అక్రమ అరెస్టులు సిగ్గుచేటు 

TSRTC Strike: RTC Labours Arrested For Protesting - Sakshi

సాక్షి, భూపాలపల్లి : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు నిర్వహిస్తుండంగా పోలీసు అక్రమంగా చేయడం సిగ్గుచేటని భూపాలపల్లి రాజకీయ జేఏసీ కన్వీనర్‌ కొరిమి రాజ్‌కుమార్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె మంగళవారం 18వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు, రాజకీయ కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆర్టీసీ డిపో  ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తుండగా వారిని స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్‌ రాజ్‌కుమార్, వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులపై పోలీసులు అతిగా వ్యహరిస్తున్నారని మండిపాడ్డారు. కార్మికులు న్యాయబద్ధంగా నోటీసు ఇచ్చి సమ్మె చేస్తుంటే అసంబంధమైన సమ్మె అనడం సిగ్గు చేటుగా ఉందన్నారు. సీఎం కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్నారు. ఆర్టీసీకి ఎండీని కూడా నియమించకుండా సీఎం కేసీఆర్‌ హిట్లర్‌ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అక్రమ ఆరెస్టుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడం తప్ప మరొకటి లేదన్నారు. అక్రమ అరెస్టులో కార్మికులు నష్టపోయేది ఎంలేదన్నారు.  

గులాబీ పూలు ఇచ్చి నిరసన 
ఆర్టీసీ కార్మికులు ధర్నా చేసిన అనంతరం ప్రైవేట్‌ డ్రైవర్లకు గులాబీపూలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ డ్రైవర్లు, కండక్టర్లు తమ సమ్మెకు సహకరించాలని ఆర్టీసీ మహిళా కండక్టర్లు వారికి గులాబీ పూలు ఇచ్చి కోరారు. విధులకు  హాజరుకాకుండా తమకు సహకరించాలని వేడుకున్నారు. ఆర్టీసీని స్తంభింపచేస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని కోరారు. అనంతరం డిపో నుంచి జయశంకర్‌ విగ్రహం మీదగా అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.  ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, సీపీఎం, బీజేపీ, వైఎస్సార్‌ సీపీ, ఏఐబీఎఫ్, ఏఐటీయూసీ, బీఎంఎస్, ఎంఆర్‌పీఎస్, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు తిరుపతి, సమ్మిరెడ్డి, బందు సాయిలు, రామకృష్ణ, రమేష్, శ్రీనివాస్, రాజేందర్, ప్రవీణ్, కర్ణాకర్, రమేష్, సాంబయ్య, తిరుపతి, ఓదెలు, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top