టికెట్‌ టెన్షన్‌!

TRS MLAS Tensiones Assembly Elections Nizamabad - Sakshi

టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుల గుండెల్లో గుబులు మొదలైంది.. సిట్టింగ్‌లకే సీట్లిస్తామన్న సీఎం కేసీఆర్‌.. ఒకటి, రెండు చోట్ల మార్పులు తప్పవని చేసిన ప్రకటన అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆందోళనకు గురి చేస్తోంది. ‘ఒకటి, రెండు మార్పులు’ అన్న అంశంపైనే ప్రధానంగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఎవరి సీట్లు గల్లంతవుతాయి.. ఎవరికి టికెట్లు దక్కుతాయనే అంశంపైనే ప్రధాన చర్చ నడుస్తోంది.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకవైపు ఆనందం, మరోవైపు ఒకింత ఆందోళన నెలకొంది. సిట్టింగ్‌లకే సీట్లని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం వారిలో సంతోషం నింపగా.. ఒకటి, రెండు మార్పులుంటాయని ఆయన కుండబద్దలు కొట్టడం శాసన సభ్యులను కలవరపెడుతోంది. సెప్టెంబర్‌లోనే అభ్యర్థుల తొలి జాబి తా విడుదల చేస్తామన్న సీఎం కేసీఆర్‌ ప్రకటనతో అధికార పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే, ‘ఒకటి, రెండు మార్పులు’ అన్న అంశంపైనే ప్రధానంగా ఈ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొందరు ఎమ్మెల్యేలకు టికెట్‌ టెన్షన్‌ పట్టుకుంది. సిట్టింగ్‌లకే టికెట్‌ ఇస్తామని పేర్కొన్న కేసీఆర్‌.. మరోవైపు ఒకటీ రెండు చోట్ల మార్పులుంటాయనే సంకేతాలివ్వడం తెలిసిందే.

దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలు అభ్యర్థిత్వంపై ఎక్కడో ఒకింత అభద్రతాభావంతో ఉన్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆ మార్పు చేయాలని భావిస్తున్న సీట్లలో ఉమ్మడి జిల్లాకు చెందిన నియోజకవర్గాలేమైనా ఉంటాయా..? అనే అంశంపై పార్టీలో విశ్లేషణ సాగుతోంది. అభ్యర్థుల ఎంపికలో కేశవరావు నేతృత్వంలోని పార్టీ ప్రధాన కార్యదర్శు లు, కార్యదర్శులతో ఎప్పటికప్పుడు తెప్పించుకు నే నివేదికలు కూడా కీలకమని కేసీఆర్‌ పేర్కొన్నా రు. దీంతో సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు అంటూనే ఎంపిక కమిటీని నియమించడంతో కొందరు ఎమ్మెల్యేలకు అంతర్గతంగా టెన్షన్‌ పట్టుకుంది.

కొందరు ఎమ్మెల్యేల్లో టెన్షన్‌! 
2014 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంట్‌ స్థానాల్లో కూడా గులాబీ జెండాను ఎగురవేసింది. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన సీనియర్‌ నేతలున్న కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికల్లో ఖాతా కూడా తెరువలేక పోయింది. నిజామాబాద్‌ అర్బన్‌ వంటి పలు నియోజకవర్గాల్లో కొంత పట్టున్న బీజేపీ సైతం ఉనికి చాటుకోలేక పోయింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా గత ఫలితాలనే పునరావృతం చేయాలని అధికార పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది.

ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వ, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహించుకుని వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆరు నెలల ముందుగానే అభ్యర్థుల ప్రకటన చేస్తున్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మొత్తం మీద పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ప్రకటన పార్టీ శ్రేణుల్లో ఎన్నికల ఉత్సాహాన్ని నింపగా, ఎమ్మెల్యేల్లో మాత్రం టెన్షన్‌ మొదలైందనే చర్చ గులాబీ దళంలో సాగుతోంది.

మొదటి విడతలో ఖరారయ్యేదెవరికి..? 
సెప్టెంబర్‌లోనే టిక్కెట్లు ఖరారు చేయడం ద్వారా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మరింతగా ప్రజలతో మమేకం అయ్యేందుకు అవకాశం ఉంటుందని కేసీఆర్‌ భావిస్తున్నారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో మొదటి విడతలో ఖరారయ్యే స్థానాలు మూడు నుంచి నాలుగు ఉండే అవకాశాలున్నాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మొదటి విడతలో ఎవరి స్థానం ఉంటుందా అని టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

సమాజిక సమీకరణాలు, ఎలాంటి వివాదాలు లేని నియోజకవర్గాలు, అలాగే టిక్కెట్‌ కోసం పోటీ పడే నేతలు లేని నియోజకవర్గాలకు మొదటి జాబితాలో చోటు దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు, వివాదాల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నయంగా ఇతర నేతలు తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top