అధ్యక్షా.. మా సంగతేంది?

TRS Leaders Disagreements In Warangal - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : భిన్న దృక్పథాలు.. విభిన్న ధ్రువాలు అయినప్పటికీ గులాబీ జెండా నీడ కింద ఏకమయ్యారు. దళపతి ఒక్క ఈల కొడితే లాఠీలకు ఎదురొడ్డారు.. తెలంగాణ ఉద్యమ పొద్దుకు రణనినాదం అయ్యారు. పోరు మీదనే ఈడు గడిచిపోతున్నా.. వారసత్వపు ఆస్తులన్నీ కరిగిపోతున్నా.. లక్ష్యం ముద్దాడే వరకు వెనుకడుగు వేయకుండా నెత్తురు ధారవోశారు. అధికారంలోకి వచ్చినవేళ  కానివాళ్లంతా ‘కారె’ క్కిపోతుంటే.. అధ్యక్షుల వారికి అన్ని తెలుసులే అని మనుసుకు సర్దిచెప్పుకుంటూ పార్టీని నడిపిస్తూ.. నడుస్తున్నారు. సర్వం త్యాగం చేసిన వాళ్లిప్పుడు ‘అధ్యక్షా.. మా సంగతేంది’ అని అడుగుతుండ్రు.
 

‘గుడిమల్ల’ అడుగుతున్నారు...
వరంగల్‌ జిల్లాలో పార్టీకి సర్వం త్యాగం చేసిన వాళ్లలో గుడిమల్ల రవికుమార్‌ ఒకరు. ఉద్యమ సమయంలో తన లాయర్‌ వృత్తిని పార్టీ కోసమే ఉపయోగించారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఒక్క పిలుపు ఇస్తే చాలు  ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడిగా వేల కొద్ది ఆటోలు, ఇతర వాహనాలను రోడ్డు మీద నిలబెట్టారు. ఉద్యమ సమయంలో పోలీసులు, కోర్టులు ఇలా అన్నీ తానై నడిపించారు. ఏనాడు పార్టీలో నాకు ఇది కావాలని అడగలేదు. టీఆర్‌ఎస్‌ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ను నమ్ముకుని పార్టీలో ఉన్నారు. కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, వరంగల్‌ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసిన అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి గుడిమల్ల రవికుమార్‌ సిద్ధమయ్యారు. అధిష్టానం కూడా ఆయన పేరును ఖరారు చేసింది. ఇంతలో ఏమైందో ఏమో.. ఆయనను పక్కనపెట్టి పసునూరి దయాకర్‌కు పార్టీ టికెట్‌ ఇచ్చింది. అనంతరం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌.. రవికుమార్‌ను కలిసి ‘నీ రాజకీయ భవిష్యత్‌ నాది’ అని మాట ఇచ్చారు. ఈ  నమ్మకంతో  ‘అధ్యక్షా.. వరంగల్‌ తూర్పు టికెట్‌ నాకు ఇవ్వు’ అని గుడిమల్ల అడుగుతున్నారు. 

‘తక్కెళ్లపల్లి’ ఆక్రోశం....
అప్పటి మాజీ మంత్రి యతి రాజారావుకు ముఖ్య అనుచరుడిగా  రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తక్కెళ్లపల్లి రవీందర్‌రావు  2007లో కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. రెండేళ్ల పాటు జన రల్‌ సెక్రటరీగా కొనసాగారు. ఆ తర్వాత పాలకుర్తి నియోజకవర్గం ఇన్‌చార్జిగా అక్కడి గ్రామాల్లో పార్టీని బలోపేతం చేశారు.  కుల వృత్తులు, చేతి వృత్తుల వాళ్లను ఉద్యమం వైపు నడిపించడంలో కీలకంగా పనిచేశారు. ఆయన శ్రమను గుర్తించిన కేసీఆర్‌.. పార్టీ రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా నియమించారు. మానుకోట సంఘటనలో తక్కెళ్లపల్లి కీలకపాత్ర పోషించారు. జెడ్పీ చైర్మన్‌ పీఠం దక్కించుకోవడంలో క్యాంపులకు కూడా ఇన్‌చార్జిగా వ్యవహరించారు. మొదటి నుంచి పాలకుర్తి నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో దాదాపు ఆయనకు టికెట్‌ ఖరారు అయినట్లే అయింది. కానీ.. తన రాజకీయ గురువు యతిరాజారావు  కొడుకు సుధాకర్‌రావు కోసం త్యాగం చేశారు.  ఈ ఎన్నికల్లో టికెట్‌ తనకే వస్తుందనే ఆలోచనతో పని చేసుకుంటున్న ఆయనకు ఎర్రబెల్లి దయాకర్‌రావు రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో కొంత ధిక్కార స్వరం అందుకున్న అయన ‘అధ్యక్షా.. ఎర్రబెల్లికి కొండా దంపతులు అంటే గిట్టదు.. ఆయనకు వరంగల్‌ తూర్పు టికెట్‌ ఇచ్చి నాకు పాలకుర్తి ఇవ్వండి’ అని అడుగుతున్నారు. 

