నేడు ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్‌

TSRTC Strike: RTC JAC calls To Chalo Tank Bund - Sakshi

సభకు అనుమతి లేదన్న పోలీసులు

నిర్వహిస్తామంటున్న కార్మిక సంఘాలు

ముందస్తు అరెస్టులతో ఉద్రిక్తత

సాక్షి, హైదరాబాద్‌/ముషీరాబాద్‌/తార్నాక: ఒకవైపు ఆర్టీసీ కార్మికులు శనివారం నిర్వహించతలపెట్టిన చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించడం, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ చలో ట్యాంక్‌బండ్‌ చేపట్టి తీరుతామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించడంతో నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్‌ వైపునకు వచ్చే అన్ని మార్గాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.

మరోవైపు చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమానికి అఖిలపక్షాల మద్దతు కూడా ఉండటంతో వివిధ పార్టీలకు చెం దిన కార్యకర్తలు, నాయకులు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ట్యాంక్‌బండ్‌కు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు పెద్దెత్తున ముందస్తు అరెస్టులకు దిగారు. కార్మిక సంఘాలకు చెందిన పలువురు నాయకులతో పాటు, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, తెలంగాణ జన సమితి, తదితర పార్టీలకు చెందిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు చేరుకోకుండా నిఘాను ఏర్పాటు చేశారు. అదే సమయంలో చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ గట్టి పట్టుదలతో ఉంది.

శుక్రవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించడంతోపాటు ఉస్మాని యా వర్సిటీ విద్యార్థి సంఘాలతోనూ సమావేశమయ్యారు. అన్ని వర్గాల భాగస్వామ్యంతో తమ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. అన్ని జిల్లాలకు చెందిన ఆర్టీసీ కార్మికులు నగరానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయమే జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డిని అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. మిగతా నేతలు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. చలో ట్యాంక్‌బండ్‌ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ మోహరించడంతో ఆర్టీసీ కార్మికులు సోషల్‌ మీడి యా ద్వారా తమ ప్రచారం కొనసాగిస్తున్నారు.

విద్యార్థుల అరెస్టులు...
చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్న ఉస్మానియా వర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకునేందుకు పోలీ సులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. పలు పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు.

అఖిలపక్ష నేతల భేటీ...
చలో ట్యాంక్‌బండ్‌  సక్సెస్‌ చేయడం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై శుక్రవారం ముఖ్దూంభవన్‌లో అఖిలపక్షనేతలు సమావేశమయ్యారు. చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, పశ్యపద్మ (సీపీఐ), తమ్మినేని వీరభద్రం, డీజీ నరసింహా రావు (సీపీఎం), ప్రొ. కోదండరాం (టీజేఎస్‌), ఎల్‌.రమణ (టీడీపీ) తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు అరెస్ట్‌లు అప్రజాస్వామికం...
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యానికి ఊపరిపోస్తాయని టీజేఎస్‌ నేత కోదండరాం చెప్పారు. చట్టాన్ని కాదని ఆర్టీసీని ప్రభుత్వం ఎలా ప్రైవేటీకరిస్తుందని సీపీఎంనేత తమ్మినేని ప్రశ్నించారు. కాగా చలో ట్యాంక్‌బండ్‌లో పాల్గొని సక్సెస్‌ చేయాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు.

చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి లేదు ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌
చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమానికి అనుమతి లేదని నగర ట్రాఫిక్‌ విభాగం అదనపు సీపీ అనిల్‌కుమార్‌ శుక్రవారం అన్నారు. అయినప్పటికీ కొంద రు ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతాయని, అలా కాకుండా ఉండేందుకు పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ పూర్తిగా మూసేస్తున్నామని తెలిపారు. 
►సికింద్రాబాద్‌ వైపు నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనచోదకు లు కర్బాలామైదాన్, కవాడిగూడ చౌరస్తా, సీజీఓ టవర్స్, ముషీరాబాద్‌ చౌరస్తా మీదుగా వెళ్లాలి.
►ఇందిరాపార్క్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు అశోక్‌నగర్‌ ఎక్స్‌ రోడ్స్‌ మీదుగా ప్రయాణించాలి.
►తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు ఇక్బాల్‌ మినార్, రవీంద్రభారతి మీదుగా ప్రయాణించాలి.
►ఇక్బాల్‌ మినార్‌ వైపు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు నెక్లెస్‌ రోటరీ, నెక్లెస్‌ రోడ్‌ మీదుగా వెళ్లాలి.
►హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు లిబర్టీ నుంచిబషీర్‌బాగ్‌ మీదుగా వెళ్లాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top