పాలమూరు పౌరుషం చూపించాలి

Two MP seats in Palamore should be won by a huge margin - Sakshi

జిల్లాలోని 2 ఎంపీ సీట్లను భారీ మెజారిటీతో గెలిపించాలి

16 ఎంపీ సీట్లు గెలిస్తే రాష్ట్రంలో మరింత అభివృద్ధి

కాంగ్రెస్‌ నేతల చేరిక కార్యక్రమంలో కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి 16 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీలుంటే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు అన్నారు. పాలమూరులోని రెండు ఎంపీ స్థానాలను భారీ మెజారిటీతో గెలిపించి పాలమూరు పౌరుషాన్ని రుచి చూపించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డితోపాటు నాగార్జున సాగర్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు, ఎంపీపీలు, సర్పంచులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ షాద్‌నగర్, నాగార్జున సాగర్‌ నుంచి పెద్ద ఎత్తున నాయకులు పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరడం పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఏం పని అంటూ కాంగ్రెస్, బీజేపీలు అడుగుతున్నాయి. ఆ పార్టీలు గెలిస్తే రాహుల్‌ లేదా మోదీ ప్రధానులవుతారు. కానీ టీఆర్‌ఎస్‌ 16 ఎంపీ స్థానాలు గెలిస్తే తెలంగాణ గడ్డ అభివృద్ధి చెం దుతుంది.

ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు 16 మంది ఎంపీల తో తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తాడు. తెలంగాణ వచ్చాక పాలమూరు పచ్చగా మారిపోయింది. 70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు రన్నింగ్‌ ప్రాజెక్టులయ్యాయి. చెరువులు నిండాయి. కొత్తగా 8 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగంగా సాగుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి పథకాలతో తెలంగాణలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్‌కు అండగా నిలబడాలి. బడితె ఎవడిదైతే బర్రె వాడిదే అవుతుందన్నట్లు కేంద్రంలో ఎవరు మంత్రులుగా ఉంటే వారికే అభివృద్ధి జరుగుతుంది. ఇందుకు గతంలో కేంద్ర మంత్రులుగా లాలూ, మమతలే ఉదాహరణ. మోదీ ప్రధానిగా ఉండి తన సొంత రాష్ట్రానికి బుల్లెట్‌ రైళ్లు వేసుకున్నాడు.

గజ్వేల్‌ పర్యటనకు వచ్చిన మోదీని కాళేశ్వరం లేదా పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్‌ అడిగితే ఇంతవరకూ దానికి అతీగతీ లేదు. కేంద్రంలో మనం శాసించే స్థాయిలో ఉంటే మరిన్ని నిధులు, మరింత అభివృద్ధి ఎందుకు సాధ్యం కాదు? అందుకే ఢిల్లీలో ఎంపీలుగా కాంగ్రెస్, బీజేపీ గులాములుండాలా లేక టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉండాలా అనేది ప్రజలు తేల్చుకోవాలి. పాలమూరు పౌరుషం చూపించి కారు గుర్తును 16 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి’’అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించా లని ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మె ల్యే ప్రతాప్‌రెడ్డికి సూచించారు. ఆయన గెలిస్తే జిల్లాలో నిరుద్యోగ సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రు లు శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

మల్కాజిగిరిలో భారీమెజారిటీతో గెలవాలి: కేటీఆర్‌ 
దేశంలోనే అతిపెద్ద ఎంపీ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో గెలవాలని కేటీఆర్‌ అన్నారు. శుక్ర వారం టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి కేటీఆర్‌ను ఆయన నివాసం లో మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మం త్రులు జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి  ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top