బీఆర్‌ఎస్, బీజేపీ ఓటమే లక్ష్యం 

Chada Venkat Reddy comments over brs and bjp - Sakshi

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ 

వామపక్ష ఐక్యతకు గండికొట్టలేదని వెల్లడి.. 

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రావాలని ఆకాంక్ష

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రావాలన్నదే తమ ఆకాంక్ష అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్లు్యజే) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్‌ ది ప్రెస్‌లో చాడ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనేందుకు ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌ అభ్యర్థులపై జరుగుతున్న ఐటీ దాడులే నిదర్శనమని ఆరోపించారు. ప్రపంచ రికార్డ్‌ అని చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు కుంగిపోయిన రికార్డు సాధించిందని ఎద్దేవా చేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా అధికార పార్టీకి ప్రజాతిరుగుబాటు తప్పదని జోస్యం చెప్పారు.

కొత్తగూడెం స్థానంలో తమ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును ప్రజలు గెలిపిస్తారని చాడ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల నాణ్యమైన కరెంటు అమలు కావడం లేదని విమర్శించారు. ధనిక రాష్ట్రంలో పేదల ఆదాయం ఎందుకు పెరగడం లేదని, వారు ఇంకా ప్రభుత్వంపైన ఆధారపడాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. 

కేసీఆర్‌ మాట తప్పారు.. 
గతంలో బీజేపీకి మద్దతిచ్చిన మాట వాస్తవమేనని, ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటామంటూ సీఎం కేసీఆర్‌ మునుగోడు ఉపఎన్నిక ముందు తమతో చె ప్పారని చాడ గుర్తుచేశారు. కానీ ఆ తర్వాత ఆయన మాట తప్పారని విమర్శించారు.  రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడాలని, భూమి సమస్యలు పరిష్కారానికి నోచుకోవాలని చాడ ఆకాంక్షించారు. 

వై.ఎస్‌. హయాం నాటి ఎల్లంపల్లి చెక్కుచెదరలేదు 
సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కట్టిన మూడేళ్లకే దెబ్బతిన్నదని చాడ విమర్శించారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి మేడిగడ్డకు సమీపంలో శ్రీకారం చుట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నేటికీ చెక్కుచెదరలేదని చాడ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

తప్పని పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌తో ముందుకు... 
సీట్ల విషయంలో కాంగ్రెస్, సీపీఎం మధ్య అవగాహన కుదరలేదని, కాబట్టి వామపక్షాలుగా కలసి పోటీ చేయలేకపోతున్నామని చాడ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తామేమీ వామపక్ష ఐక్యతకు గండికొట్టలేదని.. 2018లోనూ సీపీఐ, సీపీఎం వేర్వేరుగానే ఎన్నికలకు వెళ్లాయని గుర్తుచేశారు.

తమతో అవగాహనలో భాగంగా కాంగ్రెస్‌ ఒక్క సీటే కేటాయించడంపట్ల సంతృప్తి లేకున్నా అప్రజాస్వామిక, నియంతృత్వ బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు తప్పని పరిస్థితుల్లోనే ఆ పార్టీతో ఎన్నికల అవగాహనతో ముందుకెళ్తున్నామని చాడ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తులు అనివార్యమయ్యాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే ఎన్డీఏ పేరుతో 36 పార్టీలతో పొత్తు పెట్టుకుందని చాడ గుర్తుచేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top