పల్లె పోరు సాధ్యమేనా..!

Telangana Panchayat Elections Adilabad - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయా..? హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం ధర్మాసనం ముందుకు వెళ్తే ఎన్నికలకు నిర్వహించాల్సిందేనని ఆదేశించవచ్చా..? ప్రస్తుతం నడుస్తున్న ఎన్నికల సీజన్‌ చూస్తే అవుననే సమాధానమే వస్తోంది. మూడు నెలల్లోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వíహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పల్లె పోరుకు సంబంధించి ఈసీ ఎలాంటి సమాచారం అందినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండేలా సమాయత్తం అవుతోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం జిల్లా యంత్రాంగం డిసెంబర్‌లో జరగనున్న సాధారణ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది.

సమీక్షలు, సమావేశాలు, శిక్షణలు, ఓటరు యంత్రాల వినియోగంపై ప్రజలకు అవగాహనలు కల్పించడంలో తీరిక లేకుండా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వచ్చే నెల 12న నోటిఫికేషన్, డిసెం బర్‌ 7న పోలింగ్‌ చేపట్టాలని సీఈసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 11న ఓట్ల లెక్కిం పు చేపట్టనున్నారు. ఈ లెక్కన ఇప్పటి నుంచే లెక్కేసుకున్నా.. 2019 జనవరి 11లోగా గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు పూర్తి కావాలి. అంటే నెలలో పల్లెపోరును నిర్వహించడం సాధ్యమేనా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిర్వహణకు ఈసీ నుంచి ఆదేశాలు వస్తే ఒకేసారి అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పవచ్చు. దీంతో ఉన్నతాధికారులతోపాటు ఉద్యోగులు, ఎన్నికల సిబ్బంది ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి.

అంతాసిద్ధం..
ప్రభుత్వం గత మే, జూన్‌ మాసాల్లో పంచాయతీల ఎన్నికల నిర్వహణకు హడావుడి చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు నెలల క్రితమే ఎన్నికల నిర్వహణకు అన్ని సిద్ధం చేశారు. జిల్లాలో పాత 243 గ్రామ పంచాయతీలకు 2013లో ఎన్నికలు జరిగాయి. అప్పటి పోరులో గెలిచిన వారు సర్పంచ్‌లుగా బాధ్యతలు చేపట్టి ఈ యేడాది ఆగస్టు ఒకటో తేదీతో ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వం కొత్తగా మరో 226 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. అన్ని కలుపుకొని ప్రస్తుతం జిల్లాలో పంచాయతీల సంఖ్య 467కు చేరింది. ఈ పంచాయతీల పరిధిలో 3,822 వార్డులు ఉన్నాయి. పంచాయతీలతోపాటు వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు గత జూలైలో అధికారులు అన్ని సిద్ధం చేశారు.

4 వేలకుపైగా బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేయగా, పోలింగ్‌ కేంద్రాలనూ గుర్తించారు. ఎన్నికల్లో వినియోగించే బ్యాలెట్‌ బాక్సులు మనవద్ద అందుబాటులో లేకుంటే పక్క రాష్ట్రాల నుంచి తెప్పించి పోరుకు సిద్ధంగా ఉంచారు. గత జూలైలో విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 3,36,647 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,68,741 మంది ఉండగా, 1,67,825 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 81 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు అధికారులు సిద్ధం చేసిన ఓటరు జాబితాలో స్పష్టంగా ఉంది. జైనథ్‌ మండలంలో అత్యధికంగా 33,577 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువగా మావలలో 3,370 మంది ఓటర్లు ఉన్నారు. గతేడాది ఓటర్ల జాబితాతో పోల్చుకుంటే ఇప్పుడా సంఖ్య కొంత పెరిగింది. ఇదిలా ఉండగా, జిల్లాలోని బజార్‌హత్నూర్, భీంపూర్, బోథ్, గాదిగూడ, ఇచ్చోడ, నేరడిగొండ, తలమడుగు, తాంసి మండలాల్లో పంచాయతీ ఓటర్లు పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉండడం గమనార్హం.

వరుస ఎన్నికలేనా..?
మూడు నెలల్లోగా గ్రామ పంచాయతీలకు ఎన్ని కల నిర్వహించాలని జిల్లా అధికారులకు ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వస్తే వరుసగా ఎన్నికలు జరగనున్నాయని చెప్పవచ్చు. ఈ యేడాది డిసెంబర్‌లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, జనవరిలో గ్రామ పంచాయతీలకు జరుగుతాయి. పార్లమెంట్‌ సభ్యుల పదవీ కాలం కూడా వచ్చే ఏప్రిల్‌ లేదా మే నెలలో పూర్తి కానుండడంతో అప్పుడు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జిల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించి 2019 ఆగస్టుతో ఐదేళ్లు పూర్తి కానుంది. అంతకు ముందే వాటికి కూడా ఎన్నికలు నిర్వహించి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఇక మున్సిపాలిటీలకు కూడా 2014 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికలు జరిగాయి. అంటే అవి కూడా నిర్వహించక తప్పదు. దీనిని బట్టి చూస్తే ఇప్పటి నుంచి యేడాదంతా ఎన్నికల సందడి మొదలు కానుందనడంలో సందేహం లేదు. పంచాయతీ పోరుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం ధర్మాసనం ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే యంత్రాంగానికి, ఎన్నికల సిబ్బందికి కొంత ఊరట కలిగే అవకాశాలున్నాయి. 

యంత్రానికి పరీక్షే..
పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నుంచి ఆదేశాలు వస్తే జిల్లా యంత్రాంగానికి ఎన్నికల నిర్వహణ ఓ సవాలుగా మారనుంది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులో ఉన్నందున జిల్లాలో నోడల్‌ అధికారులూ నియామకం అమయ్యారు. ఇక రెవెన్యూ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ వేగవంతం కానుంది. మరో పక్కా ప్రభుత్వం ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఆయా ప్రభుత్వ అధికారులకు స్థాన చలనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాపై అవగాహన కలిగిన అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లనుండడంతో అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణ యంత్రాంగానికి పరీక్షగా మారే అవకాశాలున్నాయని చర్చించుకుంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top