ట్రాఫిక్‌ పోలీసుల తిట్ల పురాణం 

Traffic Police Scolds On Passenger - Sakshi

 అసభ్య పదజాలంతో  కానిస్టేబుల్‌ దూషణ 

గతంలోనూ ఆర్టీసీ డ్రైవర్‌పై కానిస్టేబుల్‌ దాడి

ఆసిఫాబాద్‌ అర్బన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసు విధానం అమల్లో ఉంటే,  జిల్లాలో మాత్రం కొంతమంది పోలీసుల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద తరచూ పోలీసులు వాహనాల  తనిఖీ చేపడుతున్నారు. ఇదే తరహాలో మంగళవారం సాయంత్రం ఓ సివిల్‌ ఎస్సై, ఒక ట్రాఫిక్‌ ఎస్సై, ఏఎస్సై తమ సిబ్బందితో వాహనదారుల వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో ఆసిఫాబాద్‌కు చెందిన ఓ యువకుడు బైక్‌పై వస్తూ పోలీసులను చూసి దూరంగా వెళ్తున్న క్రమంలో విధుల్లో ఉన్న ఓ  కానిస్టేబుల్‌ తిట్లపురాణం మొదలెట్టాడు. దీంతో ఆ యువకుడు తనను ఎందుకు దూషిస్తున్నారని ప్రశ్నించగా అక్కడే ఉన్న ఎస్సై మాత్రం తిట్టిన  విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా యువకున్ని మరింత బెదిరించాడు.

దీంతో ఆ యువకుడు దయచేసి తనను తిట్టవద్దని, ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమాన విధించాలి తప్పా ఇలా అసభ్య పదజాలంతో దూషించడమేమిటన్నారు. అక్కడే ఉన్న సాక్షి ప్రతినిధి ఇదంతా గమనించి ఆ యువకున్ని ఎందుకు దూషిస్తున్నారని పోలీసులను అడిగితే మీ పని మీరు చూసుకోండని దురుసుగా సమాధానం ఇచ్చారు. ఇటీవల ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ మంచిర్యాల బస్టాండులో కదులుతున్న బస్సులోకి ఎక్కవద్దని సూచించినందుకు ఏకంగా ఆసిఫాబాద్‌ ఆర్టీసీ డిపో ఆవరణలోకి చొరబడి దాడి చేయడంతో ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు దిగారు. రెండు గంటల పాటు బస్సులు నిలిపివేశారు. ఎట్టకేలకు ఉన్నతాధికారుల హామీతో ఆందోళన విరమించారు. తాజాగా బుధవారం సాయంత్రం పట్టణంలోని జన్కాపూర్‌ స్పెషల్‌ సబ్‌ జైలు ముందు ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ రెవెన్యూ ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించినట్లు సదరు ఉద్యోగి వాపోయాడు.  ఈ వరుస ఘటనలు జిల్లాలో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు తీరుకు అద్దం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top