పంచాయతీలకు నేటి నుంచే ప్రత్యేక పాలన

TS to get 4383 new gram panchayats on August 2 - Sakshi

పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం నేటితో పూర్తి

కొత్తగా 4,383 పంచాయతీల ఆవిర్భావం

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి ప్రత్యేకాధికారులు కొలువు దీరనున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు నేటితో ఐదేళ్ల పదవీకాలం పూర్తయింది. అన్ని గ్రామ పంచాయతీలకు నేడు ఉదయమే ప్రత్యేకాధికారులుగా మండల స్థాయిలోని వివిధ శాఖల ముఖ్యమైన అధికారులు బా«ధ్యతలను తీసుకోనున్నారు. నేటి నుంచి సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు మాజీలు కానున్నారు.

గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగేదాకా ప్రత్యేకాధికారులే గ్రామ పరిపాలనా బాధ్యతలను నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా ఉన్న గ్రామ పంచాయతీలకే కాకుండా, కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు మం డల స్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలను అప్పగించడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. వీరంతా ఉదయ మే ప్రత్యేక అధికారులుగా బాధ్యతలను తీసుకుంటారు.  

కొత్తగా 4,383 పంచాయతీలు..
రాష్ట్రంలో కొత్తగా 4,383 గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలోని 534 మండలాల్లో ఇప్పటిదాకా 8,690 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 4,383 ఏర్పాటు అవుతున్నాయి. వీటిలో మున్సిపల్, పట్టణ స్థానిక సంస్థల్లోకి 306 గ్రామ పంచాయతీలు వెళ్లాయి.

మరో 16 గ్రామ పంచాయతీలు నిర్వాసిత గ్రామాలు కానున్నాయి, రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు మనుగడలో ఉంటున్నాయి. వీటిలో 18 గ్రామ పంచాయతీలకు ఐదేళ్ల గడువు పూర్తికాలేదు. దీంతో 12,733 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులు బాధ్యతలను తీసుకోనున్నా రు. షెడ్యూల్డ్‌ గ్రామ పంచాయతీలు 1,308 కాగా పూర్తిగా ఎస్టీలకే రిజర్వు అయిన గ్రామ పంచాయతీలు 10,266. వీటికి ఎన్నికలను నిర్వహించేదాకా ప్రత్యేక అధికారులే స్థానిక పాలనను నిర్వహించనున్నారు.  

తాత్కాలిక భవనాల్లోనే..
కొత్తగా ఏర్పాటు అవుతున్న గ్రామ పంచాయతీలకు తాత్కాలిక భవనాలను ఎంపిక చేశారు. ప్రభుత్వ శాఖలకు చెందిన ఏ భవనం ఉన్నా కొత్త పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయడానికి వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.   

పాలకవర్గాలకే పదవీ కాలాన్ని పొడిగించాలి: చాడ
గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించ కుండా, పాలకవర్గాలకే పదవీకాలాన్ని పొడిగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌చేశారు. లోక్‌సభ, శాసనసభలకు ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నట్లుగానే స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సర్పంచులకు పదవీకాలాన్ని పొడిగించడం రాష్ట్ర ప్రభుత్వ ఇష్టానికి సంబంధించిన అంశమని హైకోర్టు చెప్పినా, ఎందుకు పదవీకాలాన్ని పొడిగించలేదని ప్రశ్నించారు. దీనిపై మొండిగా వ్యవహరించకుండా, మరోసారి ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top