బీఈడీ సర్టిఫికెట్‌ను అమ్మకానికి పెట్టిన నిరుద్యోగి | TRT Aspirant put his Bed certificate for donation | Sakshi
Sakshi News home page

బీఈడీ సర్టిఫికెట్‌ను అమ్మకానికి పెట్టిన నిరుద్యోగి

Dec 2 2017 4:27 PM | Updated on Dec 2 2017 4:31 PM

TRT Aspirant put his Bed certificate for donation - Sakshi

హైదరాబాద్‌ : 2012లో డీఎస్‌సీ రాయడానికి అర్హుడైన వ్యక్తి 2017 వచ్చే సరికి అనర్హుడయ్యాడు. అప్పుడు కేవలం ఒక్క మార్కుతో ఉద్యోగం కోల్పోయిన అతను ఐదేళ్లు డీఎస్‌సీ కోసం ఎదురు చూసి చివరకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టీఆర్‌టీ నోటిఫికేషన్‌ చూసి షాక్‌కు గురయ్యాడు. టీచర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో 2017 టీఆర్‌టీ రాయడానికి తాను అనర్హుడని పేర్కొనడంతో ఎంతో కష్టపడి తెచ్చుకున్న బీఈడీ సర్టిఫికెట్‌ను ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టాడో నిరుద్యోగి. ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

అశోక్‌ జోగుపర్తి అనే నిరుద్యోగి తన ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టిన పోస్ట్‌..
ఇది నా బీఈడీ సర్టిఫికేట్.. అమ్ముతాను..ఎవరైనా కావాలంటే చెప్పండి ఇస్తా.. మీరిచ్చిన డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తా... దీనితో తెలంగాణ ప్రభుత్వం నాకు ఏమి ఉపయోగం లేకుండా చేసింది.. మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించింది. నేను బీఈడీ చదివే రోజుల్లో నాకు ఫీజు రీయింబర్స్ కూడా రాలేదు. మంచి ర్యాంక్ తో సొంత డబ్బులతో ఫీజు కట్టి చదువుకున్నా. పంతులు ఉద్యోగం కొలువు చేద్దామని బీఈడీ పూర్తి చేశా. ఇక పంతులు కొలువు ఎప్పుడెప్పుడు సాధిద్దామా అని ఎదురుచూశా. అప్పుడు టెట్ అని ఇంకో మెలిక పెట్టిర్రు. దాంట్లో 60%మార్కులు రావలంట. సరే అదికూడా చదివిన 72% మార్కులు తెచ్చుకున్న. 2012 డీఎస్సీ రాసిన 72 మార్కులు వచ్చినాయి. ఉద్యోగం రాలే. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో డీఎస్‌సీ నోటిఫికేషన్‌కు సిద్ధపడింది.

అయితే దాన్ని వ్యతిరేకిస్తూ మా తెలంగాణలో మా నోటిఫికేషన్‌ మేమే వేసుకుంటం అని ఉద్యమంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నం. ఎప్పుడెప్పుడు డీఎస్‌సీ నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూసినం. మూడేళ్లకు కానీ మన ప్రభుత్వానికి నిరుద్యోగులు గుర్తు రాలేదు. సరే ఇప్పుడు వచ్చింది. మన ప్రభుత్వంలో పంతులు కొలువుకోసం చదువుతున్న. కానీ మన ప్రభుత్వం డిగ్రీలో 50% మార్కులు ఉంటేనే పరీక్ష రాయాలని మెలిక పెట్టింది. నేనెప్పుడో 2008 లో డిగ్రీ పూర్తి చేసిన. నాకు 48.25% మార్కులు వచ్చాయి. అప్పుడే బీఈడీకి అర్హత లేదంటే వేరేది చదువుకునే వాడిని. బీఈడీ చేసి 2 సార్లు టెట్ రాసి, ఒకసారి డీఎస్‌సీ రాస్తే... ఇప్పుడు నేను అర్హుడిని కాదంట.. ఇదెంత వరకు న్యాయమో మీరే చెప్పండి.

36% మార్కులు వచ్చిన వారు కలెక్టర్ అవ్వచ్చు. గ్రూప్ 1 & 2 ఉద్యోగులు అవ్వొచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నాకు అర్హత లేదంటారా. మరి పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్‌సీలో అందరికీ అవకాశం ఇచ్చింది. నాకు పీజీలో 75% మార్కులు వచ్చాయి. నేను అర్హుడుని కాదా. కనీసం ప్రైవేట్ టీచర్గా కూడా పనికిరానని మన ప్రభుత్వం సర్టిఫై చేసింది నన్ను. అలాంటప్పుడు ఎందుకు నాకీ మెమో. ప్లీజ్ ఎవరైనా కొనండి నా మెమో. నా మీద జాలితో అయిన. ఆ డబ్బు కచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తా. నేను ఇప్పటికీ రెండు పీజీలు చేశా... ఆ మెమోలు కావాలన్నా ఇస్తా. ఎవ్వరూ కొనకపోతే ప్రొఫెసర​ కోదండరాం సమక్షంలో యూనివర్సిటీ వారికి రిటర్న్ చేస్తా. నేను ఎవ్వరి మీద కోపంతో ఈ మాటలు చెప్పట్లేదు.. ఒక నిరుద్యోగిగా...నా బాధ చెప్పుకున్నా... అని అశోక్‌ జోగుపర్తి తన ఆవేదన వ్యక్తం చేశాడు. అశోక్‌లా చాలా మంది నిరుద్యోగులు సోషల్‌ మీడియాలో టీఆర్‌టీ నోటిఫికేషన్‌ నిబంధనలపై, ఆలస్యంపై తమ గోడును చెప్పుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement