పెళ్లింట విషాదం | Tragedy of the wedding with road accident | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం

Jan 5 2019 2:58 AM | Updated on Jan 5 2019 2:58 AM

Tragedy of the wedding with road accident - Sakshi

సాయికుమార్, ప్రియాంక

ఆదిలాబాద్‌ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో నవదంపతులు సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా మావల మండలం దేవాపూర్‌ ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద శుక్రవారం జరిగింది. మరో పది నిమిషాల్లో ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొనే సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో నవదంపతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. మావల మండలం రాంనగర్‌లో నివాసం ఉంటున్న మెట్‌పల్లి ముత్తమ్మ–అశోక్‌ దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంకకు నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం వడ్డెడ్‌ గ్రామానికి చెందిన అడెపల్లి సాయికుమార్‌తో గురువారం పెళ్లి కుమారుని ఇంటి వద్ద వివాహమైంది. శుక్రవారం పెళ్లి కూతురు ఇంటి వద్ద రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.

ఇందుకు కారులో నవదంపతులతోపాటు పెళ్లి కూతురు బంధువులు వడ్డెడ్‌ నుంచి ఆదిలాబాద్‌కు కారులో బయల్దేరారు. దేవాపూర్‌ ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారి 44పై ఆదిలాబాద్‌ నుంచి బరంపూర్‌ గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు టర్న్‌ అవుతుండగా వీరి కారు ఢీకొట్టింది. కారు నడుపుతున్న పెళ్లికొడుకు సాయికుమార్‌ బ్రేక్‌ వేసినా అదుపు కాకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారు నుజ్జునుజ్జు కాగా పెళ్లి కొడుకు సాయికుమార్, ఆయన మేనత్త దొనకంటి రాజమణిలకు తీవ్రగాయాలయ్యాయి. మరో నలుగురు కూడా ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
నిలిచిపోయిన ఫంక్షన్‌  
పెళ్లి కూతురు ఇంట్లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఏర్పాట్లలో నిమగ్న మయ్యారు. అప్పటికే వంటలు సైతం పూర్తి కావచ్చాయి. మరో గంటలోపు భోజనాలు సైతం ప్రారంభం కానున్న వేళ రోడ్డు ప్రమాదంలో నవదంపతులు, వారి బంధువులు గాయపడటంతో రిసెప్షన్‌ నిలిచిపోయింది. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు రిమ్స్‌ ఆçస్పత్రికి చేరుకున్నారు. అక్కడ బంధువులు, కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement