కేంద్రం నిఘా నేత్రం

Telangana Police Series On Fake Id Proofs In Old City - Sakshi

 శరణార్థుల వ్యవహారాలపై ఎప్పటికప్పుడు ఢిల్లీకి నివేదిక 

యెమన్‌ పౌరుడికి పాస్‌పోర్టుపై రాష్ట్ర పోలీసులు సీరియస్‌

ఇలాంటి ధ్రువీకరణలు పౌరసత్వం కిందకు రావంటున్న అధికారులు

ఈ కార్డులతో విదేశాల్లో ఉగ్ర చర్యలకు పాల్పడితే దేశ పరువుకు భంగమే!

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ పాతబస్తీలోని నకిలీ ధ్రువీకరణ పత్రాల అంశంలో పలు కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 127 మంది రోహింగ్యాలకు ఆధార్‌ కార్డుల వ్యవహారం, విదేశీయుల వద్ద భారత పాస్‌పోర్టుల అంశాలు కలకలం రేపడంతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. కొందరు స్థానికులు కావాలనే వీరికి ఈ పత్రాలు ఇప్పిస్తున్నారని గుర్తించారు. ఇప్పటికే వారిని గుర్తించిన పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మ రం చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఇంటెలిజెన్స్‌ కూడా సమాచారం సేకరించింది. పాతబస్తీలో అక్రమంగా నివసిస్తోన్న విదేశీయుల అక్రమాలపై కేంద్ర నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ఢిల్లీకి నివేదికలు పంపుతూనే ఉన్నాయి. విదేశీయులు ఈ కార్డులు కలిగి ఉండటం వల్ల దేశభద్రతకు భంగం వాటిల్లడమే కాకుండా, ఈ కార్డులతో పలు దేశాల్లో ఉగ్రచర్యలు, ఆత్మాహుతి దాడులకు పాల్పడితే.. ఆ నింద మన దేశం మోయాల్సి వస్తుందని పలువురు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

తీవ్రంగా పరిగణిస్తోన్న పోలీసులు
యెమన్‌ దేశస్తుడికి పాస్‌పోర్టు వచ్చిన విషయంపై తెలంగాణ పోలీసులు కూడా సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఈ వ్యవహారంలో అంతర్గత విచారణకు ఆదేశించారని సమాచారం. చూడగానే విదేశీయుడు అని తెలిసిపోతున్నా.. యెమన్‌ దేశస్తుడు ముబారక్‌కు భారత పాస్‌పోర్టు రావడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని పాస్‌పోర్టు విచారణకు వెళ్లిన పోలీసు అధికారిని ప్రశ్నించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో డబ్బులు తీసుకునే విచారణలో అతనికి అనుకూలంగా రిపోర్టు ఇచ్చి పాస్‌పోర్టు వచ్చేలా సహకరిం చారని ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. భారత ధ్రువీకరణ కార్డులతో విదేశాలకు వెళ్లి అక్కడ ఉగ్రచర్యలకు పాల్పడితే.. ఆ నింద మన దేశం మోయాల్సి ఉంటుందని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆ కార్డులతో పౌరసత్వం వచ్చినట్లు కాదు..
ఆధార్, పాన్, ఓట రు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సులు కలిగి ఉన్న విదేశీయులపై ఇప్పటికే పదుల సం ఖ్యలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కేసులు పెట్టారు. వీరు ఈ గుర్తింపు కార్డులతో భారతీయులు అయిపోరని స్పష్టం చేస్తున్నారు.  బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి అసోంలో స్థిరపడిన పలువురు దాదాపు 15 రకాల భారత ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉన్నా.. వారికి భారత పౌరసత్వం లభించని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  

పాతబస్తీ పరిణామాలపై కేంద్ర ఇంటెలిజెన్స్‌ ఆరా
ధ్రువీకరణ పత్రాలెలా తీసుకుంటున్నారంటే?దేశంలో అక్రమంగా చొరబడి నగర శివార్లలో తలదాచుకుంటున్న వేలాది మందికి పాతబస్తీలో పలువురు ఆశ్రయం కల్పిస్తున్నారు. వీరిలో పలువురు కాంట్రాక్టర్లు, చిన్న చిన్న పరిశ్రమల నిర్వాహకులు ఉన్నారు. వారు తమ ఖార్ఖానాల్లో తక్కువ ధరకు పనిచేసేందుకు వీరిని పెట్టుకుంటున్నారు. రాత్రిపూట సంచరించే సమయంలో, తరచుగా శివారు కాలనీల్లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ చేస్తున్నప్పుడు ధ్రువీకరణ పత్రాలు అడుగుతుండటం వారికి ఇబ్బందికరంగా మారింది. దీంతో సదరు ఆశ్రయం కల్పించిన నిర్వాహకులే తమ ఇంటి కరెంటు బిల్లులు ఇచ్చి విదేశీయులకు ఓటరు, ఆధార్, పాన్‌ తదితర ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు ఇప్పిస్తున్నారు. పాతబస్తీలో డబ్బులు తీసుకుని పనిచేసే కొందరు ఏజెంట్లు కూడా ఈ తతంగానికి సహకరిస్తున్నారు. దీంతో వీరు సులువుగా అన్ని రకాల ధ్రువీకరణలు పొందుతున్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top