తెలుగు వైభవాన్ని చాటేలా.. | Telugu mahaa sabhalu should be held as grandly says kcr | Sakshi
Sakshi News home page

తెలుగు వైభవాన్ని చాటేలా..

Nov 16 2017 3:17 AM | Updated on Aug 15 2018 9:40 PM

Telugu mahaa sabhalu should be held as grandly says kcr - Sakshi

ప్రగతి భవన్‌లో తెలుగు మహాసభలపై సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో రమణాచారి, నందిని సిధారెడ్డి, ఎస్‌పీ సింగ్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో తెలుగు భాష వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులకు సూచించారు. అందులో తెలుగు భాషా ప్రక్రియలన్నింటికి సంబంధించిన ప్రదర్శనలు జరగాలన్నారు. దేశ నలుమూలల నుంచే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు ఈ మహాసభల్లో పాల్గొంటారని.. వారికి అవసర మైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం సమీక్షించారు ‘‘పద్య సాహిత్యం, గద్య సాహిత్యం, అవధానం, జానపదం, సంకీర్తనా సాహిత్యం, కథాకథన రూపాలు తదితర అంశాల్లో ఉద్ధండులైన ఎంతో మంది తెలంగాణ బిడ్డలు తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి కృషి చేశారు. వారందరినీ స్మరించుకోవాలి. వారు తెలుగు భాష కోసం చేసిన కృషిని చాటి చెప్పాలి. తెలంగాణలో వెలుగొందిన భాషా ప్రక్రియలన్నింటినీ మరోసారి ప్రపంచానికి చూపాలి’’ అని పేర్కొన్నారు. వందల ఏళ్ల నుంచి తెలంగాణలో తెలుగు భాష వర్ధిల్లుతూ వస్తోందని.. అనేక మంది పండితులు, కవులు, రచయితలతోపాటు నిరక్షరాస్యులు కూడా బతుకమ్మలాంటి పాటల ద్వారా జానపద పరంపరను కొనసాగించారని పేర్కొన్నారు.

విస్తృతంగా ఏర్పాట్లు
మహాసభల సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని.. స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ సూచించారు. తెలుగు భాషలో పద్యాలు, పాటలు, వివిధ ప్రక్రియలకు సంబంధించిన ఆడియోలు ప్రతీ చోట వినిపించాలని... ప్రతీ ప్రక్రియ ప్రదర్శనకు వేర్వేరు వేదికలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎక్కడ ఏయే కార్యక్రమాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పారు. సాహి త్య అకాడమీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, సీఎస్‌ ఎస్పీ సింగ్, ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు, తెలుగు వర్సిటీ వీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

గొప్ప చరిత్రను ఘనంగా చాటాలి
తెలంగాణ గొప్ప చరిత్రను ఘనంగా చాటుకునేందుకు తెలుగు మహాసభలు ఉపయోగపడాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. మహాసభల సందర్భంగా తెలుగు భాషలోని అన్ని ప్రక్రియలకు సంబంధించి ప్రత్యేక వేదిక ద్వారా ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజు సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో తెలుగు సంఘాలున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలున్నారు. దేశ, విదేశాల్లో పరిపాలన, రాజకీయాలతో పాటు చాలా రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్న తెలుగువారు ఉన్నారు. వారందరినీ తెలంగాణలో జరిగే మహాసభలకు ఆహ్వానించాలి. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఆహ్వానించాలి. అమెరికాతో సహా తెలుగు వారు ఎక్కువగా ఉన్న దేశాల్లో.. ఏపీతో సహా తెలుగువారున్న రాష్ట్రాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించి ఆహ్వానించాలి..’’అని అధికారులకు సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement