కారుకే నేరేడుచర్ల..

TRS Party Won The Nereducherla Municipal Chairman Post - Sakshi

సాక్షి, సూర్యాపేట : తీవ్ర ఉత్కంఠ నడుమ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. దీంతో చెర్మన్‌గా చందమల్ల జయబాబు, వైస్‌ చైర్మన్‌గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌కు ఎక్స్‌అఫీషియో సభ్యులతో 11 ఓట్ల బలం ఉంటే.. కాంగ్రెస్‌కు 10 ఓట్లు ఉండటంతో మెజార్టీ సభ్యులు ఉన్న టీఆర్‌ఎస్‌కే నేరేడుచర్ల సొంతమైంది. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని ఎక్స్‌ అఫీషియో ఓటుగా చేర్చడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ సమావేశాన్ని వాకౌట్‌ చేసింది. కోరం ఉండటంతో చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక తంతు పూర్తి చేశారు.  

సుభాష్‌రెడ్డి ఓటుతో చైర్మన్‌ గిరి
మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్‌కు చెందిన కేవీపీ రామచందర్‌రావు ఓటుపై టీఆర్‌ఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత మంగళవారం ఎన్నిక ఉంటుం దని ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించడంతో టీఆర్‌ ఎస్‌ మరో ఎక్స్‌ అఫీషియో ఓటును పెట్టుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్న ఎత్తు ఫలించింది. ఎన్నిక వాయిదాకు ముందు కేవీపీ ఓటుతో కాంగ్రెస్‌కు 10 ఓట్లు, టీఆర్‌ఎస్‌కు 10 ఓట్లు ఉన్నాయి. దీంతో టాస్‌ వేస్తే ఎవరికి విజయం దక్కుతుందోనని భావించిన టీఆర్‌ఎస్‌.. తిరస్కరించిన కేవీపీ ఓటును మళ్లీ ఎలా జాబితా లో పెడతారని వేసిన పాచికతో ఎన్నిక వాయిదా పడింది. ఈ క్రమంలో ఇరుపార్టీలకు సమానంగా ఓట్లు ఉండటంతో శేరి సుభాష్‌రెడ్డి ఓటును నేరేడుచర్ల మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ నమోదు చేయించింది. దీంతో ఆ పార్టీ సభ్యుల బలం 11కు చేరింది. సుభాష్‌రెడ్డి పేరును ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఎన్నిక ప్రారంభానికి ముందు చేర్చారు. 

తొలి జాబితాతోనే ఎన్నిక చేపట్టాలి
ఎన్నికల ప్రక్రియను ప్రిసైడింగ్‌ అధికారి ప్రారం భిస్తూ ఓటు హక్కు జాబితాలో ఉన్న వారి పేర్లను సమావేశంలో వెల్లడించారు. దీంతో సుభాష్‌రెడ్డికి ఇప్పుడెలా ఓటు హక్కు కల్పిస్తారని ఉత్తమ్‌తో పాటు ఆ పార్టీ సభ్యులు పీఓను ప్రశ్నించారు. ఈ నెల 25న అర్ధరాత్రి 12 గంటలలోపు ఎక్స్‌ అఫీ షియో సభ్యుడిగా ఓటు హక్కు పొందిన తొలి జాబితాతోనే చైర్మన్‌ ఎన్నిక చేపట్టాలని, ఆ తర్వాత నమోదు చేసిన సుభాష్‌రెడ్డి పేరును జాబితాలో నుంచి తీసివేయాలని కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబట్టారు. అయితే సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రారంభమయ్యే ముందు వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించిందని, అందకే సుభాష్‌రెడ్డి పేరును ఓటు జాబితాలో చేర్చామని పీవో వివరించారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈసీ ఆదేశాలనే తాము అనుసరిస్తామని పీఓ చెప్పడంతో   కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. 

కాంగ్రెస్‌  రాస్తారోకో
శేరి సుభాష్‌రెడ్డికి ఓటు హక్కు కల్పించడాన్ని నిరసిస్తూ ఎంపీలు ఉత్తమ్, కేవీపీలు నేరేడుచర్లలో రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికైన∙మెజార్టీ సభ్యులు బయట ఉన్నా.. ఎన్నిక కాని వారితో చైర్మన్‌ ఎన్నికను పూర్తిచేశారని విమర్శించారు. ఈ నెల 25న అర్ధరాత్రి 12 గంటలలోపు ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఓటుహక్కు నమోదు చేసుకున్న వారికే చైర్మన్‌ ఎన్నికలో ఓటు హక్కు ఉంటుందన్నారు. ఇదే విషయాన్ని తనకు పురపాలక శాఖ డైరెక్టర్‌ శ్రీదేవి, ఈసీ చెప్పారన్నారు. ఈ ఎన్నికపై న్యాయ పోరాటం చేస్తామని ఉత్తమ్‌ తెలిపారు. కేటీఆర్, కేసీఆర్‌ దోచుకున్న సొమ్మునంతా మున్సిపల్‌ ఎన్నికల్లో పంచారని ఆరోపించారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top