పనికి చివరి రోజు!

Telangana Secretariat Is Full Busy With Last Working Day - Sakshi

సందర్శకులతో కిటకిటలాడిన సచివాలయం 

పెండింగ్‌ ఫైళ్ల పరిష్కారానికి చివరి ప్రయత్నాలు 

తరలివచ్చిన ఎమ్మెల్యేలు, నేతలు, కాంట్రాక్టర్లు 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీని రద్దు చేయనుందన్న ఊహాగానాల నేపథ్యంలో పెండింగ్‌ పనుల పూర్తికి ‘చివరి రోజు’గా భావించి పెద్ద సంఖ్యలో సందర్శకులు బుధవారం రాష్ట్ర సచివాలయానికి తరలివచ్చారు. పెండింగ్‌ ఫైళ్ల పరష్కారానికి ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు, జిల్లా అధికారులు, ప్రైవేటు వ్యక్తులు పెద్ద సంఖ్యలో సంబందిత ప్రభుత్వ శాఖల కార్యదర్శులను కలిశారు. కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో పాటు సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులను కలసి తమ పెండింగ్‌ పనులను చేయించుకున్నారు. వాస్తు దోషం కారణం గా సీఎం కేసీఆర్‌ గత మూడేళ్లలో చాలా అరుదుగా సచివాలయానికి వచ్చి వెళ్లారు. అధికారిక నివాసం ప్రగతి భవన్‌ నుంచే ఆయన పాలనా వ్యవహారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

బిజీబిజీగా సీఎస్‌.. 
అసెంబీ రద్దు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బుధవారం సచివాలయానికి సందర్శుకుల తాకిడి పెరిగింది. సీఎస్‌ జోషి సైతం సాధారణ సందర్శకుల సందర్శన సమయాన్ని రద్దు చేసుకుని నీటిపారుదల, పోలీసు, సాధారణ పరిపాలన, విద్య, వైద్యం తదితర శాఖ పెండింగ్‌ ఫైళ్లను పరిష్కరించడంలో తీరిక లేకుండా గడిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరి రెండు త్రైమాసికాలకు సంబంధించి నియోజకవర్గాల అభివృద్ధి నిధి మంజూరు ఫైళ్ల కియరెన్స్‌ కోసం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జీవన్‌రెడ్డి సీఎం కార్యాలయ కార్యదర్శులను కలిశారు. గురువారంలోగా పెండింగ్‌ పైళ్లన్నింటినీ పరిష్కరించాలని అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశించింది. పెండింగ్‌ ఫైళ్లకు సంబంధించిన స్థితిగతులను ఆయా శాఖల అధికారులు సీఎస్‌కు నివేదించి ఆన్‌లైన్‌లో సత్వర ఆమోదం పొందుతున్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు, రోడ్ల అభివృద్ధి, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి వంటి వాటికి నిధు లు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్లు సైతం పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావుకు ప్రతిపాదనలు పంపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top