
కార్మికుల వేతన పెంపుపై చర్చలు విఫలం
నిర్మాతల షరతులకు ఒప్పుకునేది లేదంటున్న కార్మికుల సంఘం
ఆందోళనలు ఉధృతం చేయనున్న కార్మికులు
సాక్షి, హైదరాబాద్: ఫిలిం ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ జరిపిన చర్చలు విఫలం అయిన నేపథ్యంలో సినీ కార్మికులు నేడు (ఆగస్టు 10) నిరసన కార్యక్రమం చేపట్టారురు. ఈ నిరసనలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొన్నారు. అన్నపూర్ణ 7 ఎకర్స్ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ.. మూడేండ్ల నుంచి జీతాలు పెంచలేదు. 30% వేతనాలు పెంచే వరకు బంద్ కొనసాగుతూనే ఉంటుంది.
ఎనిమిది రోజులుగా సమ్మె
పనిగంటలు, వేతనాలపై సమస్య పరిష్కరిస్తేనే షూటింగ్స్‌కు వస్తాం. కార్మికుల వేతనాల పెంపు గురించి గత ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నాం.. ఎవరయితే 30 శాతం వేతనాలు ఇస్తున్నారో వారికి పని చేస్తున్నాం. సినీ కార్మికులు పొట్ట కాలితే వాళ్ళే తిరిగి వస్తారు అని నిర్మాతలు అంటున్నారు. మేమేమి గెంతెమ్మ కొరికలు కొరలేదు. తొలుత 20% ఇవ్వండి.. రెండేళ్ల తరువాత 10% పెంచమని అడిగాము. వాళ్లు ఏడాదికో పర్సెంటేజ్ చెప్పారు. ఫైటర్స్, డాన్సర్స్, టెక్నిషియన్స్‌కు పెంచమన్నారు. కార్మికులందరికీ వేతనాలు పెంచాలి.
నిర్మాత క్షమాపణలు చెప్పాలని డిమాండ్
కార్మికులను తక్కువ చేసి మాట్లాడుతున్న నిర్మాత విశ్వప్రసాద్ ఫిలిం ఫెడరేషన్‌కు రూ.90 లక్షలు బాకీ ఉన్నారు. ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని మా కార్మికులు గట్టిగా కోరుకుంటున్నారు. వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఛాంబర్‌కు చెప్పాలి తప్ప ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఫిలిం ఛాంబర్ న్యాయం చేయకపోతే సినీ పెద్దలను, ప్రభుత్వాన్ని కలుస్తాం. మొత్తం 24 వేల మంది కార్మికులు ఉన్నాం. త్వరలో మా సమస్య సాల్వ్ కాకుంటే కార్మికులతో కలిసి ఛాంబర్‌నే ముట్టడిస్తాం. అవసరమయితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అన్నారు.
బయనుంచి రానివ్వం
ఫిలిం ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అమ్మిరాజు మాట్లాడుతూ.. మాకు నచ్చిన వారిని తీసుకుంటామని నిర్మాతలు అంటున్నారు. అలాగే ఒకరిద్దరు నిర్మాతలు స్కిల్స్ లేవని అవమానిస్తున్నారు. బయట రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా రానివ్వము. 30% వేతనాల పెంపుపై ప్రభుత్వం, సినిమాటోగ్రఫీ మినిస్టర్ సానుకూలంగా స్పందించారు. చిరంజీవిగారు ఈ సమస్య పరిష్కారమవుతుందనుకున్నారు. ఏదైనా హెచ్చుతగ్గులుంటే ఫిలిం ఛాంబర్ వారు మాతో మాడ్లాడండి. ఈరోజే సమస్య సమసిపోతుంది అన్నారు.
అందుకే ఆ నిర్మాతపై ఆగ్రహం?
నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో మంత్రి కోమటి రెడ్డి సోమవారం చర్చలు జరపనున్నారు. కాగా పీపుల్స్ మీడియా అధినేత విశ్వ ప్రసాద్ సిటీ సివిల్ కోర్టులో యూనియన్‌పై కేసు వేశారు. ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు బాసాటి వెంకటకృష్ణకు లీగల్ నోటీసు పంపారు. ఈ వ్యవహారంపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేతనాల పెంపుపై చర్చలు విఫలం
తెలుగు సినీ కార్మికుల వేతనాల పెంపు విషయమై కార్మికుల సంఘం – నిర్మాతల మండలి మధ్య జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగడం లేదు. శనివారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ చాంబర్‌లో నిర్మాతల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం సినీ కార్మికుల వేతనాల పెంపుపై తమ నిర్ణయాలను నిర్మాతలు వెల్లడించారు. మూడు విడతలుగా కార్మికుల వేతన పెంపును అమలు చేయనున్నట్లుగా తెలిపారు.

జీతాన్ని బట్టి పెంపు
తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి దామోదరప్రసాద్ మాట్లాడుతూ– ‘‘రోజుకి రూ. 2000 లేదా అంతకన్నా తక్కువ వేతనం తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంపు ఉంటుంది. రోజుకి రూ. 1000 రూపాయలు లేదా అంతకన్నా తక్కువ వేతనం తీసుకుంటున్న కార్మికులకు స్ట్రయిట్‌గా 20 శాతం పెంపుదల చేస్తాం. మళ్లీ మూడో ఏడాది 5 శాతం పెంపుదల ఉంటుంది. మేము ఇప్పటికే కార్మికుల సంఘం ముందు ఉంచిన నాలుగు ప్రతిపాదనలను వారు అంగీకరిస్తేనే ఇవి అమలు అవుతాయి. అలాగే చిన్న బడ్జెట్ సినిమాలకు పాత వేతనాలనే చెల్లిస్తాం. అయితే చిన్న సినిమా బడ్జెట్ పరిమితి... తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. ఇప్పటికే రోజుకి రూ. 4 వేలు, రూ. 5 వేలు తీసుకుంటున్న కార్మికులకు వేతనాలు పెంచమనడం సరైంది కాదు’’ అని పేర్కొన్నారు.
వారి ప్రతిపాదనలు ఒప్పుకోలేదు
కార్మికుల సంఘం అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. ‘‘మా చర్చలు విఫలమైనట్లుగా మేం భావిస్తున్నాం. చర్చలంటూ పిలిచారు. పర్సెంటేజ్ విధానం చెప్పారు. కానీ అందరికీ ఇస్తే అంగీకరిస్తాం అని చెప్పాం. అయితే ఫెడరేషన్‌ను విభజించాలనుకున్నట్లుగా పర్సెంటేజ్‌లను క్రియేట్ చేశారు. అది మేం అస్సలు ఒప్పుకోలేదు. 30 శాతం పెంపుదల విభజన (ఒక్కో ఏడాది కొంచెం కొంచెంగా)కు మేం సిద్ధం. కానీ వాళ్లు ఫెడరేషన్‌లోని కొన్ని యూనియన్లకు పెంచుతామని, మరికొన్ని యూనియన్లకు పెంచమని చెప్పారు. ఇందుకు ఒప్పుకునేది లేదు.

అందరికీ సమానంగా పెంచాలి
రోజువారీ వేతనాలు తీసుకునే యూనియన్స్ 13 ఉన్నాయి. అందరికీ సమానంగా పెంచాలని చెప్పాం. తక్కువ, ఎక్కువలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడదామన్నాం. కానీ వాళ్ళు ఒక ఫిగర్ చెప్పుకుండానే వెళ్లిపోయారు. అక్కడ జరిగింది వేరు... బయటికి వచ్చి మాట్లాడింది వేరు. ఫైటర్స్, డ్యాన్సర్స్, టెక్నిషియన్స్.. ముఖ్యంగా కెమెరా టెక్నిషియన్స్ గురించి మాట్లాడలేదు. మేం 24 యూనియన్స్ ఉన్నాం. యూనియన్లను విడగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు’’ అని అనిల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జరిగిన చర్చలు సానుకూలంగా లేకపోవడంతో ఆదివారం నుంచి తమ నిరసనలను తీవ్రతరం చేస్తామని కార్మికుల సంఘం నాయకులు అంటున్నారు.