నేరవేరని లక్ష్యం..!

Toilets Constructions Delayed - Sakshi

జిల్లాలో స్వచ్ఛభారత్‌ అంతంతే...  

మార్చి 31నాటికి పూర్తికాని మరుగుదొడ్లు

మూడు గ్రామపంచాయతీలే ఓడీఎఫ్‌  

ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిర్మాణ పనులు

బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వాలు ఆర్భాటం చేస్తున్నాయి. కానీ అమలులో చిత్తశుద్ధి కనిపించడం లేదు. నిర్మాణాలు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. గత మార్చి 31 వరకు సుమారు 50 శాతం కూడా పూర్తి చేయలేదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.     

పాల్వంచరూరల్‌:  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. జిల్లాలోని 23 మండలాల్లో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద మొత్తం 81,172 వేల మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 19,006 మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. వివిధ దశల్లో 49వేల682 మరుగుదొడ్లు ఉన్నాయి. ఇంకా 12వేల484 మరుగుదొడ్ల నిర్మాణపనులు ప్రారంభించలేదు. మార్చి 31 నాటికి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా లక్ష్యాన్ని సాధించలేకపోయారు. లబ్ధిదారులకు పూర్తిస్ధాయిలో అవగాహన కల్పించకపోవడంతో నిర్దేశితి గడువులో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  జిల్లావ్యాప్తంగా మూడు గ్రామాలనే ఓడీఎఫ్‌(బహిరంగ మల, మూత విసర్జన రహిత ప్రాంతం)గా మార్చారు. 

రూ. 12 వేలు సరిపోవడంలేదు  
స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద మంజూరైన మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేల చొప్పున మంజూరు చేసింది. పెరిగిన ధరల నేపథ్యంలో ఆ మొత్తం సరిపోవడంలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. సిమెంట్, ఇటుకలు, మేస్త్రీ కూలీ ధరలు విపరీతంగా పెరిగాయని, దీంతో ప్రభుత్వం ఇస్తున్న రూ.12వేల సరిపోవడం లేదని చెబుతుఆన్నరు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని మరుగుదొడ్లు నిధుల వ్యయాన్ని పెంచాలని కోరుతున్నారు.

జూన్‌లోగా పూర్తిచేయాలి  
జిల్లాలో స్వచ్ఛభారత్‌ మిషన్‌కింద మొత్తం81,172  వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో  19,006 మరుగుదొడ్లు మార్చి నాటికి పూర్తయ్యాయి. మార్చి 31నాటికి పూర్తికాని మరుగుదొడ్లను జూన్‌నాటికి పూర్తి చేయాలి. లక్ష్యసాధనకోసం చర్యలు తీసుకుంటున్నాం. మరుగుదొడ్ల నిర్మాణంలో అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. లబ్దిదారులు నిర్మాణంలో తీవ్రజాప్యం చేయడంతో జిల్లాలో మూడు గ్రామపంచాయతీలు మాత్రమే ఓడీఎఫ్‌గా ప్రకటించాం. ఏప్రిల్‌ నెలాఖరుకు వంద గ్రామాలను ఓడీఎఫ్‌గా మార్చుతాం.      –విజయచంద్ర, ఏపీడీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top