ట్రాఫిక్‌ పోలీసుల దందా

Traffic Police Doing Bribery In Warangal - Sakshi

మామూళ్ల మత్తులో అధికారులు, సిబ్బంది

సాక్షి, వరంగల్‌ క్రైం: ట్రాఫిక్‌ విభాగంలోని కొందరు అధికారులు అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్‌ సిబ్బంది, అధికారులు నిర్వర్తించే విధులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వేతనంతో పాటు 30 శాతం అలవెన్స్‌ అందిస్తోంది. అయితే, ఇది చాలదన్నట్లు కొందరు అధికారులు, సిబ్బంది అక్రమ సంపాదనపై దృష్టి సారించారు. డీజీపీగా ఎం.మహేందర్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టాక గతంలో పోలీసు స్టేషన్లకు ఆనవాయితీగా వచ్చే మాముళ్లను బంద్‌ చేయాలని పదేపదే హెచ్చరించారు.

ఆ మాటలను కొంత కాలం పాటించిన అధికారులు ఆ తర్వాత తమ పాత పద్ధతినే కొన సాగిస్తున్నారు. పోలీసు విభాగంలో లూప్‌లైన్‌గా భావించే ట్రాఫిక్‌ విభాగాన్ని కొందరు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. పనిచేసిన సమయంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న భావనతో ఎక్కడ కూడా బయట పడకుండా ఎవరి స్థాయిలో వారు జాగ్రత్తలు తీసుకుంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇలా అందుకునే మామూళ్లను పరిశీలిస్తే వేతనం కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. 

ఆదాయ మార్గాలపై దృష్టి
వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మూడు ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. అయా స్టేషన్ల పరిధిలో అధికారులు ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి సారించారు. ట్రాక్టర్లు, టిప్పర్లు, రెడీమిక్స్‌ వాహనాలు, ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలతో పాటు బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నుంచి ప్రధాన ఆదాయం వస్తుందని గుర్తించి ఎవరికి వారు వాటాలు పంచుకుంటున్నారు. సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నగర రహదారులపైకి భారీ వాహనాలు రావడానికి అనుమతి ఉండదు.

కానీ, రెడీమిక్స్‌ వాహనాలు, ట్రాక్టర్లు, టిప్పర్లే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి సామగ్రి తీసుకొచ్చే వాహనాల వారు సమయపాలన పాటిస్తే పని కాదు. దీనిని ఆసరాగా చేసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు వాహనానికి ఇంత చొప్పున ధర నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి నుంచి మిగతా అందరు కూడా వ్యవహారాలు చక్కబెట్టుకున్నారు. ప్రతీ స్టేషన్‌ నుంచి ఒకరిద్దరిని వసూళ్లకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. మిగతా ఎవరు కూడా తెరపైకి రాకుండా ఈ ఇన్‌చార్జిలే నెలనెలా వసూలు చేసి ఎవరి వాటాను వారికి పంచి ఇస్తుంటారని తెలుస్తోంది. ట్రాన్స్‌పోర్ట్, రెడీమిక్స్‌ ప్లాంట్ల యాజమాన్యాల నుంచి మూడు స్టేషన్ల అధికారులకు ప్రతి నెల మొదటి వారంలో డబ్బు అందుతున్నట్లు సమాచారం.

ఎలా ఉన్నా ఓకే...
ట్రాఫిక్‌ పోలీసులకు మామూళ్లు అందితే చాలు.. ఆయా వాహనాలు 24 గంటల పాటు ఎక్కడ తిరిగినా అడ్డుకోవడం లేదని సమాచారం. ఆ వాహనాలు కనిపిస్తే చాలు పత్రాలు కానీ. లైసెన్స్‌ కానీ అడగకుండా వదిలేస్తున్నారు. ఎవరైనా వాహనాన్ని ఆపితే చాలు క్షణాల్లో ‘సార్‌.. ఆ బండ్లు మనవే’ అంటూ ఫోన్‌ రావడం.. వాహనాన్ని వదిలివేయడం సర్వసాధారణమైపోయింది. దీనికి తోడు సిమెంట్‌ ఇటుకల తయారీ యాజమానులు సైతం పెద్ద మొత్తంలో ట్రాఫిక్‌ అధికారులకు మామూళ్లు సమార్పించుకుంటున్నట్లు సమాచారం.

ఒక్కో పోలీసు స్టేషన్‌ పరిధిలో ఏ అడ్డా నుంచి ఎంత వసూలు చేస్తున్నారు.. ఎంత మొత్తం వసూలవుతోంది.. అందులో ఎవరి వాటా ఎంత.. నెలలో ఎవరు, ఎప్పుడు, ఏ తేదీల్లో మామూలు ఇస్తారనే లెక్కలు ట్రాఫిక్‌ విభాగంలోని అందరి నాలికపైనే ఉంటుందని చెబుతారు. అలాగే, అధికారులు వసూళ్లకు హోంగార్డులు, గన్‌మెన్‌లను వాడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇటీవల ఓ పోలీసు స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు వసూళ్ల విషయంలో గొడవ పడడం విదితమే.

వెళ్తూ.. వెళ్తూ...
నగరంలోని ట్రాఫిక్‌ విభాగం పనిచేసిన సమ యంలో నీతి, నిజాయితీకి మారుపేరని చెప్పు కున్న ఓ అధికారి బదిలీ అయిన సందర్భంలో మాత్రం తన అసలు నైజం బయటపెట్టు కున్నారనే ప్రచారం సాగుతోంది. తాను పనిచేసిన కాలానికి ఎంత మొత్తం రావాలో లెక్కేసుకున్న ఆయన ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ద్వారా వసూలు చేసుకుని వెళ్లినట్లు సమాచారం. ఒక్క ట్రాన్స్‌ఫోర్ట్‌ విభాగం నుంచే సుమా రు రూ.లక్షకు పైగా తీసుకున్నాడని, నక్కల గుట్టలోని రెండు షాపుల నుంచి ఏసీ, సోపాలు పట్టుకెళ్లారని తెలిసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top