ఎల్లుండిలోగా బేషరతుగా విధుల్లో చేరండి : కేసీఆర్‌

TSRTC Strike: KCR gives Three Days Ultimatum To RTC Employees - Sakshi

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ ఆఫర్‌ 

5,100 బస్సులు ప్రైవేటుపరం 

ఆర్టీసీ విలీనానికి కేబినెట్‌ తిరస్కరణ

యూనియన్ల మాయలో పడి బతుకులు ఆగం చేసుకోవద్దు 

గడువులోగా విధుల్లో చేరకుంటే  బస్సులన్నీ ప్రైవేటుకే అప్పగింత 

లాభదాయకం కాని రూట్లే ప్రైవేటుకు.. 

కార్మికుల ఆత్మహత్యలకు యూనియన్‌ నేతలు, ప్రతిపక్ష నాయకులే కారణం 

బీజేపీ ఎంపీలు శవాల మీద పేలాలు ఏరుకునే రకమని సీఎం ధ్వజం 

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో పనిచేస్తున్న 49 వేల మంది కార్మికుల పొట్టకొట్టి నష్ట పరిచే ఆలోచన ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ సాధించిన నాయకుడిగా, సోదరుడిగా చెప్తున్నా.. యూనియన్ల మాయలో పడి బతుకులు ఆగం చేసుకోవద్దు. మీ కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నెల ఐదో తేదీ మంగళవారం రాత్రి 12 గంటల్లోగా విధుల్లో చేరండి.. కుటుంబాలను కాపాడుకోండి. ఉద్యోగాలకు రక్షణ ఉంటుంది. యూనియన్ల మాయలో పడకుండా కార్మికులు ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత మంచి అవకాశం చేజార్చుకోవద్దు. మీకు రక్షణ ఉంటుంది’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. అవకాశం ఇవ్వకపోతే తమ తప్పు అని, ఇచ్చినా వినియోగించుకోకపోతే వాళ్ల తప్పు అని వ్యాఖ్యానించారు. కార్మికులు తమ కుటుంబాలు, జీవితాలను రోడ్డున వేయొద్దని.. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విధుల్లో చేరకుంటే మధ్యప్రదేశ్‌ తరహాలో తెలంగాణ ఆర్టీసీ రహిత రాష్ట్రమవుతుందని స్పష్టంచేశారు. నవంబర్‌ ఐదో తేదీ అర్ధరాత్రి లోగా కార్మికులు విధుల్లో చేరని పక్షంలో అన్ని రూట్లను ప్రైవేటుపరం చేస్తామని స్పష్టంచేశారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌లో ఐదు గంటల పాటు జరిగిన రాష్ట్ర మంత్రివర్గం భేటీ అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రంగాలకు చెందిన చిరుద్యోగులను ఆదుకున్న చరిత్ర మాది. ఆర్టీసీ కార్మికులకు కూడా నాలుగేళ్లలో 15శాతం ఫిట్‌మెంట్‌తో కలుపుకుని 67శాతం వేతనాలు పెంచాం. ప్రతీ ఒక్కరు గౌరవప్రదంగా బతకాలి. ఎవరి కడుపూ కొట్టకూడదు అనే ఉద్దేశంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ఐకేపీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, వీఏఓలు తదితరుల జీతాలు పెంచాం. చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆపడం, రైతుల ఆత్మహత్యలు లేకుండా చేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం’ అని కేసీఆర్‌ తెలిపారు. 

సమ్మె అర్థరహితం... 
‘ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె అర్దరహితం, దురహంకారపూరితం, అంతు లేని కోరికలతో జరుగుతున్న సమ్మె. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశంపై కూలంకషంగా చర్చించి.. విలీనం అసాధ్యమని నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో పాటు 5,100 ఆర్టీసీ బస్సులను ప్రైవేటు రంగానికి ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. అందువల్ల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆర్టీసీలో ప్రస్తుతం 10,400 సర్వీసులు ఉండగా, ఇందులో 2,100 అద్దె బస్సులు ఉన్నాయి. మిగిలిన 8,300 బస్సుల్లో 2,609 బస్సుల కాలం చెల్లి.. ఉపయోగంలో లేవు. రాబోయే 3, 4 నెలల్లో మరో నాలుగైదు వందల బస్సులు కూడా కాలం చెల్లేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి కొని, నడిపే సామర్ద్యం ఆర్టీసీకి లేనందున మొత్తంగా 5,100 బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు ఇస్తాం. ఇప్పటికే ఉన్న 2,100 అద్దె బస్సులు ఇక ఆర్టీసీలో ఉండవు. ప్రజా రవాణాలో లెవల్‌ ప్లేయింగ్‌ ఉండటంతో పాటు, బ్లాక్‌మెయిల్‌కు లొంగకుండా, రాష్ట్రం, రాజధాని ప్రతిష్ట దెబ్బతినకుండా చూస్తాం. యాజమాన్యం అదుపాజ్ఞలో పనిచేస్తే మంచి లాభాలు వస్తాయి. లాభాలు వచ్చే రూట్లను ప్రైవేటుకు అప్పగిస్తామనే అపోహలు వద్దు. పల్లెవెలుగు రూట్లను ప్రైవేటుపరం చేస్తాం. లాభదాయం కాని రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగిస్తాం. ప్రైవేటుకు అప్పగించాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. తద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ప్రైవేటు ఆపరేటర్లు కూడా సిద్దంగా ఉన్నారు. పండుగలు, పరీక్షల సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా, నగరాల్లో అభివృద్ది జరిగే క్రమంలో రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కార్మికులు ఐదో తేదీ అర్దరాత్రి లోగా విధుల్లో చేరకుంటే ఆరు, ఏడు తేదీల్లో ఆర్టీసీ భవిష్యత్తు నిర్ణయిస్తాం. ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచన లేదు’ అని సీఎం స్పష్టం చేశారు. 

శనివారం కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రులు ఈటల రాజేందర్, పువ్వాడ అజయ్‌కుమార్‌ 

ప్రభుత్వ, ప్రైవేటు నడుమ లెవల్‌ ప్లేయింగ్‌ 
‘ప్రభుత్వ, ప్రైవేటు ఆపరేటర్ల నడుమ లెవల్‌ ప్లేయింగ్‌ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేసిన 2019 మోటారు వెహికిల్‌ సవరణ చట్టం ఈ ఏడాది నవంబర్‌ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం నిబంధనల మేరకు 5,100 బస్సులను ప్రైవేటుపరం చేస్తున్నాం. తద్వారా ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రైవేటీకరణపై ఎలాంటి అనుమానాలు వద్దు. ఆరోగ్యకరమైన పోటీ, విస్తృత సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే ఈ నిర్ణయం. ప్రైవేటు బస్సులు ప్రభుత్వ నియంత్రణలో నడిచేలా రెగ్యులేటరీ కమిటీ వేస్తాం. ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టం వచ్చినట్లు టికెట్‌ రేట్లు పెంచకుండా ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పర్యవేక్షణ ఉంటుంది. జర్నలిస్టులు, విద్యార్థులతో సహా అన్ని వర్గాలకు ఇచ్చే బస్సు పాసులు వంద శాతం చెల్లుబాటవుతాయి. ప్రజలు బాధపడకుండా యథావిధిగా కొనసాగిస్తాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అదే బాట లో మరో 91 చిన్న, పెద్దా ప్రభుత్వ కార్పోరేషన్లు అదే డిమాండును పెడతాయి. కోర్టులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తాయి. అందుకే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని కేసీఆర్‌ తెలిపారు. 

బీజేపీ ఎంపీలు క్షమాపణలు చెప్పాలి...
‘బీజేపీకి ఈ రాష్ట్రంలో నలుగురు ఎంపీలు ఉన్నారు. ప్రజల పక్షాన వారిని ప్రశ్నిస్తున్నా. కేంద్రంలో మోటారు వాహన సవరణ చట్టం ఆమోదించినపుడు లోక్‌సభలో మీరు ఉన్నారు కదా. అక్కడ అనుకూలంగా ఓటు వేసి ఇక్కడ డ్రామాలు చేస్తున్నారా. నితిన్‌ గడ్కరీ పార్లమెంటులో బిల్లు పెట్టినపుడు మీరు అంత పవిత్రులైతే నిరసన తెలపాలి కదా. నైతికత ఉందా.. మీ ప్రభుత్వం చేసిన చట్టంలో భాగస్వాములై ఇక్కడ వీరంగం వేస్తున్నారా? శవాలు మీద పేలాలు ఏరుకునే రకం.. చీప్‌ పొలిటికల్‌ టాక్టిక్స్‌’ అంటూ బీజేపీ ఎంపీల తీరుపై సీఎం మండిపడ్డారు. ‘కార్మికులను రెచ్చగొడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు ఉమాభారతి, బాబూలాల్‌ గౌర్‌ ఆర్టీసీని ప్రైవేటుపరం చేసిన సమాచారం మా దగ్గర ఉంది. ఆర్టీసీ కార్మికుల విషయంలో బీజేపీ ఎంపీలు చేసిన దుర్మార్గాలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్లాట్‌ఫారం స్పీచ్‌లు ఎన్నైనా కొట్టొచ్చు. కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడైనా ఆర్టీసీని విలీనం చేసిందా. మాకు నోరు లేదా.. మేం మాట్లాడలేమా? ఆత్మహత్యలకు మీరే కారకులై ఎవరిని బదనాం చేస్తారు. మీరే నేరస్తులు’ అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘యూనియన్లు, ప్రతిపక్ష నాయకులే హంతకులు.. పనిచేసి బతికేవాళ్లను సమ్మెకు ఎంకరేజ్‌ చేసిన వాళ్లే హంతకులు.. బాధ్యత వహించాల్సింది వంద శాతం వాళ్లే. యూనియన్లు పెట్టిన పనికిమాలిన డిమాండ్ల వల్లే ఈ గతి. కార్మికులు బతకాలి. కార్పొరేషన్లను బతికించాలి. ఎటు తీసుకుపోతున్నారో సోయి ఉండాలి. 67 శాతం పెంచినా, 4,700 తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసినా.. ఇవేం డిమాండ్లు.. అర్దం ఉందా?’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ‘సమ్మె చట్ట విరుద్దమని కార్మిక శాఖ ప్రకటించిన నేపథ్యంలో యజమానికి, కార్మికులకు ఉండే సంబంధాలు తెగిపోయినట్లే. సంస్థ ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. దీంతో 49వేల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి. అయినా ఆర్టీసీ కారి్మకుల శ్రేయస్సు, సంస్థ మనుగడ దృష్టిలో పెట్టుకోకుండా ఇంకో ఆరు రోజులు అంటూ తొమ్మిదో తేదీ వరకు ఆర్టీసీ కారి్మక సంఘాలు కార్యాచరణ ప్రకటించడం అర్దరహితం’ అని విమర్శించారు. 

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం.. 
‘రవాణా శాఖ రాష్ట్ర  పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూలులో ఉంది. ఆర్టీసీ విషయంలో ఏపీ, తెలంగాణ నడుమ కొంత వివాదం ఉంది. వివాదాస్పద విషయాలను పెండింగులో పెట్టి.. ఎవరి కార్పొరేషన్‌ వాళ్లు నడుపుకొనేలా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానిని రెండు ప్రభుత్వాలు నోటిఫై చేశాయి. ఇప్పుడున్నది తెలంగాణ ఆర్టీసీ.. ఆర్టీసీలో తెలంగాణకు 31శాతం వాటా ఉంది. ఆ మేరకు నష్టాలకు సంబంధించిన డబ్బు ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతాం. ఐదేళ్లలో ఎదురైన నష్టాలను పంచుకోమని అడుగుతాం. చేతులు కడుక్కుంటారా, డబ్బులు ఇస్తారా చూస్తాం. ఏపీలో ఆర్టీసీ విలీనం.. ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశం.. ఎన్నికల్లో  ఇచ్చిన హామీ మేరకు విలీనం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ రైతుబంధు, రైతు బీమా ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన విధానాలు ఉంటాయి. పాలసీ నిర్ణయాల మీద ప్రభుత్వాన్ని ఎవరూ డిక్టేట్‌ చేయలేరు. కేబినెట్‌ నిర్ణయం చెబుతున్నాం. అర్దం చేసుకోలేక పోతే వాళ్ల కర్మ. నేను కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కష్టం, నష్టం రానీయం. కులం, మతం, జాతి ఆధారంగా అన్ని వర్గాల శ్రేయస్సు, రాష్ట్ర భవిష్యత్తు, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. అందు కే 2014లో 63 మందిని గెలిపించగా, 2018లో మాకు మూడింట రెండొంతుల మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 32 జడ్పీలకుగాను అన్ని చోట్లా మా పార్టీ వారినే గెలిపించారు. హుజూర్‌నగర్‌లో మా పార్టీ అభ్యర్థిని బ్రహ్మాండమైన మెజారిటితో గెలిపించి ప్రజలు మా మీద విశ్వాసం ఉంచారు. ఈ తరుణంలో మేం ఏ నిర్ణ యం చేసినా రాష్ట్రం, ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. దేశంలో అత్యంత తీవ్ర ఆర్దిక మాంద్యం ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం అలాం టి పరిస్థితి లేకుండా చూస్తున్నాం. ఐదేళ్లలో 21% వృద్ధిరేటుతో ఉన్న తెలంగాణలో ఆర్ధికమాంద్యం మూలంగా వృద్ధిరేటు 5శాతానికి పడిపోయినా.. ఆర్దిక పరిస్థితి నెగటివ్‌లో మాత్రం లేదు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతీ గడపకూ మేలు చేకూరేలా కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల మూలంగా వలసలు లేని రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తున్నాం’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.
 
