
ఎన్నికల విజయవంతంపై ‘ఈసీఐఎల్’ హర్షం
దేశవ్యాప్తంగా తొమ్మిది విడతల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు విజయవంతం కావడంపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
- ‘సక్సెస్ స్టోరీ’ పేరిట ప్రకటన విడుదల చేసిన యాజమాన్యం
కుషాయిగూడ, న్యూస్‌లైన్: దేశవ్యాప్తంగా తొమ్మిది విడతల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు విజయవంతం కావడంపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ పి.సుధాకర్ తమ సిబ్బందిని అభినందిస్తూ, తాము సాధించిన విజయాన్ని వివరిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈవీఎంల తయారీ, రవాణా, పనితీరు తదితర అంశాలతో కూడిన ఫొటోలను కూడా జతపరచి, అణు ఇంధన శాఖకు చెందిన వివిధ సంస్థలతో పాటు నగరంలోని పలు ప్రభుత్వ సంస్థలకు, మీడియాకు ప్రకటన ప్రతులను పంపించారు.
980 నుంచి మొదలైన ఈవీఎం ప్రస్థానం
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణను పారదర్శకంగా చేపట్టడంలో ఈసీఐఎల్ సంస్థ పాత్ర ఎనలేనిది. ఈవీఎంల తయారీలో బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) కూడా పోటీ పడుతున్నా, సింహభాగం ఈసీఐఎల్‌దే. ఈ రెండు సంస్థలు తయారు చేసిన ఈవీఎంలను మూడో పార్టీ (థర్డ్‌పార్టీ)గా వాటి పనితీరును పరిశీలించి సర్టిఫై చేసే సంస్థ ‘ఈటీడీసీ’ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసేదే.
భారత ముఖ్య ఎన్నికల అధికారి కోరిక మేరకు 1980లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) పనితీరును వివరించిన నాటి నుంచి నేటి వరకు ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో తనవంతు సేవలనందిస్తున్న ఈసీఐఎల్.. ఇప్పటి వరకు దాదాపు నాలుగు లక్షల ఈవీఎంలను రూపొందించింది. మళ్లీ మళ్లీ ఉపయోగించుకునే వీలున్న ఈవీఎంల తయారీతో ప్రతి ఎన్నికల్లోనూ బ్యాలెట్ పేపర్ల తయారీకి అయ్యే ఖర్చును తగ్గించడమే కాకుండా, పేపర్ వినియోగం లేకుండా చేయడంతో పర్యావరణానికి కూడా మేలు చేసినట్లయింది.
ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా ‘నోటా’ పేరిట ‘పై అభ్యర్థులు ఎవరూ కాదు’ అనే ఆప్షన్‌ను కూడా అమర్చడం జరిగింది. భూటాన్, నేపాల్ వంటి దేశాలకు కూడా ఈవీఎంలను తయారు చేసి ఎగుమతి చేసిన ఈసీఐఎల్, యూరప్‌లోని కొన్ని దేశాలకు ఈవీఎంలను ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తుండటం కొసమెరుపు.