షెడ్యూల్‌ వచ్చేసింది..

Telangana Panchayat Elections Schedule - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ రానే వచ్చింది. గత ఆరు నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బీసీ ఓటర్ల గణన, రిజర్వేషన్ల ఖరారు, ముందస్తు శాసనసభ ఎన్నికల దృష్ట్యా స్థానిక ఎన్నికల ప్రక్రియ మందగించింది. జనవరిలోగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే పల్లె పోరుకు ఎన్నికల సంఘంతోపాటు జిల్లా యంత్రాంగం  సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎట్టకేలకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేయడంతో స్థానిక సమరానికి మార్గం సుగమమైంది.

ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. బ్యాలెట్‌ పద్ధతిలో మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత ఈ నెల 21న నిర్వహించనుండగా, రెండో విడత 25న, మూడో విడత ఈ నెల 30న జరగనుంది. ఆయా పోలింగ్‌ తేదీల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. తర్వాత ఉప సర్పంచ్‌ ఎన్నికను సైతం అదే రోజు చేతులెత్తే పద్ధ తి ద్వారా ఎన్నుకోనున్నట్లు షెడ్యూల్‌లో స్పష్టం చేశారు. అయితే మొదటి సారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటా ఉండనుంది. కాగా, షెడ్యూల్‌ విడుదలైన రోజు నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.
 
మూడు విడతలుగా ఎన్నికలు  
జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. బేల మండలంలోని రెండు పంచాయతీలు మినహా 465 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ పంచాయతీల పరిధిలో మొత్తం 3,806 వార్డులు ఉన్నాయి. జిల్లాలో మొదటి విడతలో 153 గ్రామ పంచాయతీలకు, 1,240 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో ఆదిలాబాద్‌ మండలంలోని 34 పంచాయతీలకు, 280 వార్డులకు, మావలలోని మూడు పంచాయతీలకు, 28 వార్డులకు, బేలలోని 35 పంచాయతీలకు 286 వార్డులకు, జైనథ్‌లోని 42 జీపీలకు, 342 వార్డులకు, తాంసిలోని 13 జీపీలకు, 108 వార్డులకు, భీంపూర్‌లోని 26 జీపీలకు, 196 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.

రెండో విడతలో 149 జీపీలకు, 1208 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో బోథ్‌లోని 33 జీపీలకు, 278 వార్డులకు, బజార్‌హత్నూర్‌లోని 30 జీపీలకు, 240 వార్డులకు, నేరడిగొండలోని 32 జీపీలకు, 252 వార్డులకు, గుడిహత్నూర్‌లోని 26 జీపీలకు, 208  వార్డులకు, తలమడుగులోని 28 జీపీలకు, 230 వార్డులకు రెండో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. మూడో విడతలో మొత్తం 163 జీపీలకు, 1358 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో ఇంద్రవెల్లి మండలంలోని 28 పంచాయతీలకు, 236 వార్డులకు, ఉట్నూర్‌లోని 36 జీపీలకు, 312 వార్డులకు, నార్నూర్‌లోని 23 జీపీలకు, 198 వార్డులకు, గాదిగూడ మండలంలోని 25 జీపీలకు, 196 వార్డులకు, సిరికొండలోని 19 జీపీలకు, 148 వార్డులకు, ఇచ్చోడలోని 32 జీపీలకు, 268 వార్డులకు మూడో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి.  

ప్రోగ్రాం                             మొదటి విడత      రెండో విడత           మూడో విడత  
ఎన్నికల నోటీస్‌ విడుదల     జనవరి 7           జనవరి 11            జనవరి 16 
నామినేషన్ల స్వీకరణకు ఆఖరు     జనవరి 9      జనవరి 13           జనవరి 18 
నామినేషన్ల పరిశీలన           జనవరి 10             జనవరి 14       జనవరి 19 
అప్పీలుకు ఆఖరు తేది         జనవరి 11            జనవరి 15         జనవరి 20 
నామినేషన్ల ఉపసంహరణకు    జనవరి 13      జనవరి 17            జనవరి 22 
బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన   జనవరి 13   జనవరి 17           జనవరి 22 
పోలింగ్‌                            జనవరి 21    జనవరి 25              జనవరి 30 
ఓట్ల లెక్కింపు, ఫలితాలు     జనవరి 21       జనవరి 25             జనవరి 30  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top