రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సీఈవోపై వేటు | Sakshi
Sakshi News home page

రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సీఈవోపై వేటు

Published Mon, Mar 13 2017 3:40 AM

రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సీఈవోపై వేటు

అభియోగాలతో మాతృ సంస్థకు సరెండర్‌
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు పాలకవర్గం తొలి సమావేశం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో)పై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఈవో అసదుల్లాపై పలు అభియోగాలు మోపుతూ మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు సరెండర్‌చేస్తూ తీర్మానించింది. తాత్కాలిక సీఈఓగా జియావుద్దీన్‌ ఘారీని నియమించింది. బోర్డు నిర్ణయంపై డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ సీరియస్‌ అయ్యారు. ప్రభుత్వ పరిధిలోని సీఈవో అంశంపై నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.

ఎజెండాలో లేకుండానే..: వక్ఫ్‌ బోర్డు పాలకవర్గం సరిగ్గా పక్షం రోజుల క్రితం కొలువు తీరింది. బోర్డు ఇన్‌చార్జిగా వ్యవహరించిన కాంపిటెంట్‌ అథారిటీకీ గల అధికారాలను ఉపసంహరించి చైర్మన్‌కు అప్పగించే ఎజెండాతో పాలకవర్గం తొలిసారిగా సమావేశమైంది. సమావేశం ప్రార ంభం కాగానే అధికారులు నేరుగా బోర్డు సీఈవో అసదుల్లాపై దర్గా షరీఫ్‌ హుండీ వేలం, ఇన్‌చార్జి ముతవల్లీలు, సిబ్బంది నియామకం తదితర అభియోగాలు మోపుతూ సస్పెన్షన్‌ చేయడంతో పాటు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలనే ప్రతిపాదన ప్రవేశపెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఓ సభ్యుడు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోగా... మరొక సభ్యుడు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొంత వెనక్కి తగ్గి సీఈవోను మాతృ సంస్థకు సరెండర్‌ చేయాలని తీర్మానించారు.

Advertisement
Advertisement