టీఆర్‌ఎస్ ప్లీనరీ ఇప్పట్లో లేనట్టేనా? | TRS plenary lenattena nowadays? | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ ప్లీనరీ ఇప్పట్లో లేనట్టేనా?

Jan 11 2015 12:54 AM | Updated on Mar 22 2019 6:18 PM

టీఆర్‌ఎస్ ప్లీనరీ ఇప్పట్లో లేనట్టేనా? - Sakshi

టీఆర్‌ఎస్ ప్లీనరీ ఇప్పట్లో లేనట్టేనా?

అధికారపగ్గాలు చేపట్టాక ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉండడం, ప్రకృతి వైపరీత్యాలు వంటి అననుకూల పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన...

  • అక్టోబర్ నుంచి వాయిదాల మీద వాయిదా  
  • ఆవిర్భావ వేడుకలతో కలిపి ఒకేసారి నిర్వహణ
  • సాక్షి, హైదరాబాద్ : అధికారపగ్గాలు చేపట్టాక ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉండడం, ప్రకృతి వైపరీత్యాలు వంటి అననుకూల పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన తెలంగాణ రాష్ర్ట  సమితి(టీఆర్‌ఎస్) ప్లీనరీ ఇక ఇప్పట్లో జరిగేలా కన్పించడం లేదు. పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉన్నారని, అందుకే సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించలేకపోతున్నారని పార్టీ నాయకులు సమాధానపడుతున్నా, అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కమిటీలు ఎప్పుడు వేస్తారో?

    అని లోలోన ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల కాలం గడిచినా పాత కమిటీలే కొనసాగుతున్న నేపథ్యంలో తమకు ఎప్పుడు అవకాశం వస్తుందోనంటూ ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. గతేడాది ఎన్నికల సంవత్సరం పేర అసలు ప్లీనరీ నిర్వహణ జోలికే వె ళ్లలేదు. కనీసం ప్రభుత్వం ఏర్పాటయ్యాకనైనా ముహూర్తం కుదరడం లేదన్న ఆందోళనలో పార్టీ నాయకులు ఉన్నారు.
     
    రెండేళ్లుగా పాత కాపులే...

    జిల్లా స్థాయిలో 2013 నుంచి పాత కమిటీలే కొనసాగుతున్నాయి. ఇక, ఆయా నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారే ఇన్‌చార్జిలుగా ఉంటారని చెబుతున్నా చాలాచోట్ల దీనిపై స్పష్టత లేదు. మొత్తానికి క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంలో కొంత గందగోళం నెలకొంది. పొలిట్‌బ్యూరోలో మార్పులు చేర్పులతో పాటు అనుబంధ సంఘాల బలోపేతంపైనా దృష్టి పెట్టాల్సి ఉందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. పార్టీపరంగా వివిధ పదవుల్లో కొనసాగుతున్న వారిలో కొద్దిమంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందడంతోపాటు, మంత్రులుగానూ నియమితులయ్యారు. దీంతో ఆయా పదవులకు కొత్తవారిని ఎంపిక చేయాల్సిన అవసరాన్ని నాయకులు గుర్తు చేస్తున్నారు.
     
    వాయిదాల పర్వం...

    వాస్తవానికి టీఆర్‌ఎస్ ప్లీనరీ గతేడాది అక్టోబర్‌లోనే నిర్వహించాల్సి ఉంది. అయితే హుద్‌హుద్ తుపాను కారణంగా వాయిదా వేసుకున్నారు. ఆ తరువాత నిర్వహించాలనుకున్నా రాష్ర్టంలో వర్షాలు పడవచ్చనే సూచనతో వెనుకడుగు వేశారు. ఈలోగా నవంబర్‌లో బడ్జెట్ సమావేశాలు రావడంతో పార్టీ నిర్మాణం గురించి ఆలోచించే తీరిక లేకుండాపోయింది. అలాగే ఏడాది చివరి నెలా గడిచిపోయింది. జనవరి నెలాఖరుకు నిర్వహిస్తారని ప్రచారం జరిగినా ఆ ఊసే ఎత్తలేదు.

    ఫిబ్రవరి చివరి వారం నుంచే బడ్జెట్ సమావేశాల హడావుడికి అవకాశం ఉండడం, మార్చినెల మొత్తం సమావేశాలు కొనసాగనుండడంతో ఆ రెండు నెలలూ ‘ప్లీనరీ’ మరుగునపడ్డట్టే. ఇక అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా ఏప్రిల్ 27న జరిగే ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్న ఆలోచనలో అధినాయకత్వం ఉన్నందున, ప్రత్యేకంగా ప్లీనరీ ఎందుకన్న అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
     
    విపక్షాల జోరు చూసి...


    అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వ కార్యకలాపాలపై దృష్టి సారించగా, ప్రతిపక్ష పార్టీలు  కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు సంస్థాగతంగా బలోపేతం కావడంపై దృష్టి సారించాయి. అన్ని పార్టీలూ సభ్యత్వ నమోదులో తలమునకలై ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ర్టంలో టీఆర్‌ఎస్‌కు దీటుగా సభ్యత్వాలు చేయించాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఆవిర్భావ వేడుకలకు ముందే పూర్తిస్థాయిలో సభ్యత్వాలను నమోదు చేయించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టుగా చెబుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement