త్వరలో ఇండియాకు.. ‘ఎడారిలో బందీ’

Telangana worker stranded in Saudi  video seeking help Goes Viral  - Sakshi

ఫలించిన కేటీఆర్‌ దౌత్యం

సౌదీలోని రియాద్‌లోవీరయ్య ఆచూకీ లభ్యం

రియాద్‌ ఎంబసీ టీమ్‌కుకృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: దేశం కాని దేశంలో ఒంటెల యజమాని వద్ద బందీగా దుర్భర జీవితం గడుపుతున్న కరీంనగర్‌ జిల్లా వాసి పాలేటి వీరయ్య స్వదేశం రావడానికి మార్గం సుగమమైంది. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం మక్తపల్లి గ్రామం నుంచి వీరయ్య ఉపాధి కోసం రెండేళ్ల క్రితం గల్ఫ్‌ వెళ్లాడు. రియాద్‌లోని ఎడారిలో ఒంటెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఒంటెల యజమాని పెట్టే బాధలను తాళలేక పోయాడు. ఎలాగోలా తాను పడుతున్న బాధలను సోషల్‌ మీడియా ద్వారా బహిర్గతం చేశాడు. ఈ మేరకు గురువారం ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన సంచికలో ‘ఎడారిలో బందీ’శీర్షికన వార్తా కథనం ప్రచురితమైంది.

వీరయ్య పడుతున్న బాధలను తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు తక్షణం స్పందించారు. వీరయ్య సమస్యను కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సుష్మాస్వరాజ్‌ సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు. వీరయ్య ఆచూకీ తెలుసుకొని ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ అరేబియా రియాద్‌లోని ఇండియన్‌ ఎంబసీ కార్యాలయం వేగంగా స్పందించింది. వీరయ్య ఎక్కడ ఉన్నాడో గంటల్లోనే పూర్తి సమాచారాన్ని సేకరించింది. రియాద్‌ ఎంబసీ కార్యాలయంలో హైదరాబాద్‌ వాసి ఉండటంతో వీరయ్య ఆచూకీ తెలుసుకోవడం సులభమైంది. ఈ మేరకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్‌ ద్వారా కేటీఆర్, ప్రశాంత్‌ పటేల్, దేశ్‌రాజ్‌కుమార్‌ తదితర 9 మందికి సమాధానం ఇస్తూ ట్వీట్‌ చేసింది. వీరయ్య ఇండియా వెళ్లడానికి ఎగ్జిట్‌ వీసా కూడా సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు.

వీరయ్య రాకపై కేటీఆర్‌ హర్షం 
సాక్షి, హైదరాబాద్‌: సౌదీ అరేబియాలో కష్టాలు పడుతున్న వీరయ్య సొంత ఇంటికి చేరుతుండటంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. వీరయ్య భారత్‌కు వచ్చేందుకు సహకరించిన రియాద్‌లోని భారత రాయబారి, నగరానికి చెందిన ఆసఫ్‌ సయీద్‌తోపాటు ఎంబసీ అధికారులకు ట్విట్టర్‌లో కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కాగా వీరయ్య కోసం ఆయన కుటుంబసభ్యులు బుధవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరి తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఇక సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని బృం దంలో ఒకరిగా తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న భారతరత్న అబ్దుల్‌ కలాం స్మారకాన్ని సందర్శించినట్లు కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top