మూడు రోజుల్లో టెన్త్‌ మెమోలు

Telangana SSC results 2020 Student Grade Memos Ready On Three Days - Sakshi

ప్రధానోపాధ్యాయుల సంతకాలతో అందజేత

పొరపాట్లు ఉంటే హెచ్‌ఎం ద్వారా సవరణకు అవకాశం

కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థుల్లోనే ఎక్కువ మందికి 10/10 జీపీఏ

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన పాస్‌ మెమోలను 3 రోజుల్లో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇంటర్నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. వాటిని ఆ తర్వాత ప్రధానోపాధ్యాయులు తమ సంతకం చేసి విద్యార్థులకు అందజేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మెమోలతో విద్యార్థులు కాలేజీల్లో చేరొచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొంది. ఇక పూర్తి స్థాయి మెమోలను మరో నెల రోజుల్లో పంపించనున్నట్లు వెల్లడించింది. పదో తరగతి విద్యార్థుల గ్రేడ్‌లు, గ్రేడ్‌ పాయింట్స్, గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌తో (జీపీఏ) కూడిన ఫలితాలను సోమవారం ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు.

విద్యార్థులకు అందజేసే పాస్‌ మెమోల్లోని వివరాల్లో పొరపాట్లు తలెత్తితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ద్వారా తెలపాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు పొరపాట్ల వివరాలను ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పంపించి సవరించేలా చర్యలు చేపడతారని వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అందరిని పాస్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ పరీక్షలు రాసేందుకు నమోదు చేసుకున్న 5,34,909 మంది విద్యార్థులను పాస్‌ చేసి, వారి ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్, గ్రేడ్‌ పాయింట్, జీపీఏను కేటాయించినట్లు వెల్లడించారు. విద్యార్థుల జీపీఏ వివరాలతో కూడిన ఫలితాలను వెబ్‌సైట్‌లో www.bse. telangana.gov.in ఉంచినట్లు వివరించారు.

1.4 లక్షల మందికి 10/10 జీపీఏ..
పదో తరగతి పరీక్షల ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా 1.4 లక్షల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది. సాధారణంగా పరీక్షలు నిర్వహించినప్పుడు 10/10 జీపీఏ రాష్ట్రవ్యాప్తంగా 2,500 మందికి మించి ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఇంటర్నల్‌ 20 మార్కుల్లో విద్యార్థులకు వచ్చిన మార్కుల (ఐదింతలు చేసి) ఆధారంగా జీపీఏ నిర్ణయించడంతో ఎక్కువ మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చింది. పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన 5,34,909 మంది విద్యార్థుల్లో దాదాపు 3.74 లక్షల మంది కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉన్నారు.

వారిలో ఎక్కువ మందికి పాఠశాలల్లో ఇంటర్నల్‌ మార్కులు 20కి 20 మార్కులు వేసినట్లు సమాచారం. ఇప్పుడు 10/10 జీపీఏ వచ్చిన 1.4 లక్షల మందిలో 98 శాతం మంది కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులే ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇంటర్నల్స్‌లో ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులే వేయడంతో ఈ పాఠశాలల విద్యార్థుల్లో తక్కువ మందికి 10/10 జీపీఏ వచ్చినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో అధికంగా..
జిల్లాల్లో డీఈవోలు వేసిన లెక్కల ప్రకారం కరీంనగర్‌ జిల్లాలో 6,446 మందికి 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది. అలాగే నల్లగొండలో 6,642 మందికి, సిద్దిపేటలో 4,664 మందికి, వరంగల్‌లో 6,614 మందికి, హైదరాబాద్‌లో దాదాపు 10 వేల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు సమాచారం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top