
రేపటి వరకు ఆప్షన్స్ ఇచ్చేందుకు అవకాశం
13 నాటికి కొత్త టీచర్లు స్కూళ్లలో చేరాలని ఆదేశాలు
హైకోర్టు తీర్పునకు భిన్నంగా ప్రక్రియ!
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 ద్వారా ఎంపికైన అభ్యర్థులు జిల్లాల్లో పాఠశాలలు ఎంపిక చేసుకునేందుకు బుధవారం వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం వీరికి జరుగుతున్న శిక్షణ కేంద్రాల్లోనే విద్యాశాఖాధికారులు ఇందుకు ఏర్పాట్లుచేశారు. ఈనెల 10 వరకు ఇది జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఖాళీల వివరాలను ప్రకటించారు.
కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 3, 4 కేటగిరీ పాఠశాలలకు సంబంధించిన ఖాళీలను మాత్రమే చూపినట్లు తెలిసింది. ఉపాధ్యాయుల్లేని ప్రాంతాలు, సింగిల్ టీచర్ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న స్కూళ్లను కొత్త టీచర్లకు కేటాయిస్తున్నట్లు సమాచారం. అలాగే, జూన్‌లో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో రిలీవర్ లేక అదే స్కూళ్లలో ఉండిపోయిన వారి స్థానాలను ఇక్కడ చూపడంలేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
హైకోర్టు తీర్పునకు భిన్నంగా పోస్టుల భర్తీ..
ఇక డీఎస్సీ నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని, మెరిట్ లిస్టు ఇవ్వకుండానే నేరుగా అభ్యర్థులను ఎంపిక చేశారని కొందరు.. రిజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా చేపట్టలేదని మరికొందరు, స్పోర్ట్స్ కోటా ఎంపికలోనూ అవకతవకలు జరిగాయని ఇంకొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే.. రెండు, మూడు పోస్టులు పొందిన వారికి తక్కువ కేటగిరీ పోస్టులు ఇవ్వడంపైనా హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పును వెలవరించింది.
ఉన్నతమైన పోస్టు పొందడం అభ్యర్థి హక్కు అని, వారికి ఆయా పోస్టులు ఇవ్వాలని తేల్చిచెప్పింది. ఫిర్యాదులకు సంబంధించిన పోస్టులను మినహాయించాలని కోర్టు తీర్పునిచ్చినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. అయితే, అందిన ఫిర్యాదులను గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
ఇందుకోసం జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిలో 60 రోజుల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది. కానీ, ఈ సమస్యలు పరిష్కరించకుండానే మొత్తం అన్ని పోస్టులను భర్తీచేసేందుకు ఏర్పాట్లుచేసింది. మొత్తం 15,941 పోస్టులను నింపి ఈ నెల 13 నాటికి కొత్త టీచర్లు స్కూళ్లలో చేరాలని ఆదేశించిడం గమనార్హం.
మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి..
ఇదిలా ఉంటే.. కొత్త ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ విధానంపై పూర్తి అవగాహన ఉండదని, వారికి మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ విద్యాశాఖను డిమాండ్ చేశారు. బదిలీల్లో ఎస్జీటీలకు అనుసరించిన విధానాన్నే వీరికి కూడా అమలుచేయాలన్నారు. అలాగే, బదిలీ అయ్యి రిలీవ్ కాని ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించేలా ఖాళీలు చూపించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ఒక్క కర్నూలు జిల్లాలో ఒక్కో అభ్యర్థి 1,650 ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందని, దీనివల్ల అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొంది.