రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Two Persons Died In Road Accident Nalgonda - Sakshi

మరో నాలుగురోజులు గడిస్తే పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో పెనువిషాదం అలుముకుంది. కూతురి వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించి మురిసిపోవాలని ఆ తండ్రి కన్న కలలు ఆదిలోనే కల్లలయ్యాయి. కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు శుభలేఖలు పంచేందుకు వెళ్తుండగా విధి వక్రించింది. కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు బైక్‌ను ఢీకొట్టడంతో ఆ తండ్రితో పాటు మరొకరు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన నకిరేకల్‌ పట్టణంలో    మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నల్లగొండ : నకిరేకల్‌ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన వంగూరి నగేశ్‌ (55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు కుమార్తె, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె పూజకు పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 17న వివాహం జరగనుంది. కూతురు వివాహ శుభలేఖలను బంధువులకు పంచి ఆహ్వానించేందుకు నగేశ్‌ తన అన్న అల్లుడైన పాలడుగు గోపి (27)తో కలిసి బైక్‌ మీద బయలుదేరారు. నకిరేకల్‌ మండలం కడపర్తి గ్రామానికి వెళ్లి శుభలేఖలు ఇవ్వాల్సి ఉంది.

హైవేను క్రాస్‌ చేస్తుండగా..
చందంపల్లి నుంచి హైవే మీదుగా నకిరేకల్‌ వైపునకు బైక్‌ మీద వెళ్తున్నారు. స్థానిక పద్మనగర్‌ వద్ద ఉన్న బంక్‌లో పెట్రోల్‌ పోసుకుని కడపర్తి వెళ్లేందుకు జాతీయ రహదారిని క్రాస్‌ చేస్తూ నకిరేకల్‌కు చేరుకునే క్రమంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న అతివేగంగా వెళ్తున్న కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వంగూరి నగేశ్‌ (55)తో పాటు బైక్‌ నడుపుతున్న పాలడుగు గోపి (27) హైవే రోడ్డు డివైడర్‌లపై పడిపోయారు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పాలడుగు గోపికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గోపి వృత్తిరీతా సుతారీ పని చేస్తూ పెళ్లీల సమయంలో బ్యాండ్‌ మేలం వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

మిన్నంటిన రోదనలు
చందంపల్లి గ్రామానికి చెందిన వంగూరి నగేశ్, పాలడుగు గోపిలు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మరో ఐదు రోజుల్లో కుమార్తె వివాహం జరగనున్న నేపథ్యంలో తండ్రి మృత్యువాత పడడంతో పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరిని నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెళ్లింట్లో విషాదం నెలకొనడంతో గ్రామస్తులు కూడా కంటతడి పెట్టారు.
 
హైవేపై ఆందోళన.. గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం
నకిరేకల్‌లోని పద్మనగర్‌ బైపాస్‌ వద్ద జరిగిన ప్రమాదంలో చందంపల్లికి చెందిన నగేŠ, గోపి మృతిచెందడంతో గ్రామస్తులు ఆగ్రహించారు. భారీగా ఘటనాస్థలికి చేరుకుని  రాస్తారోకో నిర్వహించారు. గంటపాటు జాతీయ రహదారిపై బైఠాయించడంతో  సుమారు 5కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. క్రాసింగ్‌ల వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతున్న జీఎమ్మార్‌ సంస్థ నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చందంపల్లి క్రాసింగ్‌ వద్ద 40కి పైగా ప్రమాదాలు జరగగా 20మందికిపైగా మృతిచెందారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయిన చందంపల్లి క్రాసింగ్‌ వద్ద నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.

తాజాగా నకిరేకల్‌ దగ్గరలో ఉన్న పద్మనగర్‌ బైపాస్‌లో వద్ద క్రాసింగ్‌ ప్రమాదకరంగా ఉన్న ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవడం లేదన్నారు. చందంపల్లి గ్రామానికి హైవే వెంట సర్వీస్‌ రోడ్డు నిర్మిస్తే ఈ ప్రమాదాలు కొంతైన తగ్గే అవకాశం ఉందని వాపోయారు. గంటసేపు రాస్తారోకో చేయడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఘటన స్థలానికి కట్టంగూర్‌ ఎస్‌ఐ అంతిరెడ్డితో పాటు చెర్వుగట్టు బందోబస్తులో ఉన్న నకిరేకల్‌ సీఐ గౌరినాయుడు కూడా  చేరుకుని  గ్రామస్తులతో మాట్లాడారు. రెండుచోట్ల ప్రమాదాలు జరగకుండా జీఎమ్మార్‌ సంస్థతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top