
సాక్షి, హైదరాబాద్: తెలుగు నిర్మాతల మండలి ఎన్నిక తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 2019–21 సంవత్సరానికి తెలుగు నిర్మాతల మండలికి జరుగుతున్న ఎన్నికల్లో కోశాధికారి పోస్టుకు తాను దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ యలమంచిలి రవిచంద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జె.విజయలక్ష్మి వాదనలు వినిపిస్తూ చదలవాడ శ్రీనివాసరావును ఏకగ్రీవం చేసేందుకే పిటిషనర్ నామినేషన్‌ను తిరస్కరించారని తెలిపారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. కోశాధికారి పోస్టుకు పిటిషనర్ పేరును వైవీఎస్ చౌదరి ప్రతిపాదించారని, ఆ తరువాత ఆయనే నామినేషన్ దాఖలు చేయడంతో పిటిషనర్ నామినేషన్‌ను తిరస్కరించారని వివరించారు.
పిటిషనర్‌తోపాటు వైవీఎస్ చౌదరి, రామ సత్యనారాయణ, చదలవాడ శ్రీనివాసరావులు నామినేషన్‌లు దాఖలు చేశారని, పిటిషనర్ నామినేషన్ తిరస్కరణకు గురికాగా, వైవీఎస్ చౌదరి, రామ సత్యనారాయణ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, బరిలో శ్రీనివాసరావు ఒక్కరే మిగిలారన్నారు. ఆయన కోసమే ఇదంతా చేశారని వివరించారు. వైవీఎస్ చౌదరి ఉపాధ్య పదవికి పోటీ చేస్తున్నారని, ఈ కుట్ర కోణాన్ని పరిగణనలోకి తీసుకుని తన నామినేషన్‌ను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నెల 30న(నేడు) జరగనున్న నిర్మాతల మండలి ఎన్నిక ఈ వ్యాజ్యంలో కోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటుందని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.