
స్కూల్ అసిస్టెంట్లకు క్లస్టర్ కాంప్లెక్స్‌ల్లో పోస్టింగ్‌లు
ఇప్పటికే క్లస్టర్లలో ఐదువేల మంది మిగులు ఉపాధ్యాయులు
కొందరికి స్కూళ్లు కేటాయించకుండానే జాయినింగ్ రిపోర్టులు
నేటి నుంచి పాఠశాలల్లో చేరాలని డీఎస్సీ కొత్త టీచర్లకు ఆదేశం
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం డీఎస్సీ–2025 నిర్వహణలోనే కాదు.. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వడంలోనూ ఎక్కడలేని గందరగోళం సృష్టిస్తోంది. స్కూళ్ల ఎంపికలో అభ్యర్థులు ఆప్షన్స్ పెట్టే సమయంలోనూ వారిని తప్పుదారి పట్టించింది. దీంతో చాలామందికి క్లస్టర్ కాంప్లెక్స్‌లో పోస్టింగ్స్ వచ్చాయి. మరోపక్క.. చాలామంది అభ్యర్థులకు ఏ స్కూలూ కేటాయించకుండానే జాయినింగ్ రిపోర్టులు జారీచేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పైగా.. కొత్త టీచర్లు అందరూ సోమవారం వారికి కేటాయించిన స్కూళ్లల్లో రిపోర్టు చేయాలని, వెంటనే విధుల్లో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే, ఏ స్కూలూ కేటాయించని తాము ఎక్కడ రిపోర్టు చేయాలో అర్ధంగాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.
కస్టర్లలో పోస్టింగ్‌లు..
డీఎస్సీ–2025 ద్వారా ఎంపికైన టీచర్లకుఈనెల 3 నుంచి శిక్షణ ఇస్తున్నారు. ఆయా కేంద్రాల్లోనే పోస్టింగ్స్ కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అనుమతించారు. దీంతో అభ్యర్థులు మండలాల వారీగా ఉన్న స్కూళ్లను ఎంచుకున్నారు. కానీ, చాలామంది అభ్యర్థులకు క్లస్టర్లలో పోస్టింగ్స్ వచ్చాయి. దీంతో వీరు మొదటి నుంచే మిగులు ఉపాధ్యాయులుగా మారినట్లైంది.
ఆప్షన్ల సమయంలో సర్కారు దొంగాట..
మరోవైపు.. పాఠశాల విద్యాశాఖ మేలో చేపట్టిన ఉపాధ్యాయుల సాధారణ బదిలీల్లో దాదాపు ఐదువేల మంది స్కూల్ అసిస్టెంట్లు మిగులుగా తేలారు. వీరందరినీ డీఈఓ పూల్, క్లస్టర్ పూల్‌లో ఉంచారు. స్కూళ్లు కేటాయించకుండా ఉపాధ్యాయులను సర్‌ప్లస్ చేయడంపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో.. డీఈఓ పూల్‌లో ఉన్న టీచర్లను సర్దుబాటు చేసి, క్లస్టర్ పూల్‌లో ఉన్నవారిని అలాగే ఉంచారు.
ఇలా ఐదు నెలలుగా వీరికి స్థానాలు కేటాయించలేదు. తాజా డీఎస్సీ–2025లో ప్రకటించిన పోస్టుల్లో 7,725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులే. ఇప్పుడు కొత్తగా స్కూల్ అసిస్టెంట్లుగా ఎంపికైన అత్యధికులను కూడా క్లస్టర్ కాంప్లెక్స్‌ల్లో వేసినట్లు తెలిసింది. రెగ్యులర్ ఉపాధ్యాయులు సెలవుల్లో వెళ్లినప్పుడు ఆ సమయంలో వీరి సేవలను ఉపయోగించుకుంటారు. అయితే, ఆప్షన్లు ఇచ్చుకునే సమయంలోనే కొత్త టీచర్లను సర్కారు తికమకకు గురిచేసి దొంగాట ఆడినట్లు తెలుస్తోంది.
ఎక్కడ రిపోర్టు చేయాలో?
ఇదిలా ఉంటే.. జాయినింగ్ ఆర్డర్ అందిన అభ్యర్థులు సోమవారం తమకు కేటాయించిన స్థానాల్లో రిపోర్టు చేయాలని అధికారులు ఆదేశించారు. కొందరు అభ్యర్థులకు స్థానాలు చూపకపోవడంతో ఎక్కడ రిపోర్టు చేయాలో తెలీక వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలా కొత్త టీచర్లలోని కొందరిని రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్లలో మిగులు ఉపాధ్యాయులుగా మారిస్తే మరికొందరిని ఎటూగాకుండా చేసింది.
రూ.50 వేల బాండ్ ఇవ్వాలంట..
ఇదిలా ఉంటే.. సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో నియమితులైన కొత్త టీచర్లు రూ.50 వేల పూచీకత్తుతో బాండ్‌ను సమర్పించాలని నిబంధన విధించారు. అంతేగాక.. కనీసం ఐదేళ్లు సొసైటీలో పనిచేస్తామని హామీ ఇవ్వాలని పేర్కొనడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు, కార్పొరేటు కంపెనీలు విధించే నిబంధనలను టీడీపీ కూటమి ప్రభుత్వం పెట్టడంపై వారు దుమ్మెత్తిపోస్తున్నారు.