రైలు ప్రయాణం మరింత భద్రం 

Train travel is more secure - Sakshi

ఐఎస్‌ఎస్‌ పేరుతో రైల్వే శాఖ సంస్కరణ చర్యలు

ప్రయాణికులు 20 నిమిషాల ముందే స్టేషన్‌ చేరుకోవాలి

క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలకు అనుమతి

ప్రవేశ ద్వారాల వద్ద ఫేస్‌ రికగ్నేషన్‌ కెమెరాలు

లగేజీ, వాహనాల తనిఖీకి అత్యాధునిక సదుపాయాలు

ఎస్‌సీఆర్‌ పరిధిలో సికింద్రాబాద్, నాంపల్లి, తిరుపతి స్టేషన్ల ఎంపిక  

ఇన్నాళ్లూ జరిగినట్లుగా.. ఆఖరి నిమిషంలో రైలెక్కే సన్నివేశాలు ఇకపై కనిపించకపోవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో రైలు ప్రయాణికులంతా ప్రయాణానికి 20 నిమిషాలు ముందే స్టేషన్‌ చేరుకోవాలి. తమ లగేజీ తనిఖీ చేసుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి. ఇకపై రైలుప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ప్రయాణానికి అనుమతించనున్నారు. ఇలాంటి ఎన్నో మార్పులకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు రక్షణ పరంగా కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా కేంద్ర రైల్వే బోర్డు పలు సంస్కరణలు చేపడుతోంది. ఇంటిగ్రేటెడ్‌ సెక్యూరిటీ సిస్టమ్‌ (ఐఎస్‌ఎస్‌) పేరిట దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లలో ఈ భద్రతా ఏర్పాట్లను విస్తరించనున్నారు. ఇప్పటికే అలహాబాద్, హుబ్లీ స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీ లిస్తోన్న రైల్వేశాఖ త్వరలోనే దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌)లో ఈ సేవలను విస్తరించనుంది. ఇందుకోసం ఎస్‌సీఆర్‌ పరిధిలోని సికింద్రాబాద్, నాంపల్లి, తిరుపతి స్టేషన్లను ఎంపిక చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) పాత్ర అత్యంత కీలకం కానుంది.   
 – సాక్షి, హైదరాబాద్‌

ఎలాంటి ఏర్పాట్లు వస్తాయి?
ఐఎస్‌ఎస్‌ విధానం ఏర్పాట్లలో భాగంగా స్టేషన్‌ పరిసరాలన్నింటినీ సీసీటీవీ కెమెరాల నిఘాలోకి తీసుకువస్తారు. స్టేషన్‌ పరిధిలో అసాంఘిక శక్తుల కదలికలను పసిగట్టి వారి ఆటకట్టించేందుకు ఇది దోహదపడనుంది. ఇకపై రైళ్లల్లో ఎవరెవరు ఎక్కుతున్నారన్న విషయం రికార్డవుతుంది. తద్వారా రైల్లో నేరాలు, చోరీలు తగ్గుముఖం పడతాయి. ఈ కట్టుదిట్టమైన వ్యవస్థ కోసం అదనంగా ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది అవసరమవుతారు. డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్స్, హ్యాండ్‌ హెల్డ్‌ మెటల్‌ డిటెక్టర్స్, అండర్‌ వెహికల్‌ స్కానర్స్, ఫేస్‌ రికగ్నేషన్‌ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే సికింద్రాబాద్‌ స్టేషన్లో దాదాపుగా ఈ ఏర్పాట్లన్నీ ఉన్నాయి. ప్రతీ ప్రవేశ ద్వారం, బయటికి వెళ్లే మార్గంపై సునిశిత నిఘా ఉంటుంది. ఇందుకోసం కొన్ని మార్గాలను ఆనుకుని ప్రహరీలు నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యవస్థను అమలు చేయాలంటే ఇపుడున్న వ్యవస్థను మరింత బలోపేతం చేసి అదనపు సిబ్బందిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

దీని వల్ల లాభాలేంటి? 
- రైళ్లలో ప్రయాణం మరింత సురక్షితమవుతుంది 
నేరస్తులు ఇకపై రైళ్ల ద్వారా పరారయ్యే అవకాశాలుండవు 
​​​​​​​- టికెట్‌ లేని ప్రయాణాలు తగ్గుముఖం పడతాయి 
​​​​​​​- మాదకద్రవ్యాలు, మారణాయుధాలు తదితరాల అక్రమరవాణాకు వీలుండదు 
​​​​​​​- ఉగ్రవాదులు, పాత నేరస్తులను సులభంగా గుర్తించవచ్చు 
​​​​​​​- అనుమానితులు స్టేషన్‌లోకి చొరబడలేరు 
​​​​​​​- తప్పిపోయిన, ఇంటినుంచి పారిపోయిన చిన్నారులను గుర్తించడం సులభం 
​​​​​​​- ఆడపిల్లలు, మహిళల అక్రమరవాణాకు కూడా ముకుతాడు 

నిజంగా సవాలే! 
సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఒక్క రోజు జరిగే కార్యకలాపాలను గమనిస్తే.. 
ప్రయాణించే రైళ్లు    :    215 
ప్రయాణీకులు    :    1,80,000 
ప్లాట్‌ఫామ్‌లు    :     10 
ప్రవేశద్వారాలు    :    6 

​​​​​​​- ఒక్క సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచే ఇంత మంది ప్రజలు ప్రయాణాలు సాగిస్తే.. వీరందరిని రైలు వచ్చేలోగా తనిఖీ చేసి పంపడం సవాలే. 
​​​​​​​- దేశంలో నలుమూలలా భిన్న వాతావరణాలుంటాయి. ఇవి రైళ్ల రాకపోకల్లో జాప్యానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పయాణికులను తనిఖీ చేయడమంత సులువు కాదు. 
​​​​​​​- పండుగలు, పర్వదినాలు, మేళాలు జరిగినపుడు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయాల్లోనూ సిబ్బందికి తనిఖీలు నిర్వహించడం కత్తిమీదసామే. 
​​​​​​​- ఇప్పటికే ప్రతిరోజూ 300 రైళ్లల్లో 321 ఆర్పీఎఫ్, 154 మంది జీఆర్పీ పోలీసులు గస్తీ కాస్తున్నప్పటికీ.. నేరాలు తగ్గినట్లు కనిపించడం లేదు.  

అధికారిక ఆదేశాలు రాలేదు 
నూతన సమీకృత భద్రతా వ్యవస్థ (ఐఎస్‌ఎస్‌) అమలుకు సంబంధించిన ఆదేశాలు అధికారికంగా 
అందలేదు. ఎస్‌సీఆర్‌ పరిధిలోని తిరుపతి, సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇది పూర్తిస్థాయిలో అమలు కావాలంటే మరికాస్త సమయం పట్టే 
అవకాశముంది      
 – రాకేశ్‌ సీపీఆర్వో, దక్షిణమధ్య రైల్వే.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top