చెప్పింది చేశాం: మంత్రి హరీశ్‌

TRS Minister Harish Rao Started 50 Double Bed Room Houses In Sangareddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి : పేదలు ఆత్మగౌరవంగా బ్రతుకాలన్నదే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలోచన అని ఆర్థిక మంత్రి తన్నీరు హరిశ్‌రావు అన్నారు. నారాయణ ఖేడ్‌ నియోజకవర్గంలోని సోమవారం సామూహిక గృహప్రవేశం కార్యక్రమంలో భాగంగా బాచేపల్లి గ్రామంలో 50 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల కోసం పనిచేసే ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అంటే కాగితాల్లో ఇండ్లు.. చేతుల్లో బిల్లులు అని విమర్శించారు. సంక్షేమానికి కొత్త నిర్వచనం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని ప్రగాల్భాలు పలికి.. ఒక్క తండాను కూడా పంచాయతీలుగా చేయలేదన్నారు. టీఆర్‌ఎస్‌ వచ్చాక ఏం చేప్పామో అవి చేసి చూపించామన్నారు.

గతంలో నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో రెండు రెసిడెన్షియల్‌ స్కూల్‌లు ఉంటే టీఆర్‌ఎస్‌ వచ్చాక ఎనిమిది కొత్త రెసిడెన్షియల్‌ పాఠశాలలు తెచ్చి ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో నమ్మకాన్ని కలిగించామన్నారు. ఒక్కో విద్యార్థికి లక్షా 20 వేలు ఖర్చు చేశామని, రాష్ట్రంలో 600 ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలు మంజూరు చేశామన్నారు. పెన్షన్‌లను పెంచి లబ్ధి దారుల ముఖాల్లో ఆనందాన్ని నింపామన్నారు. అలాగే రైతు బంధు, రైతు బీమాతో రైతులకు తమ ప్రభుత్వం భరోసానిచ్చిందన్నారు. బాచేపల్లి గ్రామ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు దేశానికి ఆదర్శంగా నిలుస్థాయని, గేటెడ్‌ కమ్యూనిటీని తలపించేలా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా బాచేపల్లి తండాను భక్తిదామ తండాగా పేరు మార్చాలని గ్రామస్తులు కోరగా వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top