హైకోర్టుకు ఆ అధికారం లేదు 
 రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తంచేసిన విషయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ బదులిచ్చారు. తప్పుడు సమాచారంతో అఫిడవిట్‌ జారీ చేశారని హైకోర్టు.. ఆర్టీసీ ఎండీపై మండిపడిందని వచి్చన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ‘కోర్టు అలా అనలేదు. అనజాలదు. అనడానికి కోర్టుకు కూడా అధికారం ఉండదు. ఎట్ట అంటదండీ. మేం ఫైల్‌ చేసిన అఫిడవిట్‌ మీద మాట్లాడాల.. అవతల పక్క అడ్వొకేట్‌ (ఆర్టీసీ జేఏసీ న్యాయవాది) ఏదో అంటడు. కానీ, కోర్టు అనలేదు. ఆయనెవరో అడ్వొకేట్‌ తప్పుడు మాటలు మాట్లాడిండు. ఏదో డాక్యుమెంట్‌ పట్టుకొచ్చి మాట్లాడిండు. అది అంతర్గత డాక్యుమెంట్‌. మంత్రికిచి్చన ప్రజెంటేషన్‌ డాక్యుమెంట్‌ అది. దానిమీద ఏమైనా సంతకం ఉంటదా అండి. హైకోర్టు అంటలేదు. అది ఎవడో అడ్వొకేట్‌ అంటుండు’ అని కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. ఉప ఎన్నికలు జరిగిన హుజూర్‌నగర్‌కు రూ.100 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆర్టీసీ కారి్మకుల జీతాలు ఇవ్వడానికి రూ.47 కోట్లు లేవా? అని హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలను కేసీఆర్‌ తప్పుబట్టారు. ‘అలా కామెంట్‌ చేయడానికి హైకోర్టుకు కూడా అధికారం లేదు. ప్రభుత్వం కదా డబ్బులిచ్చేది.. ఒక హుజూర్‌నగర్‌కే ఇస్తాదండి? మేము పాలకు కూడా రూ.4 ప్రోత్సాహకం ఇస్తున్నం.. రూ.2 వేలు పింఛన్‌ ఇస్తున్నం.. రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నం.. వికలాంగులకు రూ.3 వేలు పింఛన్‌ ఇస్తున్నం. చాలా ఇస్తుంటం.. చాలా ఇస్తం.. ప్రభుత్వం ఒకటి ఇస్తదా? నువ్వు గాడ ఎట్ల ఇచ్చినవ్‌.. ఈడ ఎట్ల ఇచ్చినవ్‌.. అలా ఉంటదానండి లెక్క? ఆ పని మాది కదా’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.  

విలేకరిపై ఆగ్రహం.. 
‘ఎంత ఘోరమైన ఆరోపణ చేస్తున్నావు. ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నావు’ అని ఓ పత్రికా విలేకరిపై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. మీ దగ్గరి వాళ్లకే అప్పగించడానికి ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయని ప్రశ్నిం చగా, ‘అట్లా ఇస్తామా? మా అంత పారదర్శకంగా ఎవరూ ఉండరు’ అని కేసీఆర్‌ బదులిచ్చారు. 

సీఎం ఏకపాత్రాభినయం: రేవంత్‌ 
కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంలో ఏకపాత్రాభినయం చేశారని, ఆయన మాటల్లో అడుగడుగునా అహంకారం, అధికార మదం కొట్టొచ్చినట్లు కనిపించిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

కేసీఆర్‌ది బెదిరింపు ధోరణి: బీజేపీ  
చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్‌ శనివారం కేబినెట్‌ భేటీ అనంతరం చేసిన ప్రకటనలు బెదిరింపు ధోరణితో ఉన్నాయని బీజేపీ వ్యాఖ్యానించింది.  ఈ మేరకు పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు  ప్రకటన విడుదల చేశారు.

చర్చించి స్పందిస్తాం : ఆర్టీసీ కార్మికులు
సాక్షి, హైదరాబాద్‌: సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఈనెల ఐదో తేదీలోగా విధుల్లో చేరాలని, లేని పక్షంలో వారికి ఆరీ్టసీతో సంబంధాలు పోయినట్టేనన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాఖ్యల నేపథ్యంలో కారి్మక సంఘాల జేఏసీ ఆదివారం ఉదయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి బెదిరింపు ధోరణితో మాట్లాడినా కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దని, ఆ బెదిరింపులకు లొంగాల్సిన అవసరం లేదని కోకన్వీనర్‌ రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం సమావేశం తర్వాత కారి్మకులకు సూచనలు చేస్తామని వెల్లడించారు.  

ఎవరూ విధుల్లో చేరరు
ముఖ్యమంత్రి పెట్టిన డెడ్‌లైన్‌ను కార్మికులెవరూ పట్టించుకోరని కారిక సంఘాల జేఏసీ–1 కన్వీనర్‌ హనుమంతు పేర్కొన్నారు. గతంలో ఇలాగే చెప్పినా ఒక్కరు కూడా చలించని విషయాన్ని గుర్తించాలన్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకుంటే విధుల్లో చేరి ప్రయోజనం ఏమిటని, అసలు ఇన్ని రోజులు దీక్షగా నిర్వహించిన సమ్మెకు ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. తాము ఆర్టీసీ పరరక్షణ కోసమే సమ్మె చేపట్టామని, సంఘాల నేతల ప్రయోజనాల కోసం కాదని స్పష్టంచేశారు. ఉన్న రూట్లను ప్రైవేటీకరించి ఇక ఆర్టీసీ లేకుండా చేసే కుట్రకు ఆమోదం తెలుపుతూ కారి్మకులు విధుల్లో ఎలా చేరతారన్నారు. ఐదేళ్లలో 67 శాతం జీతాలు పెంచామన్న సీఎం మాట కూడా అబద్ధమేనని, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రకటించిన ఐఆర్‌ కలిపే తెలంగాణ ప్రభుత్వం తొలి వేతన సవరణ చేసిందని, వాస్తవంగా తెలంగాణ వచ్చాక పెరిగిన జీతాలు 33 శాతమేనని పేర్కొన్నారు.

ఆర్టీసీకి ఇవ్వాల్సిందేమీ లేదు: జీహెచ్‌ఎంసీ
సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ చెల్లించాల్సింది ఏమీ లేదని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ స్పష్టం చేశారు. శనివారం జీహెచ్‌ఎంసీ పాలక మండలి సమావేశానికి హాజరైన ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..   ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఎంత ఇవ్వాలో, ఎంత ఇచ్చారో స్పష్టత నివ్వాలని కోరారు. జీహెచ్‌ఎంసీ నుంచి రూ.1,400 కోట్లకు పైగా రావాల్సి ఉందని చెబుతున్నారన్నారు. ఈ అంశంపై చర్చకు మేయర్‌ బదులిస్తూ.. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఇవ్వాల్సింది ఏమీ లేదన్నారు. నిధులివ్వాలనేది మాండేటరీ (తప్పనిసరి) కాదన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top