టీఆర్‌టీ నోటిఫికేషన్‌ జారీ చేశాం

TRT notificatons issued : TG to Supreme - Sakshi

సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదన

ఫిబ్రవరిలో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు నివేదించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై కొనసాగుతున్న కేసు విచారణలో భాగం గా సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన మేరకు ఈ నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది నీరజ్‌ కిషన్‌ కౌల్‌... చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ఫిబ్రవరిలో పూర్తిచేస్తామని పేర్కొనగా అంత సమయం ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది.

ఇదే సమయంలో నిరుద్యోగ అభ్యర్థులు, తెలంగాణ పేరెంట్స్‌ ఫౌండేషన్‌ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ వాదిస్తూ ‘‘3 నెలల్లోగా టీచర్‌ నియామకాలు చేపడతామని కేసు గత విచారణ సమయంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం తాజా విచారణ తేదీకి కేవలం 2 రోజుల ముందు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కాల యాపన వల్ల అభ్యర్థులు, విద్యార్థులు నష్టపోతారు’’ అని పేర్కొన్నారు. ఈ కేసులో అమికస్‌ క్యూరీ అశోక్‌ గుప్తా అభిప్రాయాన్ని ధర్మాసనం కోరగా సహేతుక కారణం ఉన్నప్పుడు ప్రభుత్వానికి సమయం ఇచ్చినా ఫరవాలేదని విన్నవించారు. దీంతో కేసు విచారణను ధర్మాసనం మార్చి తొలి వారానికి వాయిదా వేసింది. పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌.ఆచార్య విచారణకు హాజరయ్యారు.

ఏపీలో ఖాళీలపై అఫిడవిట్‌ సమర్పించండి
విచారణ సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థుల తరపు న్యాయవాది కె. శ్రవణ్‌ కుమార్‌ వాదిస్తూ ఏపీలో టీచర్ల ఖాళీల సంఖ్యపై ఏపీ ప్రభుత్వం మాటమారుస్తోందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గతంలో 25 వేల ఖాళీలున్నాయన్న ప్రభుత్వం... ప్రస్తుతం పాఠశాలల హేతుబద్ధీకరణ పేరుతో ఖాళీలు లేవంటోందని నివేదించారు. దీంతో ధర్మాసనం ఖాళీల వివరాలతో కూడిన అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏపీ సర్కారును ఆదేశించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top