‘కడెం’కు పొంచి ఉన్న ముప్పు!

Threat posed to the Kadem project - Sakshi

విరిగిపడ్డ 2వ నంబర్‌ వరద గేటు భారీ దిమ్మె 

ఇన్‌ఫ్లో లేకుంటే ప్రాజెక్టు ఖాళీ అయ్యే పరిస్థితి? 

మరమ్మతులు చేపట్టని అధికారులు

కడెం (ఖానాపూర్‌): నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు 2వ నంబర్‌ వరద గేటుకు అనుసంధానంగా ఉండే భారీ దిమ్మె (కౌంటర్‌ వెయిట్‌) గురువారం రాత్రి విరిగిపోయింది. దీంతో వరద గేటు మూసివేసే అవకాశం లేనందున నీరు వృథాగా వెళ్లిపోతోంది. శుక్రవారం సాయంత్రం వరకు సుమారు ఐదు వేల క్యూసెక్కుల వరకు నీరు బయటకు పోయినట్లు సమాచారం. అయితే దీనికి వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇన్‌ఫ్లో వస్తే వరద గేటు ద్వారా నీళ్లు పోయినా ప్రాజెక్టులో నీటి మట్టం ఉంటుంది, కానీ వర్షాలు తగ్గుముఖం పట్టి ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గితే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 693.626 అడుగుల నీటిమట్టం ఉంచుతున్నారు.

ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో రాకుంటే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గురువారం సాయంత్రం 14 వరద గేట్లు ఎత్తి నీటిని వదలగా, మరో నాలుగు వరద గేట్లు ఎత్తేందుకు ప్రయత్నించారు. కానీ అవి మొరాయించడంతో అధికారులు హైరానా పడ్డారు. అదే సమయంలో ఇన్‌ఫ్లో కొంత తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో 2వ నంబర్‌ వరద గేటుకు అనుసంధానంగా ఉండే కౌంటర్‌ వెయిట్‌ విరిగిపోవడంతో గేటు కిందకు ఒరిగిపోయి, తెరవడానికి వీలు లేకుండా పోయింది. కాగా గతంలో 1995లో ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోయిన ఘటనను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు ఇలాగే భారీ వర్షాలతో ప్రాజెక్టు నీటిమట్టాని కంటే ఎక్కువగా వరద రావడంతో ఆనకట్ట తెగిపోయింది. ముంపు గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. కడెం ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం వల్ల అలాంటి ఘటన మళ్లీ పునరావృతం అవుతుందేమోనని   ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

ఒకట్రెండు రోజుల్లో మరమ్మతులు: జేఈ  
ఈ విషయమై ప్రాజెక్టు జేఈ శ్రీనాథ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇన్‌ఫ్లో తగ్గిన తర్వాత ఒకట్రెండు రోజు ల్లో గేటు మరమ్మతులు చేపడుతామన్నారు. హైద రాబాద్‌ నుంచి భారీ క్రేన్లను తీసుకొని ఇంజనీర్లు శనివారం ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. గేటు నుంచి నీరు వెళ్లిపోకుండా మరమ్మతులు చేపడుతామన్నారు. కౌంటర్‌ వెయిట్‌ ఇప్పుడు అమర్చే అవకాశం లేదని, నీటిమట్టం పూర్తిగా తగ్గిన తర్వాత కొత్తది ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు 2వ నంబర్‌ వరద గేటును తెరవడం వీలుకాదని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top