20 నుంచి ఎస్‌ఐ  రాత పరీక్షలు

Telangana Police Sub Inspector Written Test Starts From April 20 - Sakshi

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

15 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ 

హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో కేంద్రాలు 

షెడ్యూలు విడుదల చేసిన రిక్రూట్‌మెంట్‌ బోర్డు 

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రాత పరీక్షల షెడ్యూలు ఖరారైంది. ఈనెల 15వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 18 అర్ధరాత్రి వరకు అభ్యర్థులు http://www.tslprb.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఎస్‌ఐ సివిల్, టెక్నికల్‌ రాత పరీక్షలకు సంబంధించిన షెడ్యూలు విడుదల చేసింది. ఇటీవల దేహదారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణులైన 1,05,061 మంది తుదిరాత పరీక్షకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరంతా 20 నుంచి జరగబోయే తుది పరీక్షలు రాయనున్నారు.

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలు, బయోమెట్రిక్‌ యంత్రాలు, హాల్‌టికెట్లను సిద్ధం చేశారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ కాకపోతే..: హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ కాని అభ్యర్థులు support@tslprb.in ఈ–మెయిల్‌ చేయాలని లేదా 9393711110, 9391005006 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని నియామక బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. కాగా, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిచ్చేది లేదని బోర్డు స్పష్టం చేసింది. అభ్యర్థులు చేతి గడియారాలు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు తీసుకురావొద్దని స్పష్టం చేసింది. 

చదువుకునే సమయమేదీ.. 
పోలీసు శాఖలో దాదాపు 3 వేల మంది కానిస్టేబుళ్లు ఎస్‌ఐ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 1,500 మందికిపైగా తుదిరాత పరీక్షకు అర్హత సాధించారు. తుది రాత పరీక్ష రాసేందుకు తగినంత సమయం లేదని మొదటినుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న వీరు.. షెడ్యూలులో మార్పు లేకపోవడంతో వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుళ్లు పోలింగ్, ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌లు, శ్రీరామనవమి వేడుకలకు బందోబస్తు కోసం డ్యూటీల్లో చేరారు. ఇక తమకు చదువుకునే సమయం ఎక్కడిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సెలవులు పెట్టి చదువుకుంటున్న కానిస్టేబుళ్లకు డీజీపీ కార్యాలయం నోటీసులు పంపింది.

ఎన్నికల నేపథ్యంలో ఎవరికీ సెలవులు లేవని, ఏప్రిల్‌ 1లోగా రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో వారంతా వచ్చి ఎన్నికల విధుల్లో చేరారు. కాగా, ఎస్‌ఐ రాత పరీక్షలకు సిద్ధమవుత్నున పోలీసు కానిస్టేబుళ్లు, హోంగార్డులకు శ్రీరామనవమి తర్వాత సెలవు ఇవ్వాలని పోలీసు శాఖ నిర్ణయించిందని విశ్వసనీయ సమాచారం. శ్రీరామనవమి అనంతరం తుది రాత పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులు సెలవు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ మేరకు అనధికారికంగా ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ధ్రువీకరించడం లేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top