
మెరిట్ ఆధారంగా డీఎస్సీ పోస్టింగ్స్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు
కోర్టు ఉత్తర్వులను కాదని అమరావతిలో వేడుకలకు ప్రభుత్వం సిద్ధం.. సీఎం చేతుల మీదుగా రేపు నియామక పత్రాలు
అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యుల తరలింపునకు ప్రతి జిల్లాకు బస్సులు
సాక్షి, అమరావతి: హైకోర్టు తీర్పయినా తమకు లెక్కేలేదన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోది. డీఎస్సీ దరఖాస్తు సమయంలో తీసుకున్న పోస్టుల ప్రాదాన్యం చెల్లదని, అభ్యర్థులు సాధించిన పోస్టుల్లో ఉన్నతమైన ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది. దీనిని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళుతోంది. సోమవారం హడావుడిగా డీఎస్సీ ఎంపిక జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఇందుకోసం రాష్ట్ర సచివాలయం సమీపంలో ప్రత్యేక వేదిక సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఇతర ఉపాధ్యాయులతో కోర్ కమిటీలను నియమించి ఎంపిక చేసిన 15,941 మంది అభ్యర్థులతో పాటు అదేస్థాయిలో బంధువులను అమరావతికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. కాగా.. పోస్టుల ఎంపికపై అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వచ్చినా అమలు చేయలేదని బాధిత అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లినా సింగిల్ జడ్జి తీర్పునే అమలు చేయాలని చెప్పడంతో పాటు మొత్తం ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఓ పక్క హైకోర్టు ఆదేశాలు ఉండగా.. అందుకు విరుద్ధంగా ప్రభుత్వ నియామక పత్రాల పంపిణీ చేపడుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
రాజకీయ మైలేజీ కోసం..
డీఎస్సీ ఎంపిక జాబితాను ఉమ్మడి జిల్లాల వారీగా ప్రకటించారు. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 16,347 పోస్టులు ప్రకటించగా.. 15,941 మంది ఎంపికైనట్టు ప్రకటించారు. గతంలో డీఎస్సీ అభ్యర్థులకు జిల్లాల్లోనే కౌన్సెలింగ్ నిర్వహించి ఎంపికైన వారికి డీఈవో నియామక పత్రాలు అందించేవారు. కానీ, అందుకు భిన్నంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హడావుడిగా ప్రకటించిన ఎంపిక జాబితాలోని అభ్యర్థులకు అమరావతిలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ విషయంలో కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకెళుతోంది. 15,941 మంది అభ్యర్థులతో పాటు వారి కుటుంబంలోని ఒకరు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు సమాచారం పంపించారు. అంటే మొత్తం 32 వేల మందిని ఈనెల 19న అమరావతికి తరలించనున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఎంపికైన అభ్యర్థుల సంఖ్యను బట్టి 65 నుంచి 134 వరకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు.
అభ్యర్థులు ఎక్కడ ఉన్నా గురువారం సాయంత్రానికి సంబంధిత జిల్లా కేంద్రానికి చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరంతా జిల్లా కేంద్రం నుంచి ఏర్పాటు చేసిన బస్సుల్లోనే బయలుదేరాలని స్పష్టం చేసింది. వీరిని సమన్వయం చేసేందుకు ఒక్కో బస్సుకు ఒక్కొక్క ఎంఈవో, ఒక్కో హెచ్‌ఎం, ఇద్దరు ఉపాధ్యాయులను నియమించింది. అంటే జిల్లాకు సరాసరిన 350 మంది సిబ్బందిని ఇందుకోసం సిద్ధం చేసింది. కాగా.. హైకోర్టు ఇంటీరియం ఆర్డర్ అమలుపై విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కుటుంబ సభ్యులు తప్పనిసరి కాదు
డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం అమరావతిలో నియామక పత్రాల ప్రదాన కార్యక్రమానికి కుటుంబ సభ్యులు తప్పనిసరి కాదని విద్యాశాఖ తెలిపింది. బంధువులు, సన్నిహితులు, స్నేహితులను కూడా తీసుకురావొచ్చని ప్రకటించింది. కుటుంబ సభ్యుల్లో వృద్ధులు, గర్భిణులు ఉంటే వారికి బదులు మరొకరి పేరు సూచించవచ్చని చెప్పింది. ఈ అవకాశం లేని అభ్యర్థులు ఒక్కరే వచ్చేలా ఉంటే ఆ విషయం స్థానిక డీఈవోలకు తెలియజేయాలంది.