అంపశయ్యపై ఆశలదీపం | The dark - impacts their residence | Sakshi
Sakshi News home page

అంపశయ్యపై ఆశలదీపం

Jun 26 2014 3:29 AM | Updated on Sep 2 2017 9:23 AM

అదో చిన్న ఇల్లు. సంతోషాల పొదరిల్లు. నిరుపేద కుటుంబం. ఇద్దరు కుమారులు.. భార్యాపిల్లలతో నిత్యం సందడి. ఉన్నంతలో కుటుంబానికి ఏ లోటూ రానీయలేదు కత్తెరమల్ల కృష్ణ.

అదో చిన్న ఇల్లు. సంతోషాల పొదరిల్లు. నిరుపేద కుటుంబం. ఇద్దరు కుమారులు.. భార్యాపిల్లలతో నిత్యం సందడి. ఉన్నంతలో కుటుంబానికి ఏ లోటూ రానీయలేదు కత్తెరమల్ల కృష్ణ. ఇంటిపట్టునే ఉంటూ పిల్లలను సాకేది భార్య సంధ్యారాణి. కుమారుల్లో మొదటివాడు సుజిత్. చదువంటే అమితాసక్తి. దీన్ని గమనించిన కృష్ణ.. కుమారుణ్ని ప్రోత్సహించాడు. తనకు కష్టమైనా చదివించాడు. ఆయన నమ్మకాన్ని నిలబె ట్టాడు సుజిత్. తండ్రి కి భారం తగ్గించాలనుకున్నాడు. ఉద్యోగం కూడా వచ్చింది. కానీ ఇంతలోనే పెద్ద కుదుపు. అనారోగ్యం ఆయన్ను ఆస్పత్రికి చేర్చింది. కుటుంబాన్ని అప్పుల పాల్జేసింది. తండ్రి ఆశ లను పరిహాసం చేస్తోంది. కుమారుడి ఆశయాన్ని పరీక్షిస్తోంది. కాఠిన్యులనూ కదిలించే దీనగాథ ఇది...
 
 జమ్మికుంట టౌన్ :  జమ్మికుంటలోని సీఎస్సై చర్చి సమీపంలో కృష్ణ-సంధ్యారాణి దంపతుల నివాసం. కృష్ణ స్థానిక పాల డెయిరీలో వాచ్‌మన్. ఈయన అరకొర సంపాదనే కుటుంబానికి దిక్కు. అయినా సుజిత్ చదువుకు తోడ్పడ్డాడు. ఈయన శ్రమ వృథాపోలేదు. ఎస్సెస్సీలో సుజిత్ 560 మార్కులతో డివిజన్‌స్థాయిలో సత్తాచాటాడు. తర్వాత ఈస్ట్ మారెడుపల్లిలో పాల్‌టెక్నిక్‌లో చేరాడు. ఫైనలియర్‌లో ఉండగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్ట్ అయ్యాడు సుజిత్. తండ్రికి ఇక కష్టపడే ఓపిక లేదు. ఈ సమయంలో బెంగ ళూర్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. వేతనం సుమారు రూ. 30వేలు. కుటుంబంలో పట్టలేని సంతోషం. ఓ రోజు హఠాత్తుగా సుజిత్‌కు గుండెపోటు వచ్చింది. చికిత్స కోసం రూ. 4 లక్షలు ఖర్చయ్యాయి. గండం గ ట్టెక్కేందుకు అప్పుసొప్పు చేశాడు కృష్ణ. రెండు నెలలైనా కాలేదు. సుజిత్ శరీరంలో వైట్ జాండిస్ సోకింది. రక్తం గడ్డ కట్టుకుపోవడం మొదలైంది. మూత్రపిండాలు, కాలేయం క్రమంగా చెడిపోతూవచ్చాయి. 22 ఏళ్ల చిన్న వయస్సులో బిడ్డను పీడిస్తున్న వ్యాధులకు తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. కుటుంబానికి ఆసరా అవుదామనుకుంటే భారంగా మారుతున్నానంటూ కుంగిపోతున్నాడు సుజిత్. ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులే సపర్యలు చేస్తున్నారు. సుజిత్ వ్యాధి నయం కావాలంటే రూ. 10 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తేల్చారు. ఇప్పటికే అప్పుల పాలైన కుటుంబం.. రూపాయి చేతిలో లేదు. ఇంతటి కటిక దారిద్య్రంలోనూ ఆ కుటుంబానికో ఆశ. తమ ఇంటి వెలుగును ఈ సమాజం ఆరిపోనియదని ధీమా. దయార్థులు చేయూత ఇస్తారన్న విశ్వాసం. మానవతావాదులు ముందుకొస్తే ఓ ప్రతిభావంతుడికి మరో జీవితాన్ని ప్రసాదించివారవుతారు. అలా జరగాలని ఆశిద్దాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement