సరిహద్దుల్లో టెన్షన్‌ !      | Tension On The Border! | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో టెన్షన్‌ !     

Aug 2 2018 11:13 AM | Updated on Oct 9 2018 2:47 PM

Tension On The Border! - Sakshi

మావోయిస్టులు ఇటీవల నిర్వహించిన సభకు హాజరైన ఆదివాసీలు

సాక్షి, కొత్తగూడెం: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా గత 5నెలల కాలం లో మరింతగా కోలుకోలేని దెబ్బ తగిలింది. గత మార్చి 2న సరిహద్దులోని బీజాపూర్‌ జిల్లా తడపలగుట్టల్లో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌ మొదలు ఇప్పటివరకు సరిహద్దు జిల్లాల్లో జరిగిన వరుస ఘటనల్లో సుమారు 70 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.

వారి దాడుల్లో 30 మందికి పైగా హతమయ్యారు. ఇందులో భద్రతా సిబ్బం దితో పాటు కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇన్‌ఫార్మర్లు ఉన్నారు. మావోలకు, భద్రతా బలగాలకు మధ్య ఎడతెరిపి లేని పోరు నడుస్తుండడంతో ఏజెన్సీ ప్రాంతాలు తుపాకుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఇరువర్గాల మధ్య దాడు లు, ప్రతిదాడులతో దండకారణ్యం రక్తసిక్తంగా మారింది. గిరిజన పల్లెల్లో ఎప్పుడేం జరుగుతుం దో అనే టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

ఈ పరిస్థితుల్లో మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు వచ్చాయి. గత నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు ఈ వారోత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో సరిహద్దుల్లోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, మహబూబాబాద్, మహా రాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్, బస్తర్, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, విశాఖపట్నం, ఒడిశాలోని మల్కనగిరి, కోరాపుట్‌ జిల్లాల్లో 5 రాష్ట్రాల పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు.

వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు సరిహద్దుల్లోని చర్ల, వెంకటాపురం మండలాల్లో శబరి ఏరియా కమిటీ పేరుతో కరపత్రాలు విడుద ల చేస్తున్నారు. తాజాగా ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా ఇర్మానార్‌ అడవుల్లో మావోయిస్టులకు డిస్ట్రిక్ట్‌ రిజర్వు గార్డులు, ఎస్టీఎఫ్‌ బలగాలకు మధ్య సుమారు 20 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. 

ఉద్యమ చరిత్రలోనే భారీ నష్టం.. 

మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా పార్టీకి ఈ సీజన్‌లో కోలుకోలేని దెబ్బ తగిలింది. మార్చి 2న బీజాపూర్‌ జిల్లా తడపలగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10మంది మావోయిస్టులు మృతి చెందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భద్రతా బలగాలు, మావోయిస్టుల దాడులు, ప్రతిదాడులతో దండకారణ్యం రక్తసిక్తమైంది. గత ఏప్రిల్‌ నెల చివరి వారంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఏకంగా 40 మంది మావోయిస్టులు మృతి చెందారు.

తరువాత ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది, సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ నెల 24న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో చర్ల ఏరియా కమాండర్‌ అరుణ్‌ మృతి చెందాడు. తడపలగుట్ట ఎన్‌కౌంటర్‌ తరువాత ఇప్పటివరకు మావోయిస్టులు ప్రతీకారంగా భారీగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు, సీఆర్పీఎఫ్‌ జవాన్లు సహా ఇతరులను సుమారు 30 మందిని హతమార్చారు.  

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..   

అయితే మావోయిస్టులపై పోరును కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దండకారణ్యంలో మావోయిస్టులపై పోరాడేందుకు భారీగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలను దింపింది. బెటాలియన్లలోని జవాన్లు 90శాతం పైగా 30 ఏళ్లలోపు యువకులే. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంగా తెలుస్తోంది.

ఇందులో భాగంగా గత ఏప్రిల్‌ 14న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బీజాపూర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో పర్యటించారు. గ్రామస్వరాజ్‌ అభియాన్, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. మావోయిస్టులు జనతన సర్కార్‌ పేరుతో సమాంతర ప్రభుత్వం నడిపే దండకారణ్యంలో ప్రధాని పర్యటించడమే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది.  

సత్యనారాయణపురం వద్ద కల్వర్టు పేల్చివేత 

గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా గత మే నెల 4వ తేదీన ఏజెన్సీలో బంద్‌ నిర్వహించిన మావోయిస్టులు చర్ల మండలం సత్యనారాయణపురం–ఆర్‌ కొత్తగూడెం మధ్య కల్వర్టు పేల్చివేశారు. అక్కడికి అర కిలోమీటరు దూరం లో సీఆర్‌పీఎఫ్‌ 151 బెటాలియన్‌ క్యాంప్‌ ఉండగా కల్వర్టు పేల్చి మావోలు సవాల్‌ విసిరారు.  మే 11న చర్ల బస్టాండ్‌ వద్ద ప్రెషర్‌ బాంబు విడిచి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు బాంబును గుర్తించి చెరువులో నిర్వీర్యం చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement