టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్‌

TRS MLA Muthireddy Yadagiri Tested Positive - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జనగామ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంపై ఆమె సతీమణి పద్మలతా రెడ్డి స్పందించారు. ఆయన ఆరోగ్యంపై స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వాట్సప్‌ వాయిస్‌ రికార్డు ద్వారా ఓ ప్రకటన చేశారు. ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్తిరెడ్డి.. శుక్రవారం హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఎమ్మెల్యేకు వైరస్‌ సోకడంతో అధికారులు సూచనల మేరకు తమ కుటుంబ సభ్యులంతా పరీక్షలు చేయించుకున్నామని, వాటి రిపోర్టు రావాల్సి ఉందన్నారు. (ఎమ్మెల్యేకు పాజిటివ్‌: నిర్బంధంలోకి హరీష్‌)

ప్రస్తుతానికి తామంతా స్వీయ నిర్బంధంలో ఉన్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మరో వారంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతారని చెప్పారు. తమ నాయకుడి ఆరోగ్యంపై ఆరా తీస్తున్న కార్యకర్తలు, అభిమానులందరికీ ఆమె క్షతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని పద్మలతా సూచించారు. కాగా తెలంగాణలో కరోనా బారినపడిన తొలి ఎమ్మెల్యే ముత్తిరెడ్డినే కావడం గమనార్హం. మరోవైపు మంత్రి హరీష్‌ రావు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top