పల్లెపోరు

Telangana Panchayat Election Green Signal High Court Mahabubnagar - Sakshi

సాక్షి, వనపర్తి: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం పల్లెపోరుకు సన్నద్ధమవుతోంది. దీనిపై అధికార యంత్రాంగం తగిన కార్యాచరణపై దృష్టిసారించింది. పంచాయతీ ఎన్నికలను గడువులోగా నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించడంపై హైకోర్టు ఈనెల 11న తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించడం ఏకపక్ష నిర్ణయమని, రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. తీర్పు వెలువడిన మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు సంక్రాంతి పండగలోపే ఎన్నికలు ముగించాల్సి ఉంటుంది.
 
అభ్యర్థుల ఆశలపై నీళ్లు! 

ఈ ఏడాది జూలైలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం జూన్‌ నాటికే ఓటరు తుదిజాబితా విడుదల, పోలింగ్‌ బూత్‌ల గుర్తింపు, ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, బ్యాలెట్‌ బాక్స్‌లను సిద్ధం చేయడం, బ్యాలెట్‌ నమూనాలు, ప్రింటింగ్‌ వంటి పనులు పూర్తిచేసింది. రేపోమాపో ఎన్నికల షెడ్యూల్‌ సైతం విడుదల కానున్న సమయంలో రిజర్వేషన్ల ప్రక్రియ తేలే వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకూడదని గత జూన్‌ 26న హైకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేసిన అధికారులు వాటిని పక్కన పెట్టేశారు. ఎన్నికల సామగ్రిని సైతం స్టోర్‌రూమ్‌లకు తరలించారు. ఇంతలో కోర్టు తీర్పు నేపథ్యంలో ఆశావహుల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లయింది. మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదలు కానుంది.
  
అధికారులకు ప్రత్యేక శిక్షణ 
సెప్టెంబర్‌ 25న అసెంబ్లీ ఎన్నికలకు విడుదల చేసిన ఓటరు తుదిజాబితా ఆధారంగానే ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ఆదేశాలను ప్రభుత్వం ఇటీవల జారీచేసింది. నవంబర్‌ మొదటి వారం నుంచి మూడో వారంలోగా గ్రామాలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను తయారుచేసి అన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద అతికించనున్నారు. నవంబర్‌ నాలుగో వారం నుంచి డిసెంబర్‌ మొదటి వారం వరకు పోలింగ్‌ స్టేషన్ల వారీగా కొత్త ఓటర్లను చేర్చడంతో పాటు మరోసారి జాబితాను ప్రచురించనున్నారు. నవంబర్‌ నాలుగో వారం లేదా డిసెంబర్‌ మొదటి వారంలో రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, స్టేజీ –1, స్టేజీ –2 అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనున్నారు. డిసెంబర్‌ రెండో వరకు ఎన్నికల సమాచారాన్ని సేకరించడం, ఏర్పాట్లను పూర్తిచేయడం వంటి పనులను పూర్తిచేయనున్నారు. ఈ ఎన్నికల ఏర్పాట్లకు సబ్‌కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీ, పంచాయతీ సెక్రటరీలు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది.
  
రిజర్వేషన్ల అంశమే కీలకం 
గడువులోగా ఎన్నికలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం మేలో రిజర్వేషన్లను ప్రకటించింది. దీని ప్రకారం ఎస్టీలకు 5.17శాతం, ఎస్సీలకు 20.46శాతం, బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కేటాయించింది. కానీ వీటిని సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ప్రభుత్వం మరోసారి ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్న తరుణంలో రిజర్వేషన్ల అంశం కీలకం కానుంది. పాత వాటి ప్రకారమే రిజర్వేషన్లు ఖరారు చేస్తారా ? లేక కొత్తగా ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది.

గ్రామాల్లో రాజకీయ వేడి  
ఆగస్టు 2న   గ్రామపంచాయతీ     పాలకవర్గాలకు   గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. అదేరోజు నుంచి కొత్త పంచాయతీలుగా అవతరించిన తండాలు, అనుబంధ గ్రామాల్లోనూ పంచాయతీ కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు ప్రత్యేకాధికారులను నియమించారు. వనపర్తి జిల్లాలో కొత్తగా ఏర్పడిన వాటితో కలిపి 255 గ్రామ పంచాయతీలు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 255, నాగర్‌కర్నూల్‌లో 543, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 721 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రత్యేకాధికారుల పాలనలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో   ప్రజలు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటికే అన్నిపార్టీలు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. దీనికితోడు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతుండటంతో గ్రామాల్లో మరింత రాజకీయ వేడి రాజుకోనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top