465 
అరుణాచల్‌ప్రదేశ్‌    43 
నాగాలాండ్‌    407 
మణిపూర్‌    167 
మిజోరాం    92 
పశ్చిమబెంగాల్‌    16,707 
జార్ఖండ్‌    21 
ఛత్తీస్‌గఢ్‌    6,484   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement