‘పది’ జవాబు పత్రాలు గల్లంతు

Tenth answer papers go missing with the negligence of postal department officials - Sakshi

తపాలా శాఖ అధికారుల అజాగ్రత్త

స్టేషన్‌కు తరలిస్తుండగా మిస్సింగ్‌.. రెండు రోజుల తర్వాత లభ్యం 

కాగజ్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

కాగజ్‌నగర్‌: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల గల్లంతయిన ఘటన కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో కలకలం సృష్టించింది. తపాలా శాఖ అధికారుల నిర్లక్ష్యంతో జవాబు పత్రాలు గల్లంతు కాగా రెండు రోజుల అనంతరం దొరికాయి. ఈ మేరకు బుధవారం కాగజ్‌నగర్‌ డీఎస్పీ సాంబయ్య వివరాలు వెల్లడించారు. ఈ నెల 10న కాగజ్‌నగర్‌ పట్టణంలోని మూడు కేంద్రాల్లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు 65 మంది విద్యార్థులు తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలు రాయగా వాటికి సంబంధించిన జవాబు పత్రాలను అదే రోజు సాయంత్రం పట్టణంలోని తపాలా కార్యాలయానికి తరలించారు.

పోస్టల్‌ అధికారులు ఒక బ్యాగులో జవాబు పత్రాలను భద్రపరిచి రైలు ద్వారా మంచిర్యాల సార్టింగ్‌ కేంద్రానికి తరలించడానికి ప్రయత్నించారు. జవాబు పత్రాల బ్యాగుతోపాటు మొత్తం 13 బ్యాగులు ఆటోలో రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు. గ్రాండ్‌ట్రంక్‌ (జీటీ) ఎక్స్‌ప్రెస్‌లో మంచిర్యాలకు తరలించడానికి ఆర్‌ఎంఎస్‌ (రైల్వే మెయిన్‌ సర్వీసెస్‌) బోగీలో ఎక్కిస్తుండగా అందులో ఒక బ్యాగు లేనట్లు గుర్తించారు. వెంటనే చుట్టుపక్కల ప్రాంతంలో గాలించారు. అయినా ఎంతకూ దొరక్కపోవడంతో ఈ నెల 11న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆటోలో నుంచి జారిపడటంతో..
విచారణ చేపట్టిన పోలీసులు బ్యాగులు తరలించిన రోజు ఈదురుగాలులతో కూడిన వర్షం ఉండటంతో ఆటో నుంచి జవాబు పత్రాలు కింద పడినట్లు తేల్చారు. ఆ బ్యాగు గుర్తుతెలియని మహిళకు దొరకడంతో ఆమె ఓ రైల్వే ఉద్యోగి ఇంట్లో అప్పగించింది. రైల్వే ఉద్యోగి విధు లు ముగించుకుని బుధవారం ఇంటికి రావడంతో అతని కంట పడింది. పట్టణ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. డీఈవో భిక్షపతి సమక్షంలో పరీక్ష కేంద్రాల సూపరింటెం డెట్లు శంకరయ్య, హన్మంతు, వరలక్ష్మి బ్యాగును పరిశీలించారు. తాము వేసిన సీలులో ఏ తేడా లేదని తేలడంతో జిల్లా అధికారికి అప్పగించారు. పోస్టల్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జవాబు పత్రాలు గల్లంతైన ట్లు విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top