‘నాగుర్ల’ కల నెరవేరేనా...
తెలంగాణ ఉద్యమంలో మొదటి తరం నేత నాగుర్ల వెంకటేశ్వర్లు. భూపాలపల్లి నియోజక వర్గంలోని మొగుళ్లపల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలి చారు. టీఆర్‌ఎస్‌ జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేశా రు. జెడ్పీటీసీ సభ్యుడిగా కొనసాగుతూనే ఉద్యమకారుడిగా నియోజకవర్గంలో పార్టీని విస్తరిం చారు. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న ఉద్యమంలో భూపలపల్లి, పరకాల నియోజక వర్గంలో విస్త్రతంగా పర్యటిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమకారులు, మద్దతుదారులను కూడగట్టారు. ఈ క్రమంలో  2014లో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ సీటు ఆశించారు. పార్టీ అధినేత కేసీఆర్‌.. సిరి కొండ మధుసూదనచారికి అవకాశం కల్పిం చారు. ఆ సమయంలో నాగుర్ల వెంకటేశ్వర్లును టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలిపించుకుని అవకాశం కల్పిస్తానని బుజ్జగించారు. దీంతో పార్టీకి విథేయుడిగా ఉంటూ వచ్చారు. ఇటీవలే ఆయనకు రైతు రుణ విమోచన కమిషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు. కానీ.. అది ఇప్పటివరకూ అమల్లోకి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి లేదా పరకాల నుంచి తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు.

సహోదర్‌రెడ్డి సంకల్పం...
ముద్దసాని సహోదర్‌రెడ్డి  సీనియర్‌ న్యాయవాది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎగసిన జ్వాల. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి హన్మకొండ అసెంబ్లీ స్థానానికి ఈయన పేరు వినిపించింది. ఆయన్ను కాదని మందాడి సత్యనారాయణరెడ్డికి టికెట్‌ ఇచ్చింది. సహోదర్‌రెడ్డి పార్టీ గెలుపుకోసం పని చేశారు.  ఉద్యమం ఉధృతమవుతున్న రోజుల్లో తానే ముందుండి నడిపించారు.  2009లోను వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి మరోసారి ప్రయత్నించి విఫలం అయ్యారు. 2014లో ఆయనకు పరకాల నుంచి తొలి అవకాశం ఇచ్చారు. చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతర జరిగిన రాజకీయ పరిణామాల్లో చల్లా ధర్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ధర్మారెడ్డిని టీఆర్‌ఎస్‌ ఖరారు చేసింది. ఈ క్రమంలో తనకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని సహోదర్‌రెడ్డి కోరుతున్నారు. 

గోవింద్‌ నాయక్‌ ఆవేదన..
ఈ యువ మాజీ ఉపాధ్యాయుడు టీఆర్‌ఎస్‌ పార్టీ తొలి నాళ్ల నుంచీ ఉన్నాడు. కేసీఆర్‌ పిలుపు అందుకుని 2004లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ములుగు ప్రాంతంలోని గోండు, కోయ, లంబాడాలను ఏకం చేసి ఉద్యమం వైపుకు నడిపించారు. అప్పట్లో ఇది మావోయిస్టు ప్రోత్సాహ ఉద్యమం అని పోలీసులు వెంబడించారు. అయినా ఊరూరా గులాబీ  జెండాను ఎగురేశారు. 2004లో టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నం చేస్తే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు పోయింది. పొదెం వీరయ్యకు  కేటాయించారు.  2009 మహాకూటమి పొత్తు కారణంగా  సీటు టీడీపీకి పోయింది. సీతక్కకు సీటు దక్కింది.  అయినా టీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నారు. ఎంపీటీసీ సభ్యుడుగా కొనసాగుతున్నారు.  ఇప్పుడు  గోవింద్‌ నాయక్‌ ‘ అధ్యక్షా... నా త్యాగాన్ని గుర్తించి ములుగు టికెట్‌ విషయంలో నా అభ్యర్థనను పరిశీలించండి.’ అని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top