పోటాపోటీ..

TRS Leaders Fair On Jagga Reddy Medak - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విదేశాలకు మహిళల అక్రమ రవాణా కేసులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అరెస్టుతో జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మంగళవారం కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పోటాపోటీ నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జయప్రకాశ్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డిని హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుని, మంగళవారం రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. జగ్గారెడ్డి అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ సంగారెడ్డి పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది. మంగళవారం ఉదయం పట్టణంలో ర్యాలీ నిర్వహించి బంద్‌ నిర్వహించేందుకు ప్రయత్నించిన కసిని రాజు, శ్రీకాంత్, మహేశ్‌ తదితర కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సదాశివపేటలోనూ కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ నేతృత్వంలో బంద్‌కు పిలుపునిచ్చారు. కార్యకర్తల అరెస్టుతో సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో బంద్‌కు నామమాత్ర స్పందన లభించింది. జగ్గారెడ్డి భార్య, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు నిర్మలకు సంఘీభావం తెలిపేందుకు ఉమ్మడి మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి మంగళవారం ఉదయం సంగారెడ్డికి వచ్చారు. ఆమె వెంట పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన గోదావరి అంజిరెడ్డి, శశికళ యాదవరెడ్డి, జిన్నారం జెడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్‌ ఉన్నారు.

జగ్గారెడ్డి కుటుంబానికి సంఘీభావం తెలిపిన కాంగ్రెస్‌ నేతలు పట్టణంలో ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలోని పోలీసులు అడ్డుకున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారని సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే తన భర్తపై టీఆర్‌ఎస్‌ అక్రమ కేసులు బనాయిస్తోందని జగ్గారెడ్డి భార్య నిర్మల ఆరోపించారు. కాగా జగ్గారెడ్డి కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్‌ నుంచి వస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ఔటర్‌ రింగు రోడ్డు ముత్తంగి టోల్‌ప్లాజా వద్ద పటాన్‌చెరు పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత వదిలేశారు.

టీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమాలు
మహిళలను విదేశాలకు అక్రమంగా రవాణా చేసిన తూర్పు జయప్రకాశ్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంఘీభావం తెలపడంపై టీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరస్తులకు కాంగ్రెస్‌ వత్తాసు పలుకుతోందని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం కార్యకర్తలు సంగారెడ్డి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్‌ రీజినల్‌ ఆర్గనైజర్‌ దుర్గల్ల లక్ష్మి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి నేతృత్వంలో ఉత్తమ్‌ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించారు.

టీఆర్‌ఎస్‌ మహిళా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న భార్యను మోసగించి, మహిళలను అక్రమంగా విదేశాలకు రవాణా చేసిన జగ్గారెడ్డికి టీపీసీసీ నేతలు వత్తాసు పలకడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
తనను ఆర్థికంగా నిలువునా మోసం చేసిన జగ్గారెడ్డి, తన వెంట తిరిగిన కార్యకర్తలను యాచకులుగా మార్చారని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోవర్దన్‌నాయక్‌ మరో ప్రెస్‌మీట్‌లో ఆరోపించారు. మొత్తంగా ఉదయం నుంచి అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్‌ నాయకుల ఆందోళనలతో సంగారెడ్డి పట్టణం అట్టుడికిపోయింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top